Share News

ప్రాణాలు పోతేగాని పట్టదా?

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:01 PM

మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ గుంతలతో దర్శనమిస్తోంది. బొర్రాగుహల రైల్వేగేటు సమీపంలోని మలుపు వద్ద రక్షణగోడ కూలి ప్రమాదభరితంగా మారింది.

ప్రాణాలు పోతేగాని పట్టదా?
రక్షణ గోడ కూలిపోయిన మలుపు

ప్రమాదభరితంగా మారిన మలుపు

బొర్రా రైల్వే గేటు సమీపంలో కూలిన రక్షణ గోడ

ఇప్పటికే అదేచోట మూడు పెద్ద ప్రమాదాలు

తాజాగా ప్రైవేటు బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

పట్టించుకోని ఆర్‌అండ్‌బీ, రైల్వే శాఖలు

మండిపడుతున్న పర్యాటకులు

అనంతగిరి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ గుంతలతో దర్శనమిస్తోంది. బొర్రాగుహల రైల్వేగేటు సమీపంలోని మలుపు వద్ద రక్షణగోడ కూలి ప్రమాదభరితంగా మారింది. ఇప్పటికే ఇక్కడ మూడు పెద్ద ప్రమాదాలు జరగ్గా.. త్రుటిలో తప్పిన ప్రమాదాలు బోలెడు ఉన్నాయి. బొర్రాగుహలను సందర్శించేందుకు పర్యాటకులు ప్రైవేటు, సొంత వాహనాల్లో భారీగా తరలివస్తుంటారు. రైల్వేగేటు సమీపంలోని రక్షణ గోడ కూలిపోయి ఎదురుగా వచ్చే వాహనాలు తప్పించే క్రమంలో అదుపు తప్పితే.. పెనూ ప్రమాదమే జరిగే అవకాశముంది. కింద వైపు కొండవాలు జారకుండా రైల్వే శాఖ కొంతవరకు కాంక్రిట్‌ వాల్‌ను నిర్మించినప్పటికీ ఆర్‌అండ్‌బీ శాఖ కనీసం రక్షణ గోడ నిర్మించలేదు. అంతేకాదు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రమాదాలు ఇలా..

-గోపాలపట్నం యల్లపువానిపాలెం ఒకే కుటుంబానికి చెందిన 40 మంది కుటుంబ సభ్యులు బొర్రాగుహలను తిలకించేందుకు ప్రైవేటు బస్సులో వెళుతుండగా బ్రేక్‌ ఫెయిలైంది. డ్రైవర్‌ చాక్యచక్యంగా కూలిపోయిన రక్షణగోడ వైపు కాకుండా బస్సును పెద్ద బండరాయిని ఢీకొట్టి నిలిపివేశాడు. రక్షణ గోడ లేని వైపు బస్సువెళ్లి ఉంటే 40 మంది పర్యాటకులు ప్రమాదానికి గురయ్యేవారు.

-గత ఆరు నెలల క్రితం కేబుల్‌ లోడుతో వెళ్తున్న వ్యాన్‌ బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో లోయలో పడింది. ఈ ప్రమాదంలోని డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు.

-రెండేళ్ల క్రితం బొడ్డవర నుంచి కోనపురం మీదుగా బట్టివలసకు సామగ్రితో వెళుతున్న లారీ ఇదే మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్‌ కాలు విగిరిపోయి, ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై వాహనదారుల ప్రాణాలంటే లెక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ శాఖ, రైల్వే శాఖ అధికారులు స్పందించి, ప్రమాదాలను నివారించేలా రక్షణ గోడను నిర్మించాలని పర్యాటకులు, గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:01 PM