2026 నుంచి విశాఖకు విమానాలు బంద్
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:35 AM
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 సెప్టెంబరు నుంచి మూతపడనున్నది.

భోగాపురం ఎయిర్‌పోర్టు జూన్ నాటికి ప్రారంభమైతే సెప్టెంబరు నుంచి ఇక్కడకు డొమెస్టిక్ విమానాల నిలిపివేత
రక్షణ అవసరాల కోసం పూర్తిగా స్వాధీనం చేసుకోనున్న నేవీ
ఫిబ్రవరి నుంచి రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య రాకపోకలు నిషేధం
విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 సెప్టెంబరు నుంచి మూతపడనున్నది. ప్రయాణికుల విమానాలను అనుమతించరు. దీనిని పూర్తిగా తూర్పు నౌకాదళమే రక్షణ అవసరాలకు ఉపయోగించుకుంటుంది. విశాఖ విమానాశ్రయం సలహా కమిటీ సోమవారం ఎంపీ ఎం.శ్రీభరత్ అధ్యక్షతన సమావేశమైంది. ఈ సందర్భంగా భోగాపురంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్‌లో ప్రారంభమైతే విశాఖ విమానాశ్రయం పరిస్థితి ఏమిటని పలువురు సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దానిపై విశాఖ నేవీ వైమానిక స్థావరం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఐఎన్‌ఎస్ డేగా అధికారులు, విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి స్పందించారు. అనుకున్న సమయానికి భోగాపురం ప్రారంభమైతే అదే ఏడాది సెప్టెంబరు నుంచి విశాఖ విమానాశ్రయం మూసేస్తామని స్పష్టంచేశారు.
మరో ఎనిమిది నెలలు అందుబాటులో ఉండని ఐఎల్‌ఎస్
విశాఖ విమానాశ్రయాన్ని నేవీ ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుతం 10 వేల అడుగుల పొడవు ఉన్న రన్‌వేను నేవీ అధికారులు అటు వేయి అడుగులు, ఇటు 1,000 అడుగుల పొడవు పెంచే పనిలో ఉన్నారు. ఇవి మార్చితో పూర్తవుతాయని భావించారు. కానీ మట్టి స్వభావం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. ఆగస్టుకు కాని పూర్తికావని చెబుతున్నారు. ఈ పనులు జరుగుతున్నపుడు విమానాలు దిగడం కోసం ఉపయోగించే ‘ఇనుస్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్(ఐఎల్‌ఎస్)’ను ఆపేస్తున్నారు. గత కొద్దికాలంగా రన్‌వే విస్తరణ పనులు జరుగుతుండడం వల్ల విమానాలతో ఐఎల్‌ఎస్ అనుసంధాన ప్రక్రియకు సాంకేతిక అవరోధాలు కలుగుతున్నాయి. రన్‌వే పనులు పూర్తయ్యేంత వరకు ఐఎల్‌ఎస్ సదుపాయం ఉండదని కూడా నేవీ అధికారులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అదే విధంగా రన్‌వే పనులు త్వరితంగా పూర్తిచేయడానికి ఫిబ్రవరి నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు విమానాల రాకపోకలను అనుమతించబోమని నేవీ అధికారులు వెల్లడించారు. విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ సర్వీసులు సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్ నుంచి రాత్రి 11 గంటల తరువాతే వస్తున్నాయి. అవి రద్దు కాకుండా ఉండాలంటే... వాటి షెడ్యూళ్లు మార్చుకోవాలని, లేదంటే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తామని నేవీ అధికారులు పేర్కొన్నారు.
స్లాట్లు 12 నుంచి 15కు పెంచడానికి అంగీకారం
విశాఖ విమానాశ్రయంలో రన్‌వేను ప్రస్తుతం అటు పౌర విమానాలకు, అటు నేవీ విమానాలకు ఉపయోగిస్తున్నారు. పౌర విమానాలకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు గంటకు 12 స్లాట్లు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఆరు విమానాలు వచ్చి, తిరిగి వెళ్లగలుగుతున్నాయి. దీనివల్ల కొత్త విమానాలు రావడానికి అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ స్లాట్ల సంఖ్యను 18కి పెంచాలని నేవీ అధికారులను కోరారు. అన్ని ఇవ్వలేమని 15 వరకూ మాత్రమే ఇస్తామని హామీ ఇచ్చారు.
