Share News

ఎన్నికల సందడి

ABN , Publish Date - Feb 26 , 2025 | 10:52 PM

జిల్లాలో గురువారం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కేవలం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే జరుగుతుండగా, అల్లూరి జిల్లాలో మాత్రం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించిన రెండు ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల సందడి
ఎన్నికల సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు వెళుతున్న సిబ్బంది

నేడు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌

- రంపచోడవరం పరిధిలోని 11 మండలాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ, పాడేరు పరిధిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గురువారం రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కేవలం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే జరుగుతుండగా, అల్లూరి జిల్లాలో మాత్రం పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించిన రెండు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ స్థానం పరిధిలోని 11 మండలాల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాల పరిధిలోని 11 మండలాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ పూర్తి చేశారు.

రంపచోడవరం అసెంబ్లీ స్థానంలో 4,669 మంది ఓటర్లు

జిల్లాలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు జరిగే రంపచోడవరం అసెంబ్లీ స్థానం పరిధిలో 12 పోలింగ్‌ కేంద్రాలు, 4,669 మంది ఓటర్లుకాగా, వారిలో పురుషులు 2842 మంది, మహిళలు 1,827 మంది ఉన్నారు. అలాగే మొత్తం 11 మండలాలు, 12 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంఽధించిన సామగ్రి పంపిణీ, స్వీకరణకు రంపచోడవరం, చింతూరు ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12 పోలింగ్‌ కేంద్రాలకు 12 మంది రూట్‌, జోనల్‌ అధికారులతో పాటు సూక్ష్మ పరిశీలకులను నియమించారు.

పాడేరు రెవెన్యూ డివిజన్‌లో 1,488 మంది ఓటర్లు

జిల్లాలోని పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిఽధిలో గురువారం జరిగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 11 పోలింగ్‌ కేంద్రాల్లో 1,488 మంది ఓటర్లుండగా, వారిలో పురుషులు 920 మంది, మహిళలు 568 మంది ఉన్నారు. మొత్తం 11 మండలాల్లో 11 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయడంతో సామగ్రి పంపిణీ, స్వీకరణకు పాడేరులో కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11 పోలింగ్‌ కేంద్రాలకు 11 మంది రూట్‌, జోనల్‌ అధికారులతో పాటు సూక్ష్మ పరిశీలకులను నియమించారు.

ఎన్నికలను సజావుగా నిర్వహించండి

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సిబ్బందికి జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ సూచించారు. స్థానిక ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం సందర్శించి, పలువురు ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. బ్యాలెట్‌ బాక్సులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 11 పోలింగ్‌ కేంద్రాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే రంపచోడవరం అసెంబ్లీ స్థానంలోని 12 పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బుధవారమే సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసి పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక వాహనాల్లో తరలించామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామని, పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలను మూసివేయించామన్నారు. పోలింగ్‌ సిబ్బందికి, ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్‌ శౌర్యమన్‌పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్‌, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 10:52 PM