మత్స్యగుండం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 14 , 2025 | 10:41 PM
ప్రముఖ శైవక్షేత్రం మత్స్యగుండం మహా శివరాత్రి జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ అధికారులను ఆదేశించారు.

సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్
పాడేరురూరల్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శైవక్షేత్రం మత్స్యగుండం మహా శివరాత్రి జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 25, 26, 27వ తేదీలలో నిర్వహించనున్న జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
జాతర ప్రాంగణంలో మూడు రోజులు తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, పారిశుధ్యం పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మత్స్యగుండం వద్ద గజ ఈత గాళ్లను ఏర్పాటు చేయాలని, జీసీసీ స్టాల్స్‌ను నెలకొల్పాలన్నారు. భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా అవసరమైన బస్సులను నడపాలన్నారు. అందుబాటులో ఉన్న మరుగుదొడ్లు, స్నానపు గదులు మరమ్మతులు చేపట్టాలని సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో పోలరాజు, హుకుంపేట తహసీల్దార్ కె.జయప్రకాష్, టీడబ్ల్యూ డీఈఈ ధ్రువ, పీఆర్ ఏఈఈ సంజీవరావు, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ చైర్మన్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.