Share News

జీబీఎస్‌ కలకలం

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:41 AM

దేశంలోని అనేక రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసులు విశాఖలో నమోదుకావడం కలకలం రేపింది.

జీబీఎస్‌ కలకలం

  • నగరంలో నాలుగు రోజుల వ్యవధిలో ఐదు కేసులు నమోదు

  • కేజీహెచ్‌లోని ఎక్యూట్‌ మెడికల్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స...నిలకడగా ఆరోగ్యం

  • ఈ కేసులు కొత్త కాదంటున్న వైద్యులు

  • ఆందోళన చెందొద్దని సూచన...

  • ప్రతినెలా కేజీహెచ్‌కు ఐదు నుంచి పది కేసులు వస్తుంటాయని వెల్లడి

  • అలాగని నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిక

విశాఖపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):

దేశంలోని అనేక రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసులు విశాఖలో నమోదుకావడం కలకలం రేపింది. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు ఈ సమస్యతో కేజీహెచ్‌లో చేరారు. ప్రస్తుతం జనరల్‌ మెడిసిన్‌ విభాగంలోని అక్యూట్‌ మెడికల్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే, పూర్తిగా కోలుకునేంత వరకు తమ పర్యవేక్షణలో సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.

జీబీఎస్‌ కేసులు నమోదైనట్టు తెలియడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకు వచ్చినది కాదని, ఎప్పటి నుంచో ఈ తరహా సమస్యలతో రోగులు వస్తున్నారని అంటున్నారు. కేజీహెచ్‌కు ప్రతినెలా ఈ తరహా కేసులు పది వరకూ వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాగని నిర్లక్ష్యం వహించవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఈ కేసులు నమోదు కావడానికి గల కారణాలు తెలియాల్సి ఉందంటున్నారు. ఇది కొవిడ్‌ వైరస్‌ తరహాలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేది మాత్రం కాదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వైరల్‌ ఫీవర్స్‌, డయేరియా తగ్గిన తరువాత, బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల జీబీఎస్‌ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్‌ ప్రభావంతో మెదడు నరాలపై ఉండే అత్యంత కీలకమైన మ్యాలిన్‌ పొర దెబ్బతింటుంది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీ బాడీస్‌ మ్యాలీన్‌ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్‌ అందక అవయవాలు చచ్చుబడిపోతాయి. అటువంటి సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే నరాలు ప్రభావితమైతే కాళ్లు చచ్చుబడిపోతాయి. అచేతనం కావడం కింది నుంచి పైకి పాకుతుంది. దీంతో వీపు భాగం, చేతులు, మెడ కండరాలు దేహమంతా పూర్తి అచేతనంగా మారుతుంది. మింగడం కూడా కష్టమవుతుంది. కళ్లు మూయలేని స్థితికి చేరుకుంటాడు.

వారం నుంచి రెండు వారాల్లో తగ్గుముఖం

సాధారణంగా ఈ వైరస్‌ బారినపడినట్టయితే ఒక్కసారిగా కాళ్లు, చేతులు పడిపోవడం జరుగుతుంది. ఒక్కోసారి ఊపిరితిత్తులోకి వెళ్లి ఆయాసం పెరిగిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. వ్యాధి మొదలైన వారం నుంచి రెండు వారాల తరువాత తీవ్రమై మళ్లీ తగ్గుముఖం పడుతుంది. మ్యాలీన్‌ పొర యథాస్థితికి వచ్చిన తరువాత రోగి కోలుకుంటాడు. ఇందుకోసం ఆటో ఇమ్యునో గ్లోబులిన్స్‌ వంటి మందులు అందిస్తారు.

నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం

- డాక్టర్‌ కె రాంబాబు, విమ్స్‌ డైరక్టర్‌

జీబీఎస్‌ వ్యాధి నాడీ వ్యవస్థను తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తుంది. వైరస్‌ల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇది ఆటో ఇమ్యునో డిజార్డర్‌. పూర్తిగా నరాలపై దాడి చేస్తుంది. కాబట్టి ఒక్కసారిగా ఒక కాలు, ఒక చేయి పడిపోవడం, కొన్నిసార్లు రెండు కాళ్లు, చేతులు పడిపోవడం జరుగుతుంది. ఎక్కువసార్లు శ్వాసకోశ ఇబ్బందులకు దారితీసి ప్రాణం పోయేందుకు కారణమవుతుంది. సాధారణంగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు తరువాత ఈ వ్యాధి బారినపడుతుంటారు. అరుదైన వ్యాధి కాదు. ఎప్పటికప్పుడు ఇటువంటి కేసులు చూస్తుంటాం. రోగి పరిస్థితిని బట్టి అవసరమైన మందులు అందించి కోలుకునేలా చేస్తాం.

Updated Date - Feb 15 , 2025 | 12:41 AM