Share News

గాజువాక భూ సమస్య పరిష్కారం

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:59 AM

గాజువాకలో అభ్యంతరం లేని ఇనాం భూముల్లో ఆక్రమణదారుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది.

గాజువాక భూ సమస్య పరిష్కారం

  • ఇనాం భూముల్లో ఆక్రమణలు క్రమబద్ధీకరణ

  • మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌

  • 301 జీవో ప గుర్తించిన ఆక్రమణదారులకు అవకాశం

  • 1000 గజాల వరకూ అవకాశం

  • సుమారు ఐదు వేల మందికి ప్రయోజనం

విశాఖపట్నం/గాజువాక, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):

గాజువాకలో అభ్యంతరం లేని ఇనాం భూముల్లో ఆక్రమణదారుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో సుమారు ఐదు వేల మందికి ప్రయోజనం కలగనున్నది. వెయ్యి గజాల వరకూ రెగ్యులరైజ్‌ చేసేందుకు అవకాశం ఉంది.

గాజువాక ప్రాంతంలో సుమారు 200 ఎకరాల ఇనాం భూములను దశాబ్దాల కిందట కొందరు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే ఆ భూములపై 1994లో అప్పటి ప్రభుత్వం హౌస్‌ కమిటీ నియమించింది. దీంతో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇళ్ల మరమ్మతులు, కొనుగోళ్లు, అమ్మకాలు, కొత్త నిర్మాణాలకు అవకాశం లేకుండా పోయింది. తమ ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని అప్పటినుంచి వారు కోరుతూనే ఉన్నారు. అనేక ప్రభుత్వాలు మారాయి. సమస్య పరిష్కారం కాలేదు. రాష్ట్ర విభజన తరువాత అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం 2016లో గాజువాక ఇనాం భూముల సమస్య పరిష్కారానికి 301 జీవో ఇచ్చింది. దీని ప్రకారం ఆక్రమణల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించింది. సుమారు 12 వేల దరఖాస్తులు రాగా, ఐదు వేల దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన ఏడు వేల మంది దరఖాస్తుదారులకు పట్టాలు ఇచ్చారు. జీవో 301 మేరకు పట్టా ఇచ్చిన రెండేళ్ల తరువాత కన్వేయన్స్‌ డీడ్‌లు జారీచేసి హక్కులు కల్పించాల్సి ఉంది. కానీ 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లపాటు కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వలేదు. చివర్లో అంటే 2023లో దరఖాస్తులు పరిశీలించి సుమారు 5,200 మందికి కన్వేయన్స్‌ డీడ్లు జారీచేసింది. మరో 1,800 మందికి డీడ్లు జారీచేయాల్సి ఉంది. ఇదిలావుండగా 2016లో ఆక్రమణల క్రమబద్ధీకరణపై అవగాహన లేక/సమాచారం తెలియక/వివిధ రకాల వివాదాలతో సుమారు మూడు వేల మందికిపైగా దరఖాస్తు చేసుకోలేదు. దాంతో వారంతా ఆందోళన వ్యక్తం చేయడంతో కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం...సమస్య పరిష్కారంపై దృష్టిసారించింది. వారం క్రితం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో జిల్లా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాజువాక ఇనాం భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ అంశం చర్చకు వచ్చింది. ఆక్రమణల క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు గురువారం మంత్రివర్గం చర్చించి ఆమోదించింది. దీనికి సంబంధించి త్వరలో పూర్తి విధి విధానాలు జారీచేస్తారు. గతంలో పట్టాలు ఇచ్చి కన్వేయన్స్‌ డీడ్స్‌ కోసం ఎదురుచూస్తున్న 1800 మందితో పాటు పలు కారణాలతో దరఖాస్తు చేయని సుమారు మూడు వేల మందికి అవకాశం ఇవ్వనున్నారు.

ఆవేదనతో ఉన్న ప్రజలకు ఊరట లభించింది

పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, గాజువాక

గాజువాకలో ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్న కుటుంబాల ఆవేదనను కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఆక్రమణల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడంతో వారికి ఊరట లభించింది. సమస్య పరిష్కారానికి మూడు దశాబ్దాల నుంచి ప్రజలు పోరాడుతున్నారు. గతంలో జీవో 301 ప్రకారం 5,200 మందికి సీఎం చంద్రబాబు పట్టాలు ఇప్పిస్తే వైసీపీ ప్రభుత్వం వారికి హక్కులు కల్పించలేదు. తిరిగి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత గాజువాక ఆక్రమణలపై స్పందించడం గొప్ప విషయం. గాజువాకలో ఐదు వేల మంది మంది ఆక్రమణదారుల తరపున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు.

Updated Date - Feb 07 , 2025 | 12:59 AM