Share News

హయగ్రీవకు ఈడీ షాక్‌

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:55 AM

వృద్ధుల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆడిన నాటకం బట్టబయలైంది.

హయగ్రీవకు ఈడీ షాక్‌

  • భాగస్వాముల ఆస్తులు అటాచ్‌మెంట్‌

  • వృద్ధాశ్రమం పేరుతో పద్దెనిమిదేళ్ల కిందట ప్రభుత్వం నుంచి 12.51 ఎకరాలు తీసుకున్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ

  • అప్పట్లో రూ.5.63 కోట్లు చెల్లింపు

  • గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు ఎంటర్‌

  • నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు, నిర్మాణాలు

  • న్యాయస్థానంలో టీడీపీ, జనసేన నేతల కేసు

  • రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత మాజీ ఎంపీ ఎంవీవీ సహా ముగ్గురిపై పోలీసులకు ‘హయగ్రీవ’ యజమాని జగదీశ్వరుడు ఫిర్యాదు

  • రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

  • అంతా కలిసి మేసింది రూ.87.64 కోట్లు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వృద్ధుల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆడిన నాటకం బట్టబయలైంది. ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరకు భూమి తీసుకొని దానిపై 15 రెట్ల వ్యాపారం చేసినట్టు తేలింది. దాంతో వారికి చెందిన రూ.44.75 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్వాధీనం చేసుకుంది. భూమిని రూ.5.63 కోట్లకు కొని దాని ద్వారా రూ.97.64 కోట్ల వ్యాపారం చేశారని ఇప్పటివరకూ వెలుగుచూసిన లెక్కలు చెబుతున్నాయి.

వృద్ధాశ్రమం కథ 2006లో మొదలు

వృద్ధులకు ఆశ్రమాలు నిర్మించి, ఉచితంగా నిర్వహిస్తామంటూ హయగ్రీవ ఫార్మ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు 2006లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయాన భూమి కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ఎండాడలోని సర్వే నంబరు 92/3లో 12.51 ఎకరాల భూమిని కేటాయించగా, అందుకుగాను రూ.5.63 కోట్లు చెల్లించారు. కొంతకాలం తరువాత అందులో నిర్మాణం చేపట్టడానికి దరఖాస్తు చేయగా కలెక్టర్‌ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ) తీసుకురావాలని జీవీఎంసీ అధికారులు సూచించారు. అడ్డంకులు కల్పిస్తున్నారంటూ ఆయన కోర్టును ఆశ్రయించడంతో నిబంధనల ప్రకారం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి మూడేళ్లలో పూర్తి చేయాలంటూ షరతులతో కూడిన అనుమతులు 2018లో ఇచ్చారు. ఆ తరువాత ఆ భూమిలో నుంచి 60 అడుగుల వెడల్పున వుడా మాస్టర్‌ ప్లాన్‌ రహదారి ఉన్నందున రివైజ్డ్‌ ప్లాన్‌ సమర్పించాలని అధికారులు సూచించారు.

హయగ్రీవ ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్‌లు 2021లో కోర్టులో కేసు వేశారు. వాటిపై వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించడంతో జిల్లా కలెక్టర్‌ ఆ బాధ్యతను జీవీఎంసీ అధికారులకు అప్పగించారు. దాంతో వారు క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. సంబంధిత పత్రాలన్నీ సమర్పించాలని, వాటిని పరిశీలించాకే తాము అనుమతిస్తామని తేల్చిచెప్పారు. దాంతో కొద్దిరోజులు ఆగి పనుల నిలిపివేతపై ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న జి.వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. పనులకు ఆటంకం కల్పించవద్దని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఏఏ పత్రాలు అవసరమో సూచిస్తూ జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందులో కలెక్టర్‌ నుంచి ఎన్‌ఓసీ కూడా ఉండాలని పేర్కొన్నారు. దాంతో జి.వెంకటేశ్వరరావు మరోసారి ఆన్‌లైన్‌లో ప్లాన్‌ ప్రతిపాదనలు సమర్పించారు. జీవీఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ దానిని పరిశీలించి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు అమలులో లేవని, అయితే రిట్‌ పిటిషన్‌ 160/2022, 191/2022 తీర్పులకు లోబడి పనులు చేసుకోవాలని సూచించింది.

సెల్ఫీ వీడియో కలకలం

ఇదిలావుండగా జగదీశ్వరుడు 2021 డిసెంబరు 19న ఒక సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశారు. జి.వెంకటేశ్వరరావు, మరికొంతమంది కలిసి తన భూమిని లాక్కున్నారని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ప్రాణ హాని కూడా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలన్నీ సమర్పించి, భాగస్వాముల మధ్య విభేదాలు ఉన్నాయని బిల్డింగ్‌ ప్లాన్‌ అనుమతిని రద్దు చేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఆయన ప్రత్యేకంగా కోరారు. యాజమాన్య హక్కులపైనే వివాదం తలెత్తినందున అనుమతులన్నీ అబెయెన్స్‌లో పెట్టాలని, కోర్టు నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకోవాలని, అంతవరకు పనులు ఆపేయాలని సూచిస్తూ జీవీఎంసీ కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు.

ప్రభుత్వం మారాక పోలీసు కేసు

గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో జగదీశ్వరుడుకు కొంత ధైర్యం వచ్చింది. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జి.వెంకటేశ్వరరావు, గద్దె బ్రహ్మాజీపై ఆరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భార్యను బెదిరించి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతోపాటు తమ సంతకాలను ఫోర్జరీ చేసి తన భూమిని కబ్జా చేశారని 2024 జూన్‌ 22న ఫిర్యాదుచేశారు. తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలో దిగింది. లోతుగా విచారణ చేసింది. అందులో భాగంగా ఎంవీవీ సత్యనారాయణ ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ భూమిని ఎనిమిది మందికి అమ్మడానికి జగదీశ్వరుడు ప్రయత్నించాడని తేల్చింది. అలాగే ఎంవీవీ బిల్డర్స్‌, జి.వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీలు కలిసి ఈ భూమి ద్వారా రూ.87.64 కోట్లు సంపాదించారని, ఆ మొత్తాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్నారని తేల్చింది. అందుబాటులో ఉన్న వారి స్థిరచరాస్తులు రూ.44.75 కోట్ల విలువైనవి స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణం ఆగిపోయింది.

Updated Date - Feb 08 , 2025 | 12:55 AM