ఇంటింటికీ తాగునీరు అందించాలి
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:26 AM
జల్ జీవన్ మిషన్‌లో (ప్రస్తుతం వాటర్ గ్రిడ్) ఇంటింటికీతాగు నీరందించాల్సిన బాధ్యత గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులపై ఉందని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ స్పష్టం చేశారు. తాగునీటిపై జిల్లాలోని ఐటీడీఏల పీవోలు, గ్రామీణా నీటి సరఫరా విభాగం అధికారులు, ఎంపీడీవోలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద చేపట్టిన తాగునీటి పనులు అరకొరగా చేస్తే అందుకు బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ పథకం కింద జిల్లాలో తాగునీటి పథకాల నిర్మాణాలకు రూ.143 కోట్లు వ్యయం చేశామని, అయితే పనులు పూర్తి చేసిన గ్రామాల్లో తాగు నీరందడం లేదని ఫిర్యాదులోస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జల్ జీవన్ మిషన్ పనులు అరకొరగా చేస్తే చర్యలు
జిల్లాలో ఇప్పటికే రూ.143 కోట్లు వ్యయం
ప్రజలకు నీరందించిన తరువాతే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు
ఆర్‌డబ్యూఎస్ అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జల్ జీవన్ మిషన్‌లో (ప్రస్తుతం వాటర్ గ్రిడ్) ఇంటింటికీతాగు నీరందించాల్సిన బాధ్యత గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులపై ఉందని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ స్పష్టం చేశారు. తాగునీటిపై జిల్లాలోని ఐటీడీఏల పీవోలు, గ్రామీణా నీటి సరఫరా విభాగం అధికారులు, ఎంపీడీవోలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద చేపట్టిన తాగునీటి పనులు అరకొరగా చేస్తే అందుకు బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ పథకం కింద జిల్లాలో తాగునీటి పథకాల నిర్మాణాలకు రూ.143 కోట్లు వ్యయం చేశామని, అయితే పనులు పూర్తి చేసిన గ్రామాల్లో తాగు నీరందడం లేదని ఫిర్యాదులోస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకుని, తగు చర్యలు చేపట్టాలన్నారు. పనులు పూర్తిగా జరిగి, ప్రజలకు నీరిందించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. మీకోసం కార్యక్రమంలో తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, నివాసాలకు చాలా దూరం నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నామనే ఫిర్యాదులు రాకూడదన్నారు.
మండలాల్లో జరిగే జల్ జీవన్ మిషన్ పనులపై ఎంపీడీవోలకు అవగాహన ఉండాలని, తాగునీటి పథకాలను విధిగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్మాణం, నిర్వహణపై ఎంపీడీవోలకు, ఇంజనీరింగ్ అధికారులకు వర్కుషాపు నిర్వహించాలని ఐటీడీఏ పీవోలకు సూచించారు. తాగునీటి పథకాలను ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఈవోఆర్‌డీలు, సచివాలయ సిబ్బంది తనిఖీ చేయాలన్నారు. తాగునీటి పథకాల నిర్వహణకు పంచాయతీల నిధులు వినియోగించుకోవాలని, గ్రామాల్లో వాటర్, శానిటేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి పథకాల నిర్మాణాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, కట్టా సింహాచలం, అపూర్వభరత్, జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారి కేఎస్.జవహర్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.