వైసీపీ చేతిలోనే ఫిల్మ్ క్లబ్!
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:31 AM
భీమిలి సమీపానున్న ఫిల్మ్ క్లబ్ (వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్) ఇంకా వైసీపీ వర్గం ఆధ్వర్యంలోనే నడుస్తోంది.

నాలుగేళ్ల క్రితం తమకు నచ్చిన వారితో కోర్ కమిటీని నియమించుకున్న ఆ పార్టీ పెద్దలు
అంతా సినీ పరిశ్రమకు సంబంధం లేనివారే...
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అందరినీ తప్పుకోవాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గంటా ఆదేశం
అయినా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన
సభ్యులకు తెలియకుండా ఇష్టానుసారం నిధుల వ్యయం
జనవరి 1 ఈవెంట్‌కు రూ.23 లక్షల ఖర్చు
అన్ని ఈవెంట్లలోను కార్యవర్గ సభ్యులకు కమీషన్లు
పేకాట క్లబ్బుగా మార్చారనే విమర్శలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భీమిలి సమీపానున్న ఫిల్మ్ క్లబ్ (వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్) ఇంకా వైసీపీ వర్గం ఆధ్వర్యంలోనే నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ నేతల పెత్తనమే కొనసాగుతోంది. కార్యవర్గంరాజీనామా చేసి తప్పుకోవాలని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఉన్న కార్యవర్గం నిధులు దుర్వినియోగం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ప్రభుత్వ హయాం (2020)లో ఆ పార్టీ పెద్దలు ఈ క్లబ్ కమిటీ నుంచి చిత్ర పరిశ్రమకు చెందిన వారిని తప్పించేశారు. కోర్ కమిటీని వేశారు. నాటి సీఎం సామాజిక వర్గానికి చెందిన వారిని, సాయిరెడ్డి బంధువులను ఎన్నిక లేకుండానే ప్రధాన కార్యవర్గంగా పెట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కాయల వెంకటరెడ్డి ప్రస్తుతం క్లబ్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్ రాజు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన క్లబ్ సభ్యత్వ రుసుము కట్టకుండానే వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు.
ఎమ్మెల్యే గంటా చెప్పినా వినకుండా
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ క్లబ్ వ్యవహారాలు తెలుసుకొని నాలుగు నెలల క్రితం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సినిమా పరిశ్రమకు చెందినవారు ఎవరూ క్లబ్ కార్యవర్గంలో లేరని గుర్తించి ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే కార్యవర్గం స్వచ్ఛందంగా తప్పుకోవాలని హెచ్చరించారు. వైసీపీ పెద్దలు నచ్చినట్టు మార్చుకున్న బైలాను సవరించాలని ఆదేశించారు. అయితే ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి ఒక్కరే రాజీనామా చేసి తప్పుకున్నారు. కోశాధికారిగా వ్యవహరిస్తున్న గోపీనాథ్‌రెడ్డి వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత క్లబ్‌కు వెళ్లడం మానేశారు. మిగిలినవారు అధ్యక్షుడు కాయల వెంకటరెడ్డి అధ్యక్షతన 2024 ఆగస్టు 24 న సమావేశం నిర్వహించి అక్టోబరులో ఎన్నికలు నిర్వహించి తాము తప్పుకుంటామని ప్రకటించారు. మూడు నెలలైనా ఎన్నికలు నిర్వహించలేదు. వారు రాజీనామా చేయలేదు. క్లబ్‌కు ఆదాయం లేదు. రిజర్వ్‌లో ఉన్న సభ్యత్వ రుసుములను ఇష్టానుసారం ఖర్చు చేసేస్తున్నారు.
మరో వైపు గంటా తమకు వ్యతిరేకంగా ఉన్నారని, కార్యవర్గాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడి దగ్గరకు తీసుకువెళ్లి తమను కొనసాగించేలా చూడాలని, క్లబ్‌కు భూమి ఇప్పించాలని కమీషన్లు కొట్టేస్తున్న పెద్ద మనిషి కోరినట్టు తెలిసింది. ఇప్పుడు క్లబ్ వద్ద ఉన్న కోట్ల రూపాయల నిధులతో భూమి కొనేసి అందులో భారీగా కమీషన్ జేబులో వేసుకోవాలని కార్యవర్గంలో కొందరు యత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేకాట క్లబ్‌గా...
