సబ్బవరం-షీలానగర్ హైవేకు నిధులు
ABN , Publish Date - Jan 03 , 2025 | 01:29 AM
సబ్బవరం-షీలానగర్ మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి (516 సి) నిర్మాణానికి రూ.963.93 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వెల్లడించారు.
రూ.963.93 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకటన
పనులు ఇక వేగవంతం
ఆ రహదారి అందుబాటులోకి వస్తే సిటీ మధ్య నుంచి వెళ్లే నేషనల్ హైవేపై
తగ్గనున్న భారీ వాహనాల రాకపోకలు
విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):
సబ్బవరం-షీలానగర్ మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి (516 సి) నిర్మాణానికి రూ.963.93 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గురువారం వెల్లడించారు. విశాఖపట్నం పోర్టుకు గాజువాక మీదుగా వచ్చే భారీ వాహనాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో వాటి రాకపోకలకు పోలీస్ అధికారులు నిర్ణీత సమయాలు కేటాయించారు. అయినా ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు. దాంతో పోర్టు వర్గాలు ఈ సమస్య నివారణ కోసం అనకాపల్లి-ఆనందపురం ఆరు వరుసల జాతీయ రహదారిలో సబ్బవరం నుంచి షీలానగర్ వరకూ మరో ఆరు వరుసల జాతీయ రహదారి (516 సి) నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి 2023 అక్టోబరులోనే టెండర్లు పిలిచారు. కొన్నిచోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఆరు వరుసల రహదారి పొడవు 12.66 కి.మీ. ఇది పూర్తయితే అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి మీదుగా వచ్చే వాహనాలు సబ్బవరం వద్ద ఏర్పాటుచేసే ఇంటర్ చేంజ్ వద్ద డైవర్షన్ తీసుకొని షీలానగర్ మార్గంలోకి వచ్చేస్తాయి. అక్కడి నుంచి విమానాశ్రయం పక్కనున్న మార్గంలో పోర్టుకు వెళతాయి. దీంతో నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారి(16)పై భారీ వాహనాల రాకపోకలు తగ్గుతాయి. దీనివల్ల ప్రమాదాల సంఖ్య కూడా తగ్గనుంది.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
రేపటి నుంచి ప్రారంభం
జిల్లాలో 5,500 మంది విద్యార్థులు
భోజనం సరఫరా బాధ్యతలు అక్షయ పాత్రకు అప్పగింత
విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఈనెల నాలుగో తేదీ నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. మూడో తేదీ శుక్రవారం నుంచి భోజన పథకం అమలు చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే అనివార్య కారణాలతో నాలుగో తేదీకి వాయిదా వేశారు.
జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 5,500 మంది విద్యార్థులు ఉన్నారు. నగరంలో వీఎస్ కృష్ణా జూనియర్, ఒకేషనల్ కళాశాలలు, మహిళా జూనియర్ కళాశాల ఉన్నాయి. ఇంకా మల్కాపురం, పెందుర్తి, అగనంపూడి, ఇస్లాంపేట, మధురవాడ, ఆనందపురం, భీమిలిల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో పథకం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెనూయే జూనియర్ కళాశాలల్లోనూ అమలు చేస్తారు. ప్రతి విద్యార్థికి రోజుకు 150 గ్రాముల రైస్ అందిస్తారు. నగరంతోపాటు ఆనందపురం, భీమిలి మండలాల్లో అక్షయపాత్ర ద్వారా పాఠశాల విద్యార్థులకు భోజనం సరఫరా అవుతుంది. పెందుర్తి, పెదగంట్యాడ రూరల్ ప్రాంతాల్లో స్థానికంగా ఉండే డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు భోజనం వండి పిల్లలకు అందిస్తున్నారు. అయితే ఇంటర్ విద్యార్థులకు తాము భోజనం అందించలేమని డ్వాక్రా సంఘాలు చెప్పడంతో నగరంతో పాటు చుట్టుపక్కల గల కళాశాలలన్నింటికీ భోజనం అందించే బాధ్యతను జిల్లా యంత్రాంగం అక్షయపాత్ర సంస్థకు అప్పగించింది. జిల్లాలో అత్యధికంగా పాతజైలు రోడ్డులో గల మహిళా జూనియర్ కళాశాలలో 1,350 మంది, అతి తక్కువగా ఆనందపురం జూనియర్ కశాశాలలో 25 మంది ఉన్నారు. ఈనెల నాలుగో తేదీన కళాశాలల్లో భోజన పథకం కార్యక్రమ ప్రారంభానికి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అఽధికారులు హాజరుకానున్నారు.