Share News

గర్భిణులకు తప్పని పాట్లు

ABN , Publish Date - Feb 16 , 2025 | 11:06 PM

స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రసవం కోసం చేరిన గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆస్పత్రిలో ఎనస్తీషియా, గైనికాలజిస్టు పోస్టులు భర్తీకాకపోవడంతో సిజేరియన్‌ ప్రసవాలు జరగడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాదిరిగా కేవలం సాధారణ ప్రసవాలు మాత్రమే జరుగుతున్నాయి.

గర్భిణులకు తప్పని పాట్లు
చింతపల్లి ఏరియా ఆస్పత్రి

సాధారణ ప్రసవాలకే పరిమితమైన ఏరియా ఆస్పత్రి

సిజేరియన్లు ప్రారంభించిన నెల రోజులకే నిలిపివేత

భర్తీకాని ఎనస్తీషియా, గైనికాలజిస్టు పోస్టులు

ప్రసవం కష్టమైతే 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం తరలించాల్సిన దుస్థితి

చింతపల్లి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రసవం కోసం చేరిన గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆస్పత్రిలో ఎనస్తీషియా, గైనికాలజిస్టు పోస్టులు భర్తీకాకపోవడంతో సిజేరియన్‌ ప్రసవాలు జరగడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాదిరిగా కేవలం సాధారణ ప్రసవాలు మాత్రమే జరుగుతున్నాయి. కాస్త ప్రసవం కష్టమైతే 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించాల్సిన దుస్థితి నెలకొంది. పురిటినొప్పులతో గర్భిణులు వాహనంలో ప్రయాణించాల్సి వస్తున్నది. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలో ప్రసవాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం అట్టహాసంగా సీజేరియన్‌ ఆపరేషన్లు ప్రారంభించగా, అవి నెల రోజులకే నిలిచిపోయాయి.

స్థానిక ఏరియా ఆస్పత్రికి చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న గిరిజన ప్రజలతో పాటు జి.మాడుగుల, కొయ్యూరు మండలాల సరిహద్దు గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. నెలలు నిండిన గర్భిణులను ప్రసవం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుంటారు. కొంత మంది నేరుగా ఏరియా ఆస్పత్రికి వస్తుంటారు. అలాగే స్థానిక వసతి గృహంలో ఉన్న గర్భిణులు సైతం ఏరియా ఆస్పత్రిలోనే ప్రసవం పొందాలి. ప్రతి రోజు 10 నుంచి 12 మంది గర్భిణులు ఏరియా ఆస్పత్రిలో ప్రసవం కోసం వస్తుంటారు. రోజూ సాధారణ ప్రసవాలు 6 నుంచి 8 జరుగుతున్నాయి. రోజుకు ఇద్దరు, ముగ్గురు గర్భిణులను సిజేరియన్‌ కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, పాడేరు జిల్లా ఆస్పత్రి, కేజీహెచ్‌కి తరలించాల్సి వస్తున్నది. దీంతో గిరిజన గర్భిణులు అవస్థలు పడుతున్నారు.

కేవలం నెల రోజుల పాటు సిజేరియన్లు

ఏరియా ఆస్పత్రిలో 2023 ఫిబ్రవరి 13వ తేదీన గత వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో సిజేరియన్లు ప్రారంభించింది. నాటి మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు, స్త్రీ వైద్యనిపుణుడు తమర్భ నరసింగరావు, నాటి సూపరింటెండెంట్‌ ఆదిత్య కీర్తి, స్త్రీ వైద్యనిపుణులు సుధాశారద, అనస్తీషియా కె.రమేశ్‌ బృందం తొలి సిజేరియన్‌ చేశారు. నెల రోజుల పాటు సిజేరియన్లు కొనసాగాయి. అనంతరం అనస్తీషియా, గైనికాలజిస్టులు బదిలీ, పదోన్నతిపై పొరుగు ఆస్పత్రులకు వెళ్లిపోవడం, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడంతో సిజేరియన్లు నిలిచిపోయాయి. నాటి నుంచి నేటి వరకు ఏరియా ఆస్పత్రిలో సిజేరియన్లు జరగడం లేదు.

భర్తీకాని ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులు

ఏరియా ఆస్పత్రిలో ఏళ్ల తరబడి ప్రత్యేక వైద్యనిపుణుల కొరత వెంటాడుతున్నది. ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు గైనికాలజిస్టులు, ఇద్దరు ఎనస్తీషియా వైద్యులు ఉండాలి. ఎనస్తీషియా పోస్టులు రెండు ఖాళీగా వున్నాయి. ముగ్గురు గైనికాలజిస్టుల్లో ప్రవీణ ఐదు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. మరో సీనియర్‌ స్త్రీ వైద్యనిపుణురాలు సుధాశారదను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి అర్థంతరంగా డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ అధికారులు బదిలీ చేశారు. ఆమె స్థానంలో మరో గైనికాలజిస్టును నియమించలేదు. మూడో గైనికాలజిస్టు శ్రీలత ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్నారు. ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు కనీస వైద్యసేవలందించేందుకు ఒక్క గైనికాలజిస్టు కూడా అందుబాటులో లేరు. ప్రస్తుతం ప్రతి రోజు గర్భిణుల ఓపీ చూసేందుకు మైదాన ప్రాంతాల నుంచి వారానికి ఒక గైనికాలజిస్టు ఏరియా ఆస్పత్రికి వస్తున్నారు.

సాధారణ చికిత్సలకే పరిమితం

ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు సాధారణ చికిత్స మాత్రమే అందుతున్నది. పగటి పూట ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను మైదాన ప్రాంతాల నుంచి వస్తున్న గైనికాలజిస్టులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలు తరువాత, మరుసటి రోజు ఉదయం పది గంటల మధ్యలో గర్భిణులు ఆస్పత్రికి వస్తే స్థానికంగా ఉన్న వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం, పాడేరు, కేజీహెచ్‌కి తరలిస్తున్నారు.

Updated Date - Feb 16 , 2025 | 11:06 PM