Share News

ఎలమంచిలి స్టేషన్‌కు సొబగులు

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:37 AM

ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత్‌ స్టేషన్ల జాబితాలో ఎలమంచిలిని కూడా చేర్చింది. ఇప్పటికే రెండు ప్లాట్‌ఫారాలు వుండగా కొత్తగా మరో ప్లాట్‌ ఫారం నిర్మించారు. అన్ని ప్లాట్‌ఫారాలపై గచ్చు స్థానంలో మార్బుల్స్‌ వేస్తున్నారు. ఒకటో నంబరు ప్లాట్‌ ఫారం నుంచి 2, 3 నంబర్ల ప్లాట్‌ఫారాలకు రాకపోకల కోసం ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, ఎస్కలేటర్‌, లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఆధునిక శౌచాలయాలు, వెయింట్‌ హాల్‌ నిర్మిస్తున్నారు.

ఎలమంచిలి స్టేషన్‌కు సొబగులు
రెండో నంబరు ప్లాట్‌ఫారంపై నిర్మాణంలో ఉన్న షెడ్లు

అమృత్‌ భారత్‌ కింద రూ.13 కోట్లతో అభివృద్ధి

మూడో ప్లాట్‌ఫారం నిర్మాణం

కొత్తగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, ఎస్కలేటర్‌, లిఫ్ట్‌

ప్లాట్‌ ఫారాలపై మార్బుల్స్‌, యాంటీ స్కిడ్‌ టైల్స్‌

వర్షం పడినా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా రేకుల షెడ్లు

బోగీల పొజిషన్‌ తెలిపేలా డిజిటల్‌ ఇండికేటర్లు

ఆధునిక వసతులతో వెయిటింగ్‌ హాల్‌, బాత్‌రూమ్‌లు

ఆరు నెలల్లో మారనున్న రైల్వే స్టేషన్‌ రూపురేఖలు

ఎలమంచిలి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమృత్‌ భారత్‌ స్టేషన్ల జాబితాలో ఎలమంచిలిని కూడా చేర్చింది. ఇప్పటికే రెండు ప్లాట్‌ఫారాలు వుండగా కొత్తగా మరో ప్లాట్‌ ఫారం నిర్మించారు. అన్ని ప్లాట్‌ఫారాలపై గచ్చు స్థానంలో మార్బుల్స్‌ వేస్తున్నారు. ఒకటో నంబరు ప్లాట్‌ ఫారం నుంచి 2, 3 నంబర్ల ప్లాట్‌ఫారాలకు రాకపోకల కోసం ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, ఎస్కలేటర్‌, లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఆధునిక శౌచాలయాలు, వెయింట్‌ హాల్‌ నిర్మిస్తున్నారు.

ఎలమంచిలి నియోజకవర్గంలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలు పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక ఆర్థిక మండలిలో పదుల సంఖ్యలో పలు రకాల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మరికొన్ని ఏర్పాటవుతున్నాయి. అచ్యుతాపురం మండలంలో బార్క్‌ నిర్మాణం జరుగుతున్నది. ఇక రాంబిల్లి మండలంలో ప్రత్యామ్నాయ నేవల్‌ బేస్‌ ఏర్పాటవుతున్నది. ఎస్‌ఈజడ్‌లో ఎన్‌టీపీసీ లక్ష కోట్ల రూపాయలతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ను నిర్మించనున్నది. దీంతో కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, కూలీల రాకపోకలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ఈ రెండు మండలాలకు సమీపంలో వున్న అనకాపల్లి, ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌’ల జాబితాలో చేర్చింది. ఎలమంచిలి స్టేషన్‌ను సమూలంగా మార్చేస్తున్నారు. వివిధ రకాల పనులకు సుమారు 13 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. స్టేషన్‌లో ఇప్పటి వరకు రెండు ప్లాట్‌ఫారాలు మాత్రమే వుండేవి. కొత్తగా మూడో నంబరు ప్లాట్‌ఫారం నిర్మించారు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీంతోపాటు ఎస్కలేటర్‌, లిఫ్ట్‌ సదుపాయాన్ని కూడా అదుబాటులోకి తీసుకువస్తారు. ప్లాట్‌ఫారాలపై పూర్తిస్థాయిలో షెడ్లు లేకపోవడంతో వేసవిలో, వర్షాకాలంలో ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను తొలగించడానికి ప్లాట్‌ ఫారాలపై ఆ చివర నుంచి ఈ చివర వరకు రేకుల షెడ్లు వేయనున్నారు. అన్ని ప్లాట్‌ఫారాలను మార్బుల్స్‌ తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికులు రైలు ఎక్కేచోట యాంటీ స్కిడ్‌ టైల్స్‌ వేశారు. రైలుకు సంబంధించి ఏ క్లాస్‌ బోగీ, ఎక్కడ ఆగుతుందో తెలియపరచడానికి డిజిటల్‌ ఇండికేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు, పురుషులకు ఆధునాతన బాత్‌రూమ్‌లు, ప్రయాణికులు వేచి ఉండేందుకు హాలు నిర్మిస్తున్నారు. మరో ఆరు నెలల్లో ఈ పనులన్నీ పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Feb 07 , 2025 | 12:38 AM