Share News

ఐదేళ్ల నిర్లక్ష్యం.. రైతులకు శాపం

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:43 AM

మండలంలోని ధర్మవరం రెవెన్యూ పరిధిలో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన కామునిగెడ్డ రిజర్వాయర్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఎప్పటికప్పుడు నిర్వహణ, మరమ్మతు పనులు చేయకపోవడంతో ఆయకట్టుకు నీరు సరిగా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పొలాలకు నీరు అందించే తూముల ఇనుప తలుపులు తుప్పు పట్టడంతో ఎత్తడానికి, దించడానికి వీలుకావడంలేదు. రిజర్వాయర్‌ గట్టుకు పలుచోట్ల రంధ్రాలు పడి నీరు వృథాగా పోతున్నది. ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమస్యలు మరింత పెరిగాయి.

ఐదేళ్ల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
కామునిగెడ్డ మినీ రిజర్వాయర్‌

అస్తవ్యస్తంగా కామునిగెడ్డ రిజర్వాయర్‌ నిర్వహణ

తుప్పు పట్టిన తూముల తలుపులు

కాలువల్లో పేరుకుపోయిన పూడిక

రిజర్వాయర్‌ గట్టుకు పలుచోట్ల రంధాలు

వృథాగాపోతున్న నీరు

ఒక్క ఏడాది కూడా నిధులు ఇవ్వని వైసీపీ పాలకులు

రావికమతం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ధర్మవరం రెవెన్యూ పరిధిలో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన కామునిగెడ్డ రిజర్వాయర్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఎప్పటికప్పుడు నిర్వహణ, మరమ్మతు పనులు చేయకపోవడంతో ఆయకట్టుకు నీరు సరిగా అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పొలాలకు నీరు అందించే తూముల ఇనుప తలుపులు తుప్పు పట్టడంతో ఎత్తడానికి, దించడానికి వీలుకావడంలేదు. రిజర్వాయర్‌ గట్టుకు పలుచోట్ల రంధ్రాలు పడి నీరు వృథాగా పోతున్నది. ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమస్యలు మరింత పెరిగాయి.

రావికమతం మండలం ధర్మవరం పంచాయతీ ఎగువున ఉన్న దేముడు కొండ, చలిసింగం కొండల మీద నుంచి వచ్చే వర్షపు నీటిని ఆధారంగా చేసుకుని 1987లో ఽఇక్కడ కామునిగెడ్డ పేరుతో మినీ రిజర్వాయర్‌ నిర్మించారు. కుడి, ఎడమ తూముల ద్వారా పాత ధర్మవరం, కొత్త ధర్మవరం, వలసలపాలెం, గంపవానిపాలెం, కొత్తకోటతోపాటు రోలుగుంట మండలం దిబ్బలపాలెం గ్రామాల పరిధిలో సుమారు 1,500 ఎకరాలకు ఖరీఫ్‌లో నీరు అందుతుంది. 20 కుటుంబాలకు చెందిన గిరిజన మత్స్యకారులు రిజర్వాయర్‌లో చేపల వేట సాగిస్తూ ఉపాధి పొందుతుంటారు. ఆరేళ్ల క్రితం వరకు కాలువల్లో పూడికతీత, తూముల గేట్ల నిర్వహణ పనులు సక్రమంగానే సాగేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల మాదిరిగానే నీటిపారుదల రంగాన్ని కూడా గాలికొదిలేసింది. కాలువల్లో పూడిక పేరుకుపోయింది. తుప్పలు పెరిగిపోయాయి. తూముల గేట్లు తుప్పు పట్టడంతో పైకి ఎత్తడానికి, కిందకు దించడానికి వీలు కావడంలేదు. దీనికితోడు తూముల పక్కన , రిజర్వాయర్‌ గట్టుకు పలుచోట్ల రంధ్రాలు పడ్డాయి. దీంతో రిజర్వాయర్‌ నుంచి నీరు వృథాగా పోతున్నది. ఈ సమస్యలను అధికారులు, వైసీపీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వున్నందున కామునిగెడ్డ రిజర్వాయర్‌ సమస్యలను స్థానిక (చోడవరం) ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు తీర్చాలని కోరుతున్నారు.

నీరు వృథా అవుతోంది

అనపర్తి అప్పారావు, కామునిగెడ్డ రిజర్వాయర్‌ మాజీ చైర్మన్‌ (ఫొటో 24ఆర్‌కెఎం10):

కామునిగెడ్డ మినీ రిజర్వాయర్‌కు ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు చేస్తుంటే ఎటువంటి సమస్యలు తలెత్తవు. గతంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడు తూముల తలుపులు పాడయ్యాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజు దృష్టికి తీసుకెళ్డడంతో వెంటనే స్పందించి తలుపుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించారు. కానీ వైసీపీ హయాంలో నిర్వహణను గాలికొదిలేశారు. ప్రస్తుతం పొలాల్లో పంటలేమీ లేవు. కానీ తూముల గేట్లు పాడైపోవడంతో కాలువల్లో నిరంతరాయంగా నీరు ప్రవహిస్తూ వృథాగా పోతున్నది.

Updated Date - Feb 03 , 2025 | 12:43 AM