జూన్ నాటికి ఫ్లైఓవర్
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:53 AM
జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల అత్యాశకు అంతులేకుండా పోతోంది.

భూగర్భ విద్యుత్ కేబుల్‌కు గ్రేటర్ మోకాలడ్డు
గతంలో పనుల కోసం రహదారులపై తవ్వినంత మేరకే పూడ్చివేత చార్జీలు వసూలు
తారురోడ్డుకు కిలోమీటరుకు 4.07 లక్షలు, సిమెంట్ రోడ్డుకు రూ.3.37 లక్షలు,
కచ్చా రోడ్డుకు రూ.29 వేలు
ఇప్పుడు రహదారి మొత్తానికి కట్టాలని డిమాండ్
కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన ఈపీడీసీఎల్ సీఎండీ
గ్రేటర్ ఇంజనీరింగ్ అధికారులకు క్లాస్ పీకిన కలెక్టర్
మళ్లీ అంచనాలు రూపొందిస్తామని వెల్లడి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారుల అత్యాశకు అంతులేకుండా పోతోంది. నగర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు ముందుకు కదలకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
హుద్‌హుద్ వంటి తుఫాన్లు వచ్చినప్పుడు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిపోకుండా ఉండేందుకు నగరంలో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం...రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద ఈ పనులకు 60 శాతం నిధులు ఇస్తోంది. తొలి విడత నగరంలో సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో భూగర్భ కేబుల్ వేసిన సంగతి తెలిసిందే. రెండో దశలో నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ కేబుల్ వేయడానికి రూ.1,362 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఈపీడీసీఎల్ పరిధిలోని జోన్-2, జోన్-3 ఏరియాల్లో 633 కి.మీ.గోతులు తవ్వి కేబుల్ వేయడానికి రూ.650 కోట్లు మంజూరయ్యాయి. జోన్-2 ఏరియాలో గాజువాక, ఆటోనగర్, మల్కాపురం, కంచరపాలెం, మర్రిపాలెం, మురళీనగర్, మాధవధార తదితర ప్రాంతాలు వస్తాయి. జోన్ -3లో విమ్స్ ఏరియా, ఎండాడ, సింహాచలం, భీమిలి, పీఎం పాలెం, చిట్టివలస, పెందుర్తి, వేపగుంట తదితర ప్రాంతాలు ఉన్నాయి.
జీవీఎంసీ అత్యాశ
మొదటి దశలో భూగర్భ విద్యుత్ కేబుల్ వేసినప్పుడు జీవీఎంసీ రహదారులను ఎంత మేరకు తవ్వారో దానికి మాత్రమే చార్జీలు వసూలు చేశారు. అప్పట్లో తారురోడ్డుకు అయితే కిలోమీటరుకు 4.07 లక్షలు, సిమెంట్ రోడ్డుకు అయితే రూ.3.37 లక్షలు, కచ్చా రోడ్డుకు అయితే రూ.29 వేలు తీసుకున్నారు. ఇప్పుడు రెండో దశకు వచ్చేసరికి...ఏయే రహదారులు తవ్వుతారో వాటిని పూర్తిగా వేయడానికి అయ్యే ఖర్చు భరించాలని ఇంజనీరింగ్ అధికారులు సూచించారు. తారురోడ్డుకు కిలోమీటరుకు కోటి రూపాయలు, సిమెంట్ రోడ్డుకు రూ.80 లక్షలు, కచ్చా రోడ్డుకు రూ.14 లక్షలు కట్టాల్సి ఉంటుందని అంచనాలు ఇచ్చారు. దానికి ఈపీడీసీఎల్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఎక్కడైనా రోడ్డును ఎంత తవ్వితే దానికి మాత్రమే చార్జీలు వసూలుచేసే సంప్రదాయం నడుస్తున్నదని, ఆ రోడ్డు మొత్తం వ్యయం భరించాలని కోరడం అన్యాయమని జీవీఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ కలిశారు. నగరంలో భూగర్భ కేబుళ్లను జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు కూడా వేస్తున్నాయని, వారి నుంచి అలా వసూలు చేయడం లేదని పలువురు అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దాంతో కలెక్టర్ వెంటనే జీవీఎంసీ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి క్లాస్ పీకారు. గాజువాక సమీపాన ఆటోనగర్‌లో ఐలా రూపాయి కూడా తీసుకోకుండా పనులు చేయడానికి అనుమతి ఇచ్చిందని, నగర ప్రజలకు చక్కటి సదుపాయం లబిస్తుంటే దానిని ఎలా అడ్డుకుంటారని చీవాట్లు పెట్టారు. అమృత్ పథకం కింద పనులు కూడా ఇలాగే చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దాంతో జీవీఎంసీ అధికారులు మళ్లీ అంచనాలు రూపొందించి ఇస్తామని చెప్పారు. అప్పటివరకూ పనులు ఆగిపోవలసిందేనా?...అని ఈపీడీసీఎల్ అధికారులు ప్రశ్నించగా...నగర శివార్లలో ఉన్న కచ్చా రోడ్లలో పనులు చేసుకోవచ్చునని, వాటికి ఎటువంటి రుసుము వసూలు చేయబోమని సమాధానమిచ్చారు.
ఆగస్టుకు పూర్తి చేయాలనేది లక్ష్యం
శ్యామ్‌కుమార్, ఎస్‌ఈ, విశాఖ సర్కిల్
నగరంలో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తిచేయాలనేది లక్ష్యం. జీవీఎంసీ అధికారులు ఇప్పటివరకూ ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఆటోనగర్‌లో ఇప్పటికే పది కిలోమీటర్ల మేర పనులు పూర్తిచేశాము. అనుమతులు ఇస్తే గడువులోగా మిగిలిన పనులు కూడా పూర్తిచేస్తాం.