కోడి వ్యర్థాల సేకరణ టెండర్లలో గోల్‌మాల్
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:57 AM
చికెన్ వ్యర్థాల సేకరణ టెండర్ల ఖరారులో కొంతమంది ప్రజా ప్రతినిధులు చక్రం తిప్పారు.

జీవీఎంసీ పరిధిలో అధికారికంగా ఉన్న చికెన్ దుకాణాలు 1,500
అనధికారికంగా ఉన్న దుకాణాలు(అంచనా) 1,000
రోజుకి ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలు మూడు టన్నులు
---------------------------
ప్రజా ప్రతినిధులు, నేతలు సూచించిన వారికే కాంట్రాక్టులు
ఒక్కో నేత సూచించిన వ్యక్తికి ఒక్కో జోన్ కేటాయింపు
కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు చేరని వ్యర్థాలు
యథావిధిగా చేపల చెరువులకు తరలింపు
పారదర్శకంగా నిర్వహించాలని జీవీఎంసీ అధికారులు భావించినా
ముందుకుసాగనివ్వని నాయకులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
చికెన్ వ్యర్థాల సేకరణ టెండర్ల ఖరారులో కొంతమంది ప్రజా ప్రతినిధులు చక్రం తిప్పారు. తాము సూచించిన వారికే కేటాయించాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి...అనుకున్నది సాధించారు. పేరుకు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలిచినప్పటికీ...రాజకీయ నాయకులు సిఫారసు చేసిన వారికే కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జీవీఎంసీ పరిధిలో అధికారికంగా దాదాపు 1,500 చికెన్ దుకాణాలు ఉండగా, అనధికారికంగా మరో వెయ్యి వరకూ ఉన్నాయి. వాటి నుంచి ప్రతిరోజూ మూడు టన్నుల వరకు చికెన్‌వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ వ్యర్థాలను కాపులుప్పాడలోని యార్డుకు తరలించే బాధ్యతను జీవీఎంసీ కాంట్రాక్టర్లకు అప్పగించేది. అయితే చేపల చెరువుల్లో వినియోగించడం మొదలెట్టడంతో చికెన్ వ్యర్థాలకు డిమాండ్ పెరిగింది. వైసీపీ హయాంలో చికెన్ వ్యర్థాల సేకరణకు జీవీఎంసీ అధికారులు టెండర్లు పిలవగా, కొందరు కాంట్రాక్టర్లు వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులకు ముడుపులు చెల్లించి మరీ టెండర్లు దక్కించుకున్నారు. వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్కరి పేరు సిఫారసు చేయడంతో ఒక్కొక్కరికి రెండేసి జోన్‌లు చొప్పున నలుగురికి సర్దుబాటు చేశారు. రెండేళ్లు గడిచిపోవడంతో ఐదు నెలల కిందట జీవీఎంసీ అధికారులు తిరిగి టెండర్లు పిలిచారు. ఆరోపణలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా కేటాయింపు జరపాలనే ఉద్దేశంతో అప్పటి జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించారు. ఆమోదయోగ్యమైన రేటుకు చికెన్ వ్యర్థాలను కాపులుప్పాడ తరలించేందుకు ముందుకొచ్చేవారికే టెండర్లు ఖరారు చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, చికెన్ వ్యర్థాల ద్వారా డబ్బు సంపాదనకు అలవాటుపడిన కొంతమంది కాంట్రాక్టర్లు తమకు టెండర్ వచ్చేలా చూడాలని కూటమి ప్రజా ప్రతినిధులను కలిశారు. దాంతో తాము సూచించిన వారికే వ్యర్థాల టెండర్లు ఇవ్వాలని జీవీఎంసీ అధికారులకు ఆయా ప్రజా ప్రతినిధులు ఫోన్లు చేశారు. ప్రజా ప్రతినిధుల మాట కాదనలేని అధికారులు...చాలామంది వద్ద నుంచి సిఫార్సులు వచ్చాయని, ఎలా ముందుకెళ్లాలని వారినే తిరిగి ప్రశ్నించారు. వారి సూచన మేరకు ఒక్కో ప్రజాప్రతినిధి సూచించిన వారికి ఒక్కో జోన్ చొప్పున ఎనిమిది జోన్లను సర్దుబాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండరు పిలిచిన అధికారులు అందరి సమక్షంలోనే టెక్నికల్ బిడ్‌ను, తర్వాత ఫైనాన్స్ బిడ్‌ను ఓపెన్ చేసి ఎవరు అర్హత సాధించారు, ఎవరు ఆమోదయోగ్యమైన ధరకు కోట్ చేశారనేది చూసి కాంట్రాక్టర్‌ను ఎంపికచేయాలి. కానీ ప్రజాప్రతినిధుల జోక్యంతో అధికారులు ఈ ప్రొక్యూర్‌మెంట్‌ను పక్కనపెట్టేసి ప్రజా ప్రతినిధులు సూచించిన వారికి అనధికారికంగానే ఒక్కో జోన్ చొప్పున వర్క్ ఆర్డర్లు ఇచ్చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యర్థాలు సేకరించే వారంతా కాపులుప్పాడ యార్డుకు కాకుండా చేపల చెరువులకు తరలిస్తున్నాసరే తాము చోద్యం చూడాల్సి వస్తోందని అధికారులు వాపోతున్నారు.
రాజమండ్రిలో మాదిరిగా చికెన్ వ్యర్థాలను పర్యావరణ హితంగా ప్రాసెస్ చేసి ఎరువుగా మార్చే యూనిట్‌ను కాపులుప్పాడలో ఏర్పాటుచేయాలని గత కమిషనర్ సంపత్‌కుమార్ భావించారు. అందుకోసం రాజమండ్రిలో యూనిట్‌ను ఏర్పాటుచేసిన సంస్థకు కాపులుప్పాడలోని యార్డులోని ఐదెకరాలు కేటాయించారు. ఆ సంస్థ జీవీఎంసీకి ఏటా రూ.1.5 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఆ దిశగా ఒప్పందం చేసుకుంటారనుకుంటున్న సమయంలో సంపత్‌కుమార్‌కు బదిలీ అయ్యింది. దాంతో ఆ యూనిట్ ఏర్పాటు మరుగునపడినట్టేనని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.