చుక్కల్లో విమాన టికెట్ల ధరలు
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:47 AM
విద్య, ఉద్యోగాల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఉత్తరాంధ్ర వాసులు సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు రావాలంటే టిక్కెట్లకు అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది.

బెంగళూరు-విశాఖపట్నం రూ.15 వేలు
హైదరాబాద్, చెన్నైల నుంచైతే రూ.17 వేలు
విశాఖ రావాలంటే కనీసం రూ.10వేలు ఉండాల్సిందే
విజయవాడ-విశాఖపట్నం రూ.7 వేలు
విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
విద్య, ఉద్యోగాల నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఉత్తరాంధ్ర వాసులు సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు రావాలంటే టిక్కెట్లకు అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది. రైళ్లలో బెర్తులు లభించడం లేదు. దాంతో ఎక్కువ మంది విమాన ప్రయాణం ఎంచుకుంటున్నారు. తక్కువ సమయంలో, రద్దీ లేకుండా చేరుకోవచ్చునని టిక్కెట్ల కోసం యత్నిస్తున్నారు. అయితే వాటి ధరలు ఆకాశంలో ఉండడంతో అవాక్కవుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నవారు ఎక్కువమంది ఉన్నారు. బెంగళూరు నుంచి శనివారం విశాఖపట్నం వచ్చినవారు రూ.15 వేలు పెట్టి టిక్కెట్లు కొనుగోలు చేశారు. సాధారణ రోజుల్లో ఈ ధర రూ.4,500కు మించి ఉండదు. కానీ ఇప్పుడు డిమాండ్ అధికంగా ఉండడంతో రెండు రెట్లు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఆదివారం ధరలు చూసుకుంటే అత్యధికంగా రూ.17,298, అత్యల్పంగా రూ.15,945 చూపిస్తోంది. ప్రయాణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వీటి రేట్లు పెరిగిపోతున్నాయి.
ఇక హైదరాబాద్ నుంచి అయితే రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. దాంతో చాలామంది విమాన ప్రయాణం ఎంచుకుంటున్నారు. మామూలు రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు టిక్కెట్ ధర రూ.4 వేలలోపే ఉంటుంది. ఇప్పుడు రూ.15 వేల నుంచి రూ.17 వేలు చూపిస్తోంది. చెన్నై నుంచి విశాఖకు సాధారణ రోజుల్లో టిక్కెట్ ధర రూ.5 వేలలోపు ఉండగా ఇప్పుడు రూ.17 వేలు దాటి చూపిస్తోంది.
విజయవాడ విమానాలకు డిమాండ్
రాష్ట్ర రాజధాని విజయవాడ నుంచి విశాఖపట్నానికి మామూలు రోజుల్లో విమాన టిక్కెట్ ధర రూ.3 వేలు ఉండగా ఇప్పుడు అది రూ.7వేలకుపైనే చూపిస్తోంది.