Share News

సిటీలో ఫ్లూ ఫీవర్స్‌

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:47 AM

నగరంలో ఫ్లూ ఫీవర్స్‌ ప్రబలుతోంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా వైరస్‌లు విజృంభించి విపరీతమైన దగ్గు, గొంతునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది.

సిటీలో ఫ్లూ ఫీవర్స్‌

  • దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు

  • సీజన్‌ మారే సమయంలో యాక్టివ్‌ అవుతున్న వైనం

  • వైరస్‌లే కారణమంటున్న వైద్యులు

  • తీవ్రత ఎక్కువగా ఉందనే అభిప్రాయం

  • చిన్నారుల్లో అధికంగా కనిపిస్తున్న సమస్య

  • ఆస్పత్రులకు వచ్చేవారిలో సగం మంది వైరస్‌ బాధితులే

విశాఖపట్నం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఫ్లూ ఫీవర్స్‌ ప్రబలుతోంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా వైరస్‌లు విజృంభించి విపరీతమైన దగ్గు, గొంతునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ప్రతిరోజూ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారిలో సగం మంది వైరస్‌ బాధితులేనని వైద్యులు చెబుతున్నారు.

నగరంలో గతంతో పోలిస్తే వైరస్‌ తీవ్రత కొంత అధికంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ బారిన పడినవారంతా రెండు నుంచి మూడు రోజులపాటు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారంటున్నారు. సాధారణంగా సీజనల్‌ ఫ్లూ వైరస్‌లు వ్యాప్తి చెందినప్పుడు వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం వైరస్‌ బారినపడుతున్న వారిలో రోజుల తరబడి తీవ్రమైన దగ్గు, విపరీతమైన గొంతు నొప్పి, కొందరిలో జ్వరం, ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నాయి. ఇటువంటి వారికి యాంటీబయాటిక్స్‌ ఇవ్వాల్సి వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

పిల్లల్లో కఫం సమస్య

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో దగ్గుతోపాటు కఫం కూడా ఉంటోంది. ఈ మధ్య మంచు అధికంగా కురవడంతో పాటు చల్లనిగాలులు వీచాయి. మంచులో తిరిగిన, చల్లనిగాలుల బారినపడిన చిన్నారులు చాలామందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీనిని అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌గా పిలుస్తారంటున్నారు. దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలర్జీ, ముక్కు కారడం వంటి ఇబ్బందులు ఉంటున్నాయని, ఈ దశలో చిన్నారులకు నెబిలైజేషన్‌ పెట్టాల్సి వస్తోందని తెలిపారు.

రోగుల సంఖ్య ఎక్కువే...

గొంతు నొప్పి, జలుబు, దగ్గుతో కేజీహెచ్‌, విమ్స్‌లకు ప్రతిరోజూ 40 మంది వరకూ వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్నవారిలో దాదాపు 50 శాతం మందికి ఈ లక్షణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండతీవ్రత పెరిగే కొద్దీ కొన్ని వైరస్‌లు మరింత యాక్టివ్‌ అవుతాయని, దీనివల్ల కేసులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

తీవ్రతను బట్టి మందులిస్తున్నాం

ఫ్లూ కేసులు పెరిగాయి. తీవ్రతను బట్టి మందులు ఇస్తున్నాం. కొందరికి యాంటీ బయాటిక్స్‌ ఇవ్వాల్సి వస్తోంది. సీజన్‌ మారు తున్న సమయంలో ఫ్లూ వైరస్‌లు వ్యాప్తి చెందుతుంటాయి. ప్రస్తుత వైరస్‌ తీవ్రత కొంత బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందువల్ల రోజుల తరబడి లక్షణాలుంటున్నాయి. మూడు రోజులకు మించి దగ్గు, ఇతర లక్షణాలుంటే వైద్యులను సంప్రతించాలి.

- డాక్టర్‌ వై.జ్ఞానసుందరరాజు, జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు

Updated Date - Feb 12 , 2025 | 12:47 AM