పాలిహౌస్‌పై అంతులేని నిర్లక్ష్యం
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:43 PM
స్థానిక ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రం(హెచ్‌ఎన్‌టీసీ)లో ఆధునిక మిరియాల వంగడాలు అంతరించిపోతున్నాయి. మేలి రకం మిరియాల మొక్కల ఉత్పత్తి కోసం నిర్మించిన పాలిహౌస్ శిథిలమైపోయింది.

శిథిలావస్థకు చేరినా పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం
రెండేళ్లుగా కనీస మరమ్మతులు శూన్యం
అంతరించిపోతున్న మేలి రకం మిరియాల వంగడాలు
మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టని అధికారులు
వచ్చే ఏడాది నుంచి రైతులకు పంపిణీ చేయడం కష్టమే..
చింతపల్లి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): స్థానిక ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రం(హెచ్‌ఎన్‌టీసీ)లో ఆధునిక మిరియాల వంగడాలు అంతరించిపోతున్నాయి. మేలి రకం మిరియాల మొక్కల ఉత్పత్తి కోసం నిర్మించిన పాలిహౌస్ శిథిలమైపోయింది. వైసీపీ ప్రభుత్వం గత రెండేళ్లుగా పాలి హౌస్ మరమ్మతులకు కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీని వల్ల కేరళ నుంచి ఏడేళ్ల క్రితం దిగుమతి చేసుకున్న ఆధునిక మిరియాల వంగడాల మదర్ ప్లాంట్లు చనిపోతున్నాయి. ఈ మొక్కల సంరక్షణపై కలెక్టర్, ఐటీడీఏ అధికారులు ఇప్పటికీ కనీస చర్యలు తీసుకోకపోవడం వల్ల వచ్చే ఏడాది నుంచి మేలి రకం మొక్కలు గిరిజన రైతులకు దూరం కానున్నాయి.
జిల్లాలో ఆదివాసీలు కాఫీ తరహాలో మిరియాల సాగు చేపడుతున్నారు. కాఫీ తోటల్లో మిరియాలను అంతర పంటగా సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. మిరియాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో గరిష్ఠ ధర లభిస్తున్నది. కిలో మిరియాలు ప్రాంతీయ మార్కెట్‌లో రూ.600 ధర లభిస్తున్నది. ప్రస్తుతం ఆదివాసీలు సాగు చేస్తున్న మిరియాల మొక్కలు నుంచి ఆశించిన దిగుబడి రావడం లేదు. దీంతో వారికి మేలి రకం మిరియాలను అందజేయాలనే లక్ష్యంతో గత టీడీపీ ప్రభుత్వం 2018లో కేరళ కాలికట్ సుగంధ ద్రవ్యాల పంట బోర్డు అభివృద్ధి చేసిన ఏడు రకాల మేలి జాతి మొక్కలను దిగుమతి చేసుకుంది. ఈ మొక్కలు తెగుళ్లను తట్టుకోవడంతో పాటు ఒక్కొక్క మొక్క నుంచి 3-4 కిలోల దిగుబడి వస్తుంది. స్పైస్ బోర్డు నుంచి గిరిముండ, శక్తి, శ్రీకర, పంచమి, పౌర్ణమి, మలబార్ ఎక్సెల్, సుబ్కర రకాల 2,307 మొక్కలను చింతపల్లి ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రానికి దిగుమతి చేసుకున్నారు. ఈ ఏడు రకాల మొక్కలను చింతపల్లి ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రంలో షేడ్‌నెట్ నర్సరీ ద్వారా అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.ఐదు లక్షల నిధులు వెచ్చించి ఐటీడీఏ అదే ఏడాది పాలిహౌస్‌ను నిర్మించింది. ఈ పాలిహౌస్‌లో విత్తన మొక్కలు(మదర్ ప్లాంట్స్) నుంచి అభివృద్ధి చేసిన నూతన రకాల మొక్కలను ప్రతి ఏటా ఐటీడీఏ 1.3 లక్షల నుంచి 1.6 లక్షల మొక్కలను రైతులకు నామమాత్రపు ధరకు అందజేస్తున్నది. ప్రతి ఏడాది పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధి 11 మండలాల ఆదివాసీ రైతులకు అవసరమైన రెండు లక్షల మొక్కలను ఐటీడీఏ పంపిణీ చేస్తున్నది.
గణనీయంగా పడిపోయిన మొక్కల ఉత్పత్తి
హెచ్‌ఎన్‌టీసీలో పాలిహౌస్ శిథిలావస్థకు చేరుకోవడం వల్ల రెండేళ్లుగా మిరియాల మొక్కల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. మిరియాల మొక్కల అభివృద్ధికి తగినంత నీడ ఉండాలి. సాధారణ వాతావరణం కంటే 10 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. తొలి రోజుల్లో పౌలిహౌస్ మొక్కల ఉత్పత్తికి అనువుగా ఉండేది. గత రెండేళ్లుగా పాలిహౌస్ పైకప్పు చిరిగిపోతూ రంధ్రాలు ఏర్పడ్డాయి. సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ప్రస్తుతం పైకప్పు పూర్తిగా శిథిలమైపోయింది. ప్రస్తుతం మొక్కలపై నేరుగా ఎండ, మంచు పడుతున్నది. మొక్కలపై పగటి ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా ఉంది. ఈ కారణంగా పాలిహౌస్‌లో మొక్కల ఉత్పత్తి నిలిచిపోయింది. పాలిహౌస్‌లో ప్రస్తుతం కేవలం 1500 మదర్ ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ మదర్ ప్లాంట్లు సైతం ఎండ, మంచు ఉధృతి వల్ల చనిపోతున్నాయి.
రైతులకు దూరమైన మేలి రకం మొక్కలు
ఉద్యాన క్షేత్రం, శిక్షణ కేంద్రం(హెచ్‌ఎన్‌టీసీ)లో పాలిహౌస్ శిథిలం కావడం వల్ల మొక్కల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో గిరిజన రైతులకు మేలి రకం మిరియాల వంగడాలు దూరమయ్యాయి. ఈ ఏడాది హెచ్‌ఎన్‌టీసీలో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల రైతులకు మొక్కలు పంపిణీ చేయలేదు. వచ్చే ఏడాది నుంచి గిరిజన రైతులకు మొక్కలు ఇచ్చే పరిస్థితి లేదు. మొక్కల ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు విత్తన మొక్కలు(మదర్ ప్లాంట్స్) సైతం చనిపోతుండడంతో రానున్న రోజుల్లో రైతులకు మేలి రకం మొక్కలు అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందించి యుద్ధప్రాతిపదికన పాలిహౌస్‌కు మరమ్మతులు చేపడితే తప్ప మదర్ ప్లాంట్లను సంరక్షించుకునే పరిస్థితి లేదు. పాలిహౌస్ మరమ్మతులు చేపట్టడంలో ఆలస్యం చేస్తే ఆధునిక మిరియాల మొక్కలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం వున్నది.