Share News

డీసీసీబీలో నిధులు గోల్‌మాల్‌!

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:42 AM

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో అవినీతి తీగ లాగితే డొంక కదులుతోంది. గత వైసీపీ పాలనలో గుట్టుగా సాగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధికారం చేతలో వుండడంతో డీసీసీబీ నిధులు భారీ మొత్తంలో బొక్కేశారు. పీఏసీఎస్‌లు రైతులకు ఇవ్వాల్సిన రుణాలు పక్కదారి పడుతున్నాయంటూ గతంలో అనేక ఫిర్యాదులు అందినా.. నాటి వైసీపీ విచారణకు ఆదేశించలేదు. పైగా ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు.

డీసీసీబీలో నిధులు గోల్‌మాల్‌!
విశాఖలో డీసీసీబీ ప్రధాన కార్యాలయం

బినామీ పేర్లతో రుణాల మంజూరు

తక్కువ విలువగల బంగారం వస్తువుపై పరిమితికి మించి రుణాలు

‘టెక్నికల్‌ రైటాఫ్‌’ పేరుతో అప్పులు మాఫీ

భారీ మొత్తంలో నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణలు

కలెక్టర్లకు ఎమ్మెల్యే సుందరపు, వ్యవసాయదారుల సంఘం నేత పైడారావు ఫిర్యాదులు

విచారణ జరిపించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో అవినీతి తీగ లాగితే డొంక కదులుతోంది. గత వైసీపీ పాలనలో గుట్టుగా సాగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధికారం చేతలో వుండడంతో డీసీసీబీ నిధులు భారీ మొత్తంలో బొక్కేశారు. పీఏసీఎస్‌లు రైతులకు ఇవ్వాల్సిన రుణాలు పక్కదారి పడుతున్నాయంటూ గతంలో అనేక ఫిర్యాదులు అందినా.. నాటి వైసీపీ విచారణకు ఆదేశించలేదు. పైగా ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయదారుల సంఘం ఉపాధ్యక్షుడు విల్లూరి పైడారావు గత ఏడాది అక్టోబరులో విశాఖ, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్లు, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని ముగ్గురు సహకార అధికారులను విచారణ అధికారులుగా నియమించారు. డీసీసీబీలో అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. డీసీసీబీ బ్రాంచీలు, పీఏసీఎస్‌ల ద్వారా రుణాల మంజూరులో జరిగిన అవకతవకలపై సమాచారం సేకరించినట్టు తెలిసింది. అప్పట్లో డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన వైసీపీ నేత, డీసీసీబీ ఉన్నతాధికారి కుమ్మక్కై బినామీ పేర్లతో వ్యవసాయ రుణాలు మంజూరు చేసినట్టు రికార్డుల్లో చూపి అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. తరువాత ‘టెక్నికల్‌ రైటాఫ్‌’ పేరుతో డీసీసీబీ జనరల్‌ బాడీ సమావేశంలో ఆమోదింపజేసుకుని, రుణాలను రద్దు చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలను కూడా ఇదే తరహాలో తీసుకుని, ‘టెక్నికల్‌ రైటాఫ్‌’ పేరుతో రద్దు చేయించినట్టు తెలిసింది.

ఇక బంగారు ఆభరణాలపై రుణాల మంజూరు విషయంలోనూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్టు సమాచారం. తక్కువ విలువ చేసే వస్తువులు, ఆస్తులను బ్యాంకులో కుదవపెట్టుకుని అధిక మొత్తం రుణాలు మంజూరు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తరహా రుణాల మంజూరు నర్సీపట్నం, ఎలమంచిలి పరిధిలో ఎక్కువగా జరిగినట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన కూటమి ప్రభుత్వం సహకార శాఖ, డీసీసీబీలో జరిగిన అక్రమాలపై విచారణను వేగవంతం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే అనకాపల్లి జిల్లా సహకార శాఖ కార్యాలయంలో ఆడిట్‌ అధికారిపై వేటు వేసిన ప్రభుత్వం, వైసీపీ జమానాలో జరిగిన అవినీతి, అక్రమాల గుట్టువిప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీసీసీబీ నాటి చైర్మన్‌, సీఈవోలకు జారీచేసేందుకు నోటీసులను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Feb 15 , 2025 | 12:42 AM