Share News

సర్కారు మారినా సాగుతున్న దందా

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:19 PM

ప్రభుత్వం మారినా అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా పోలవరం కాలువలోని మట్టిని తరలించుకుపోయిన అక్రమార్కులు ఇప్పుడు కూటమి నేతల అండదండలతో చెలరేగిపోతున్నారు.

సర్కారు మారినా సాగుతున్న దందా
కొక్కిరాపల్లి వెంకటాపురం సమీపంలో పోలవరం కాలువ మట్టిని తవ్వుతున్న ఎక్స్‌కవేటర్‌ను అడ్డుకున్న పోలీసులు

యథేచ్ఛగా పోలవరం కాలువలోని మట్టి తవ్వి తరలింపు

గత వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన అక్రమార్కులు

చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకంజ

తాజాగా కూటమి నేతల అండదండలతో రాత్రి వేళల్లో తవ్వకాలు

ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు

ఎలమంచిలి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మారినా అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా పోలవరం కాలువలోని మట్టిని తరలించుకుపోయిన అక్రమార్కులు ఇప్పుడు కూటమి నేతల అండదండలతో చెలరేగిపోతున్నారు.

మండలంలో పలు చోట్ల చీకటి పడితే చాలు పోలవరం కాలువ మట్టిని కొందరు దర్జాగా తవ్వి తరలించేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం కాలువ మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలించేసినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అక్రమార్కులు గ్రావెల్‌, పోలవరం కాలువ మట్టి తవ్వకాలకు తాత్కాలికంగా బ్రేక్‌ ఇచ్చారు. ఇటీవల స్థానిక కూటమి నేతల అండదండలతో మళ్లీ దందా మొదలెట్టారు. రెండు రోజులుగా రాత్రి వేళల్లో పోలవరం కాలువ మట్టిని ఎక్స్‌కవేటర్‌ సహాయంతో తవ్వి తరలించేస్తున్నారు. మునిసిపాలిటీ పరిధిలోని వెంకటాపురం సమీపంలో పోలవరం కాలువ నుంచి శుక్రవారం రాత్రి మట్టిని తరలిస్తుండగా పోలవరం కాలువ ఏఈఈ రాజేంద్రప్రసాద్‌ గుర్తించి రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్‌ పోలీసులు మట్టిని తరలిస్తున్న ప్రదేశానికి చేరుకుని ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

Updated Date - Jan 25 , 2025 | 11:19 PM