Share News

అడవిలో వాలిన ఈగల్‌

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:28 PM

రాష్ట్రాన్ని గంజాయి రహితం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్‌’ (ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) బృందం సోమవారం గంజాయి సాగవుతున్న అడవుల్లో తొలిసారిగా అడుగుపెట్టింది. డ్రోన్‌ ద్వారా గుర్తించిన ఎనిమిది ఎకరాల్లోని గంజాయి తోటలను ధ్వంసం చేసింది.

అడవిలో వాలిన ఈగల్‌
గంజాయి మొక్కలను కత్తితో నరుకుతున్న ఈగల్‌ టీమ్‌ ఐజీ ఆకే రవికృష్ణ

డ్రోన్‌తో పెదబయలు మండలంలో మారుమూల గంజాయి తోటల గుర్తింపు

అటవీ, రెవెన్యూ, పోలీస్‌ శాఖల సహకారంతో 8 ఎకరాల్లో మొక్కలు ధ్వంసం

గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామని ఈగల్‌ టీమ్‌ ఐజీ రవికృష్ణ స్పష్టీకరణ

జిల్లాలో గంజాయి సాగు, నిర్మూలనపై కలెక్టర్‌తో భేటీ

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

రాష్ట్రాన్ని గంజాయి రహితం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్‌’ (ఎలైట్‌ యాంటీ నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) బృందం సోమవారం గంజాయి సాగవుతున్న అడవుల్లో తొలిసారిగా అడుగుపెట్టింది. డ్రోన్‌ ద్వారా గుర్తించిన ఎనిమిది ఎకరాల్లోని గంజాయి తోటలను ధ్వంసం చేసింది. రాష్ట్రంలో గంజాయి శాశ్వత నిర్మూలనకు ఐజీ స్థాయి పోలీస్‌ అధికారి ఆకే రవికృష్ణ నేతృత్వంలో ‘ఈగల్‌’ పేరిట ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ వ్యవస్థను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ బృందం ఆధ్వర్యంలో జిల్లాలో పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ పాతపాడు గ్రామానికి సమీపంలోని అడవుల్లో డ్రోన్‌ ద్వారా గంజాయి తోటలున్నట్టు గుర్తించింది. దీంతో అటవీ, రెవెన్యూ, పోలీస్‌ శాఖల సహకారంతో స్థానిక ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, ఈగల్‌ ఎస్‌పీ నగేశ్‌బాబుతో కలిసి ఈగల్‌ అధినేత ఆకే రవికృష్ణ సోమవారం పాతపాడు గ్రామానికి చేరుకుని, గంజాయి సాగవుతున్న అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. పోలీసులు, రెవెన్యూ, అటవీ సిబ్బంది గుర్తించిన 8 ఎకరాల గంజాయి తోటలను నరికేసి, అక్కడే దహనం చేశారు. ఈగల్‌ ఏర్పాటు చేసిన తరువాత ఐజీ ఆకే రవికృష్ణ జిల్లాకు రావడం ఇదే తొలిసారి కావడంతో పాటు అడవుల్లోని 8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేయడం విశేషం. అనంతరం కలెక్టరేట్‌లో గంజాయి సాగు నిర్మూలనపై కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌తో చర్చించి, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

గంజాయిని సమూలంగా నిర్మూలిస్తాం

‘ఈగల్‌’ ద్వారా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. పెదబయలు మండలంలో గంజాయి తోటల ధ్వంసం అనంతరం పాడేరు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. డ్రోన్లతో మారుమూల ప్రాంతాల్లో నిఘా పెట్టామని, ఎక్కడ గంజాయి సాగవుతున్నా గుర్తించి ధ్వంసం చేస్తామన్నారు. ప్రజలు గంజాయి సాగును వీడాలని, ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరుతున్నామన్నారు. గంజాయి సాగును చేయబోమని పాతపాడు గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించామన్నారు. ఇకపై గంజాయి సాగు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు గంజాయికి దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పీ అమిత్‌బర్దార్‌, ఈగల్‌ ఎస్‌పీ నగేశ్‌బాబు, స్థానిక డీఎస్‌పీ ప్రమోద్‌, జి.మాడుగుల, పెదబయలు మండలాలకు చెందిన పోలీస్‌, రెవెన్యూ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:28 PM