తాగునీటికి కటకట
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:17 PM
మండల కేంద్రంలో వేసవికి ముందే నీటి సమస్య ప్రారంభమైంది. సాయినగర్ వాసులకు 15 రోజులుగా సీపీడబ్ల్యూ పథకం ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు.

వేసవికి ముందే సమస్య
సాయినగర్ వాసులకు 15 రోజులుగా నీటి సరఫరా బంద్
పట్టించుకోని పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు
చింతపల్లి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో వేసవికి ముందే నీటి సమస్య ప్రారంభమైంది. సాయినగర్ వాసులకు 15 రోజులుగా సీపీడబ్ల్యూ పథకం ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయినగర్ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
చింతపల్లి మేజర్ పంచాయతీలో సీపీడబ్ల్యూ పథకం ద్వారా పదేళ్లగా నీటి సరఫరా జరుగుతున్నది. ఈ పథకం ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నడుస్తున్నది. ప్రతి ఏడాది ఈ పథకం నిర్వహణ బాధ్యతలను టెండర్ ద్వారా ప్రైవేటు కాంట్రాక్టర్‌కి అప్పగించి అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయిస్తున్నది. చింతపల్లి మేజర్ పంచాయతీలో 22 వీధుల ప్రజలకు ఈ సీపీడబ్ల్యూ పథకం ఒక్కటే ఆధారం. 12 రోజుల క్రితం సీపీడబ్ల్యూ పథకం ట్యాంక్‌కి నీరు సరఫరా చేసే మోటారు పాడైపోయిందని, ఈ కారణంగా నీటి సరఫరా చేయలేకపోతున్నామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెప్పుకొచ్చారు. రోజులు గడుస్తున్నప్పటికి నీటి సరఫరా చేయకపోవడంతో సాయినగర్ ప్రజలు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం సాయినగర్ వీధిలోనున్న 300 కుటుంబాల ప్రజలు సుమారు మూడు మైళ్ల దూరంలోని పెద్దపైపు, చిన్నగెడ్డ ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కొంత మంది 500 లీటర్ల నీటికి రూ.వెయ్యి చెల్లించి ప్రైవేటు వాహనాల్లో తెప్పించుకుంటున్నారు. వృద్ధులైతే నీళ్లు తెచ్చుకునే ఓపిక లేక, వాహనాల్లో నీళ్లు తెప్పించుకునే ఆర్థిక స్థోమత లేక నరకయాతన అనుభవిస్తున్నారు.
జాడలేని సీపీడబ్ల్యూఎస్ కాంట్రాక్టర్
మేజర్ పంచాయతీ పరిధిలో ప్రతి వీధికి నీటి సరఫరా పూర్తి స్థాయిలో అందించే బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ జాడ కనిపించడం లేదు. సీపీడబ్ల్యూ పథకం నిర్వహణ బాధ్యతలను నర్సీపట్నానికి చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ ద్వారా దక్కించుకున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ ఏనాడు చింతపల్లి వచ్చి పథకం ఏవిధంగా నిర్వహిస్తున్నారని పరిశీలించిన పరిస్థితి లేదు. 15 రోజులుగా సాయినగర్ ప్రజలు నీటి సమస్యతో బాధపడుతున్నప్పటికి కాంట్రాక్టర్‌గాని, నీటి సరఫరా సిబ్బందిగాని పరిష్కరించేందుకు కనీస చర్యలు తీసుకోలేదు.
పట్టించుకోని అధికారులు
సాయినగర్‌కి 15 రోజులుగా నీటి సరఫరా జరగడంలేదని స్థానిక మహిళలు ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికి కనీసం సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక మహిళలు నీటి కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ లిఖిత పూర్వకంగా లేఖను సంబంధిత అధికారులకు అందజేశారు. నీటి సమస్యను పరిష్కరించాల్సిన ఇంజనీరింగ్ అధికారుల్లో కనీస స్పందన లేకపోవడంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.