- కల్చరల్ సెంటర్‌ను పూర్తిగా పేకాట క్లబ్బుగా మార్చేశారు. సీనియర్ సిటిజన్లు కాలక్షేపానికి పేకాట ఆడుకుంటారని, అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇంతకు ముందు పనిచేసిన కలెక్టర్ మల్లికార్జునకు ఒక లేఖ సమర్పించి..పేకాటకు తెర లేపారు. కలెక్టర్ అనుమతి ఇవ్వకపోయినా పేకాట ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. క్లబ్ కార్యవర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి బాగా పేకాట పిచ్చి. టేబుల్‌కు పది లక్షల రూపాయలు బెట్ కడుతున్నారంటే అక్కడ ఏ స్థాయిలో పేకాట జరుగుతున్నదో అంచనా వేసుకోవచ్చు.
కూటమికి దగ్గరయ్యేందుకు కాయల యత్నం
- ఇటీవల విజయవాడలో వరదలు వచ్చినప్పుడు క్లబ్ తరపున కాయల వెంకటరెడ్డి రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. విరాళం ఇస్తున్నట్టు క్లబ్ సభ్యులకు ముందుగా చెప్పకపోవడం గమనార్హం. ఈ విరాళం ద్వారా కూటమి ప్రభుత్వానికి దగ్గర అవ్వాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.
ఇవన్నీ ఆర్థిక అక్రమాలే...
- క్లబ్‌లో కొత్తగా రెండు పోర్టికోలు నిర్మించారు. వీటికి రూ.1.5 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్క చూపించారు. వీటికి ఒకే డోర్ నంబరు కలిగిన మూడు సంస్థల నుంచి కొటేషన్లు స్వీకరించి ఏకపక్షంగా కాంట్రాక్టు ఇచ్చేశారు. వీటి నిర్మాణానికి అందులో సగం కూడా ఖర్చు కాదనేది వాస్తవం.
- నగరంలోని స్పైస్ ఎవెన్యూలో రూ.15 వేలు జీతానికి పనిచేసే ఉద్యోగిని తీసుకువచ్చి నెలకు రూ.45 వేలు ఇస్తున్నారు. అదనంగా ఇచ్చే జీతంలో 50 శాతం వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తికి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- క్లబ్‌లో ఏ ఈవెంట్ నిర్వహించినా వాటికి ఎక్కువ మొత్తంలో కొటేషన్ ఇచ్చి, అందులో 50 శాతం చక్రం తిప్పుతున్న వ్యక్తి జేబులో వేసుకుంటున్నట్టు చెబుతున్నారు.
- మూడు రోజుల క్రితం అంటే మంగళవారం రాత్రి నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్లకు రూ.23 లక్షలు ఖర్చు చేశారు. దీనికి ఏజీఎం అనుమతి లేదు. ఈవెంట్ మేనేజర్‌కు రూ.10 లక్షలు క్లబ్ నుంచి ఇచ్చి, రూ.8 లక్షలు స్పాన్సర్ నుంచి తెచ్చారని, మిగిలిన మొత్తం టిక్కెట్ల విక్రయం ద్వారా వచ్చిందని అంటున్నారు. కానీ అవన్నీ అవాస్తవాలని కొందరు ఆరోపిస్తున్నారు. క్లబ్‌లో 400 మంది సభ్యులు ఉండగా అందులో కనీసం పదిహేను శాతం మంది ఆ రోజు ఈవెంట్‌కు రాలేదు. అధ్యక్షుడికి చెందిన సంస్థలో పనిచేస్తున్న వారిని రప్పించి జనాలు వచ్చినట్టు హడావుడి చేశారని విమర్శలు ఉన్నాయి. ఆ ఈవెంట్‌కు సమంత, శ్రీలీల, జబర్దస్త్ బృందం వస్తున్నారని ప్రచారం చేశారు. కోల్‌కతా డ్యాన్సర్లతో గెంతులు వేయించి మమ అనిపించారు. దీనికి రూ.23 లక్షలు వెచ్చించారు.
- క్లబ్‌లో నాలుగు రూములు ఉన్నాయి. వాటికి ఒక్కో దానికి రూ.2 వేలు అద్దె. రోజుకు రూ.8 వేలు. నెలలో 20 రోజులు అన్నీ బుక్ అయ్యాయని అనుకుంటే వచ్చే ఆదాయం రూ.1.6 లక్షలు. కానీ ఆ రూముల నిర్వహణకు నెలకు రూ.2 లక్షలు ఖర్చు చేస్తున్నారు. సబ్బులు, క్లీనింగ్ అని ఆదాయం కంటే ఎక్కువ చూపిస్తున్నారు. వాటిని సరఫరా చేసే సంస్థ నుంచి కూడా కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.