ప్రధాని సభకు చకచకా ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:40 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల ఎనిమిదో తేదీన జరగనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు ముమ్మరం చేశారు.

పరుగులు తీస్తున్న అధికారులు
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుస సమావేశాలు
మూడు లక్షల మందిని సమీకరించాలని లక్ష్యం
జనాల తరలింపునకు ఏడు వేల వాహనాలు
రెండు పూటలకూ కలిపి మూడు లక్షల ఆహార పొట్లాలు సిద్ధం
విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల ఎనిమిదో తేదీన జరగనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు ముమ్మరం చేశారు. ప్రధాని రాకకు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉన్నందున పరుగులు తీస్తున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో మంత్రులు, కూటమి నేతలు నగరానికి చేరుకుంటున్నారు. మంత్రి లోకేశ్ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయగా సోమవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, ఇతర ప్రముఖులు సమావేశమయ్యారు. జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహార్ అనకాపల్లిలో సమీక్ష నిర్వహించిన అనంతరం నగరానికి చేరుకుని కేడర్‌తో సమావేశమై జన సమీకరణపై సమీక్షించారు. ప్రధాని సభకు మూడు లక్షల మందిని సమీకరించాలని లోకేశ్ ఆదేశించడంతో అందుకు తగినట్టుగా ప్రజా ప్రతినిధులు, అధికారులు సిద్ధమవుతున్నారు. బహిరంగ సభలో రెండు లక్షలు, రోడ్‌షోలో మరో లక్ష మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజక వర్గాల వారీగా జన సమీకరణపై దృష్టిసారించారు. జనాలను తరలించేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, వ్యాన్‌లు, కార్లు కలిసి సుమారు ఏడు వేల వాహనాలు వినియోగించనున్నారు. సభకు వచ్చే జనం కోసం మూడు లక్షల ఫుడ్‌ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి బహిరంగ సభకు వచ్చే వారి కోసం 1.1 లక్షల ప్యాకెట్లు బస్సులు/వాహనాలు బయలుదేరే పాయింట్లకు పంపుతారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి నాతవలస టోల్‌గేట్ వద్ద 15 వేల ప్యాకెట్లు అందిస్తారు. అనకాపల్లి నుంచి వచ్చే వారికి 40 వేలు, విజయనగరం జిల్లా నుంచి వచ్చే వారికి 15 వేల ప్యాకెట్లు ఆయా జిల్లాల అధికారులు బస్సుల్లోనే అందించనున్నారు. సభ అనంతరం తిరిగి వెళ్లేప్పుడు పంపిణీ చేసే నిమిత్తం విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారికి 1.25 లక్షలు, విజయనగరం, అనకాపల్లి నుంచి వారికి 55 వేల ఆహార ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. ఇవి కాకుండా ప్రత్యామ్నాయంగా అనకాపల్లి నుంచి వచ్చే వారికి అగనంపూడి టోల్‌గేటు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చే వారికి రాజాపులోవ సమీపాన అవంతి కళాశాల, అడవివరం జంక్షన్ వద్ద అందించేందుకు 20 వేల స్నాక్స్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. కాగా రోడ్ షోలో పాల్గొనే 70 వేల మందికి స్నాక్స్ పంపిణీ చేయాలని భావించారు. అయితే ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులు అనుమతి ఇవ్వనందున వాటి పంపిణీ రద్దు చేశారు.
ప్రధాన వేదిక వరకూ రోడ్‌షో
ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభా వేదిక వరకూ రోడ్‌షో నిర్వహించనున్నారు. దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పష్టత రాకపోయినా సోమవారం వేదిక ముందు ప్రాంగణం మధ్య నుంచి తారురోడ్డు వేశారు. దీనిని బట్టి రోడ్డు షో ఏయూ ఎకనామిక్స్ విభాగం ఎదురుగా గల వెంకటాద్రి వంటిల్లు వద్ద నుంచి ప్రారంభమై త్రీటౌన్ జంక్షన్, ఏయూ మహిళా మీదుగా వేదిక వరకూ సాగుతుందని భావిస్తున్నారు. వెంకటాద్రి వంటిల్లు నుంచి రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు నిర్మించారు. కాగా ప్రధాని పర్యటించే ప్రాంతంలో ఎస్పీజీ అధికారు లు తనిఖీలు ముమ్మరంచేశారు.
4,000 మందితో బందోబస్తు
పర్యవేక్షణకు 35 మంది ఐపీఎస్‌లు
విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు నాలుగు వేల మందితో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్టు నగర పోలీస్ అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందుజాగ్రత్తగా రూట్, రోప్ పార్టీలు, స్ర్టెకింగ్ ఫోర్స్, డామినేషన్ టీమ్‌లు, క్విక్ రియాక్షన్ టీమ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని బయటకు వచ్చినప్పటి నుంచి రోడ్‌షో ప్రారంభమయ్యే వెంకటాద్రి వంటిల్లు వరకూ మార్గాన్ని ప్రత్యేక జోన్‌లుగా విభజించి ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అలాగే రోడ్‌షో, సభ పూర్తయిన తర్వాత తిరిగి రోడ్డుమార్గంలో ఎయిర్‌పోర్టుకు చేరుకునేంత వరకూ పటిష్ఠ భద్రత ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 35 మంది ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బందోబస్తు కోసం నగరానికి రప్పించారు. నగర పోలీస్ కమిషనరేట్‌లోని అధికారులు, సిబ్బందితో సహా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న నాలుగు వేల మందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి ఇప్పటికే కొందరు సిబ్బంది నగరానికి చేరుకోగా, మిగిలిన వారంతా మంగళవారం ఉదయానికి వస్తారని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా ప్రధాని నరేంద్రమోదీ సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంతోపాటు ప్రధాని ప్రయాణించే మార్గాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాలు ఉపయోగించరాదని సీపీ శంఖబ్రతబాగ్చి సోమవారం ప్రకటన జారీచేసారు. ఎవరైనా దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.