ఎండిన జలాశయాలు
ABN , Publish Date - Feb 14 , 2025 | 10:39 PM
వేసవి రాక ముందే మండలంలో జలాశయాలు ఎండిపోయాయి. జలాశయాలు చుక్క నీరు లేకుండా బురదతో దర్శమిస్తున్నాయి.

చుక్కనీరు లేని చెరువులు, రిజర్వాయర్లు
వేసవిలో పశువులకు ఏర్పడనున్న తాగునీటి కొరత
ఆందోళనలో గిరిజన రైతాంగం
నీటి కుండీలు ఏర్పాటుకు వినతులు
కొయ్యూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): వేసవి రాక ముందే మండలంలో జలాశయాలు ఎండిపోయాయి. జలాశయాలు చుక్క నీరు లేకుండా బురదతో దర్శమిస్తున్నాయి. రిజర్వాయర్ల గర్భాలు ఎడారిని తలపిస్తున్నాయి. దీంతో మండు వేసవిలో మూగ జీవాలకు తాగునీటికి తిప్పలు తప్పని పరిస్థితి నెలకొంది.
మండలంలోని లుబ్బుర్తి, గింజర్తి, తొణుకులగెడ్డ రిజర్వాయర్, కించెవానిపాలెం రిజర్వాయరుతో ప్రధాన బూదరాళ్ల మల్లికార్జునస్వామి, చీడిపాలెం, కాట్రగెడ్డ, శరభన్నపాలెం, తదితర చెక్‌డ్యామ్‌లు పూర్తిగా ఎండిపోయాయి. కనీసం చుక్కనీరు కూడా లేదు. ఫిబ్రవరి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే జూన్ వరకు మూగజీవాలకు తాగునీరు ఎలా అందుతుందనే ఆందోళన రైతాంగంలో నెలకొంది. గిరిజనులు జనవరి నుంచి జూన్ నెలాఖరు పశువులను కట్టి మేపకుండా వదిలివేస్తారు. అవి తిరుగుతూ మేత మేసి రిజర్వాయర్లు, కొండవాగు ప్రవాహాలలోను దప్పిక తీర్చుకుంటాయి. అయితే రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు, కొడవాగులు పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు తాగునీటి అవసరాలు తీరేదెలా అని రైతాంగం ఆందోళన చెందుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పశువుల తాగునీటి అవసరాన్ని తీర్చేందుకు గ్రామ శివార్లలో నీటికుండీలు ఏర్పాటు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణాలపై నిర్లక్ష్యం చేయడంతో నీటి కుండీలు లేకుండా పోయాయని రైతాంగం ఆవేదన చెందుతోంది. రిజర్వాయర్ల గర్భాలు, చెక్‌డ్యామ్‌ల వద్ద పూడిక తీసే చర్యలు లేక నిల్వలు తొందరగా ఇంకే పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు అంటున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించి మూగజీవాలకు తాగునీరు అందించేలా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో తాగునీటి కుండీలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.