ఫొటోలు పీసీ సెంటర్‌లో ఎయిర్‌పోర్టు అని ఉన్నాయి.
దుబాయ్ విమానం
పునరుద్ధరణపై దృష్టిపెట్టండి
అధికారులకు ఎంపీ ఎం.శ్రీభరత్ ఆదేశం
గోవా, పూణేలకు కూడా...
అత్యధిక డిమాండ్ ఉన్న బెంగళూరు,
ముంబై నగరాలకు సర్వీస్‌లు పెంచాలి
విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీస్ పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని విమానాశ్రయం సలహా కమిటీ అధ్యక్షులు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ సూచించారు. సోమవారం ఆయన అధ్యక్షతన విమానాశ్రయంలో కొత్త కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో దుబాయ్, గోవా, పూణేలకు విమానాలు ఉండేవని, ప్రస్తుతం అవి లేవని పునరుద్ధరించాలని కోరారు. దీనిపై ఎంపీ ప్రశ్నించగా ఆయా సంస్థలకు విమానాల కొరత వల్ల ఇక్కడి సర్వీస్‌లు రద్దు చేసుకున్నాయన్నారు. వారితో మాట్లాడి సర్వీస్‌లు పునరుద్ధరణకు ప్రయత్నిస్తామని అధికారులు చెప్పారు. అంతర్జాతీయ సరకు రవాణాకు ఇంకా అడ్డంకులు తొలగలేదని, ఆ సమస్య పరిష్కారానికి త్వరగా చర్యలు చేపట్టాలని ఎంపీ శ్రీభరత్ ఆదేశించారు. బెంగళూరు, ముంబై నగరాలకు నడుస్తున్న విమానాలకు అత్యధిక డిమాండ్ ఉన్నందున సర్వీస్‌లు పెంచాలని పలువురు సభ్యులు సూచించారు. పౌర విమానాలకు ఆటంకం కలగకుండా చూడాలని ఐఎన్‌ఎస్ డేగా అధికారులను కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు.
కొత్త కమిటీ ఏర్పాటు
విశాఖ విమానాశ్రయం సలహా కమిటీకి పలువురు సభ్యులను నామినేట్ చేసే అధికారం ఎంపీకి ఉంది. ఆ కోటాలో పలు రంగాలకు చెందిన వారిని శ్రీభరత్ నామినేట్ చేసి, నియామకపు పత్రాలు సమావేశంలోనే అందజేశారు. రెండేళ్ల పదవీ కాలం ముగిసిన వారిని కొందరిని కమిటీ నుంచి తప్పించారు. దసపల్లా హోటల్ సీఈఓ వెంకటకృష్ట, సింబయోసిస్ టెక్నాలజీస్ సీఈఓ ఓ.నరేశ్‌కుమార్, ఐటీ సంస్థ ఫ్లూయెంట్ గ్రిడ్ చైర్మన్ గన్నమనేని మురళీకృష్ణ, షోర్ ఫ్రంట్ రిసార్ట్ అధినేత సంజన, సీవీ ఇన్‌ఫ్రా డైరెక్టర్ సీవీ ప్రద్యుమ్న, రాధిక గ్రూపు ఇండస్ట్రీస్ అధినేత మన్వేందర్ మోర్, రామబ్రహ్మం అండ్ సన్స్ ప్రతినిధి కంచర్ల రామ్‌ప్రసాద్‌లను నియమించారు. వీరు విమానాశ్రయం అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషిచేయాలని భరత్ సూచించారు. ఈ కమిటీలో ప్రత్యామ్నాయ చైర్మన్‌గా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్ నామినేటెడ్ సభ్యులుగా ఉన్నారు.