Anakapalli District: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి.. గంజాయి డాన్‌గా
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:55 AM
సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో వచ్చే జీతం చాల్లేదో ఏమో.. గంజాయి డాన్‌గా అవతరించింది ఓ మహిళా మాజీ టెకీ! శుక్రవారం అనకాపల్లి జిల్లా...
అనకాపల్లి జిల్లాలో మాజీ మహిళా టెకీ సహా 8 మంది అరెస్టు
నర్సీపట్నం అర్బన్/నాతవరం డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో వచ్చే జీతం చాల్లేదో ఏమో.. గంజాయి డాన్‌గా అవతరించింది ఓ మహిళా మాజీ టెకీ! శుక్రవారం అనకాపల్లి జిల్లా నాతవరం పోలీసులు అరెస్టు ఎనిమిది మందిలో ఆమె కూడా ఉంది. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఈ వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. నర్సీపట్నం రూరల్, నాతవరం పోలీసులు శృంగవరం సమీపంలో శుక్రవారం వాహనాల తనిఖీల్లో భాగంగా ఒక కారును సోదా చేయగా, 74 కిలోల గంజాయి లభించింది.
అందులో ఉన్న నలుగురితో పాటు కారు ముందు, వెనుక ద్విచక్ర వాహనాలపై వస్తున్న నలుగురిని పట్టుకుని విచారించి, వారిని కూడా అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు మహిళలు ఉండగా, ఇందులో గాదె రేణుక (28)ది విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మోదుగులపేట గ్రామం. బీటెక్ చదువుకున్న ఆమె గతంలో ఏడాదిపాటు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తర్వాత సులువుగా డబ్బు సంపాదించాలంటే గంజాయి వ్యాపారమే మేలని భావించి కొంతమందితో ముఠా ఏర్పాటు చేసుకుని గంజాయి వ్యాపారం చేస్తోంది.
ఈ క్రమంలో ఒకడందం లలితకుమారి (అల్లూరి జిల్లా చింతపల్లి), పొన్నగంటి మణికుమారి (పెదవలస)తో కలిసి ఆమె ఏడాది కాలంగా నర్సీపట్నం శారదానగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని గంజాయి వ్యాపారం చేస్తోంది. గాదె రేణుక పాత నేరస్థురాలని, ఆమెపై నాలుగు గంజాయి కేసులు ఉన్నాయని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన నిందితుల్లో సూర్య కాళిదాసు, మదన్‌కుమార్, నాదిముత్తు (తమిళనాడు), ఎ.ప్రసాద్ (అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట), అండెంగల రవికుమార్ (అల్లూరి జిల్లా పాడేరు) ఉన్నారన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.18 లక్షలు ఉంటుందని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Road Accident: ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
Buddhist Stupa: అపురూప శిల్ప సంపద.. అణువణువునా బౌద్ధం ఆనవాళ్లు