Share News

ప్రధాని సభకు విస్తృత ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 04 , 2025 | 01:02 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఈనెల ఎనిమిదో తేదీన జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ సభకు 1.7 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర్‌ ప్రసాద్‌ తెలిపారు.

ప్రధాని సభకు విస్తృత ఏర్పాట్లు

  • 1.7 లక్షల మంది సమీకరణ

  • విశాఖ జిల్లా నుంచి లక్షా 30 వేల మంది, అనకాపల్లి జిల్లా నుంచి 40,000 మంది

  • జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర్‌ ప్రసాద్‌

  • 22 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌: సీపీ

  • సంపత్‌ వినాయక్‌ ఆలయం వద్ద నుంచి రోడ్‌షో

  • అక్కడ నుంచి విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆదేశం

విశాఖపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఈనెల ఎనిమిదో తేదీన జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ సభకు 1.7 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర్‌ ప్రసాద్‌ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విశాఖ నుంచి కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన సమీకరణ గురించి కలెక్టర్‌ మాట్లాడుతూ విశాఖ నగరం నుంచి 1.2 లక్షల మంది, నాలుగు గ్రామీణ మండలాల నుంచి పది వేల మంది, అనకాపల్లి జిల్లా నుంచి 40 వేల మందిని సమీకరించేందుకు నిర్ణయించామన్నారు. సభకు వచ్చే వారికి రవాణా, భోజన సదుపాయం కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. నగర సీపీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ 22 ప్రాంతాల్లో పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. బందోబస్తుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్‌, నగర సీపీలను ఆదేశించారు. ప్రధాని ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన సంపత్‌ వినాయక్‌ ఆలయం వద్దకు చేరుకుని అక్కడ నుంచి ఓపెన్‌టాప్‌ వాహనంపై బహిరంగ సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వరకూ రోడ్‌షో నిర్వహిస్తారన్నారు. సంపత్‌ వినాయక్‌ ఆలయం నుంచి సభా ప్రాంగణం వరకూ విద్యుత్‌ దీపాలతో అలంకరించాలన్నారు. సభకు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చే వారికి భోజన వసతి కల్పించాలని, వచ్చేవారంతా సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఇన్‌చార్జి మంత్రి సమీక్ష

సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దాం

ఏర్పాట్లు పక్కాగా చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు

విశాఖపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఈనెల ఎనిమిదో తేదీన జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రెండు లక్షల మంది ప్రధాని సభకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడ పార్కింగ్‌ చేయాలన్నది ముందుగానే ఆయా జిల్లాలకు చెందిన అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగాకుండా నగరంలో పార్కింగ్‌ ప్రాంతాల వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. రియల్‌ టైమ్‌ లొకేషన్‌ సమాచారం ఉండేలా సీసీ టీవీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. అధికారులకు ప్రజా ప్రతినిధులు పూర్తిగా సహకరించాలని కోరారు. సమీక్షలో ముఖ్యమంత్రి కార్యాలయ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్‌, ప్రభుత్వ విప్‌లు పి.గణబాబు, వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, ఏపీ ఆయిల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ గండి బాబ్జీ, విశాఖ దక్షిణ టీడీపీ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌, జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, డీసీపీ అజిత వేజెండ్ల, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 01:02 AM