ఫుట్‌పాత్‌లు కబ్జా!
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:51 AM
జిల్లా కేంద్రంలో ఫుట్‌పాత్‌లే కాదు.. రహదారులు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయి. చిరు వ్యాపారులతోపాటు శాశ్వత దుకాణదారులు, పెద్ద వ్యాపారులు కూడా ఫుట్‌పాత్‌లను యథేచ్చగా ఆక్రమించేస్తున్నారు. వస్తువులు, సామగ్రిని అడ్డుగా పెట్టడంతో పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తున్నది. నిత్యం రద్దీగా వుండే మెయిన్ రోడ్డు, నెహ్రూచౌక్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, తుమ్మపాల, కొత్తూరు వైపులకు వెళ్లే రోడ్లు, రింగురోడ్డులో ఈ సమస్య అధికంగా వుంది.

చిరు వ్యాపారుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఇష్టారాజ్యంగా ఆక్రమణ
కొన్నిచోట్ల ఫుట్‌పాత్‌లతోపాటు రోడ్డుపైనే వ్యాపారాలు
పాదచారులు రోడ్లపై నడవాల్సిన దుస్థితి
వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య
కళ్లెదుట కనిపిస్తున్నా పట్టించుకోని జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీసు అధికారులు
తుమ్మపాల (అనకాపల్లి), ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ఫుట్‌పాత్‌లే కాదు.. రహదారులు సైతం ఆక్రమణలకు గురవుతున్నాయి. చిరు వ్యాపారులతోపాటు శాశ్వత దుకాణదారులు, పెద్ద వ్యాపారులు కూడా ఫుట్‌పాత్‌లను యథేచ్చగా ఆక్రమించేస్తున్నారు. వస్తువులు, సామగ్రిని అడ్డుగా పెట్టడంతో పాదచారులు రోడ్లపై నడవాల్సి వస్తున్నది. నిత్యం రద్దీగా వుండే మెయిన్ రోడ్డు, నెహ్రూచౌక్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, తుమ్మపాల, కొత్తూరు వైపులకు వెళ్లే రోడ్లు, రింగురోడ్డులో ఈ సమస్య అధికంగా వుంది.
అనకాపల్లి జిల్లా కేంద్రంగా అవతరించడంతో ప్రజల రాకపోకలతోపాటు వాహనాల రద్దీ కూడా పెరుగుతున్నది. భారీ షాపింగ్ మాల్స్ సైతం ఏర్పాటు అవుతుండడంతో జిల్లా నలుమూలల నుంచి కొనుగోలుదారులు తరలి వస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులు ఉదయం నుంచి రాత్రి వరకు కిటకిటలాడుతున్నాయి. పండుగ సమయాల్లో రద్దీగా మరింత అధికంగా వుంటుంది. అయితే పాదచారుల రాకపోకలకు రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన పుట్‌పాత్‌లను చిరు వ్యాపారులు, ఆయా దుకాణాలు, షాపింగ్ మాల్స్ యజమానులు పోటీ పడి మరీ ఆక్రమించేస్తున్నారు. షాపులో విక్రయించే వస్తువుల్లో కొన్నింటిని ఫుట్‌పాత్‌పై పెడుతున్నారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి ఫుట్‌పాత్‌లపై షెడ్లు వేసుకొని దర్జాగా వాడకుంటున్నారు. ప్రధానంగా దుస్తులు, ఎలక్ర్టానిక్స్ వస్తువులు, గృహోపకరణాల దుకాణాలు, పండ్ల వ్యాపారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించారు. వ్యాపార సముదాయాల్లో వాహనాల పార్కింగ్‌కు స్థలం ఏర్పాటు చేయకపోవడంతో మెయిన్‌రోడ్డు పైనే వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. దీంతో జనం రోడ్డుపైనే రాకపోకలు సాగించాల్సి వస్తున్నది. దీనికితోడు అన్ని రకాల వాహనాలు పెరగడంతో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభిస్తున్నది. ఈ సమస్యను నిత్యం గమనిస్తున్న జీవీఎంసీ, ట్రాఫిక్ పోలీసు అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆక్రమణలను తొలగిస్తాం
బి.వెంకటరమణ, జీవీఎంసీ జోనల్ కమిషనర్ 2ఎకెపి-టీఎంపీ-7-
పట్టణంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. దుకాణాల యజమానులతో అతిత్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించే ందుకు చర్యలు తీసుకుంటాం. ఫుట్‌పాత్‌లపై పర్మినెంట్ నిర్మాణాలు చేపట్టిన వారి పై కేసులు పెడతాం.