డీఎస్‌సీ ఉచిత శిక్షణ ఊసేది?
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:19 AM
గిరిజన నిరుద్యోగులకు డీఎస్‌సీ ఉచిత శిక్షణ ఇస్తామని దరఖాస్తులు స్వీకరించిన ఐటీడీఏ అధికారులు ఆ తరువాత మిన్నకున్నారు. ఈ క్రమంలో తాజాగా సివిల్స్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానించారు.
డిసెంబరులో దరఖాస్తులు స్వీకరించి మిన్నకున్న ఐటీడీఏ అధికారులు
ఈ నెలలోనే డీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించిన మంత్రి నారా లోకేశ్
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించిన అధికారులు
అయోమయంలో గిరిజన నిరుద్యోగులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
గిరిజన నిరుద్యోగులకు డీఎస్‌సీ ఉచిత శిక్షణ ఇస్తామని దరఖాస్తులు స్వీకరించిన ఐటీడీఏ అధికారులు ఆ తరువాత మిన్నకున్నారు. ఈ క్రమంలో తాజాగా సివిల్స్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో డీఎస్‌సీ ఉచిత శిక్షణ ఉందా?, లేదా? అనేది స్పష్టత లేకపోవడంతో గిరిజన నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. 16 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్‌సీ నోటిఫికేషన్ ఇస్తామని గతేడాది సెప్టెంబరులోనే ప్రభుత్వం ప్రకటించింది. దీంతో స్థానిక ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్‌సీపై కోచింగ్ ఇస్తామని అప్పట్లో అధికారులు ప్రకటించారు.
ఐటీడీఏ ఆధ్వర్వంలో డీఎస్‌సీ ఉచిత కోచింగ్‌ను పొందేందుకు గతేడాది డిసెంబరులో ఐటీడీఏ అధికారులు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబరు 12 నుంచి 17వ తేదీ వరకు సుమారుగా 1,550 మంది బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఐటీడీఏ అధికారులు స్వీకరించారు. ఆయా అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి సుమారుగా 300 మందికి వేపగుంటలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో 75 లేదా 90 రోజులు ఉచిత కోచింగ్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ తరువాత దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కాగా ఐటీడీఏ ఆధ్వర్యంలో సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో డీఎస్‌సీ ఉచిత కోచింగ్‌పై స్పష్టత కరవైంది. ఈ నెలలోనే డీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేశ్ తాజాగా అసెంబ్లీలో ప్రకటించారు. వాస్తవానికి డిసెంబరు నుంచి గిరిజన అభ్యర్థులకు డీఎస్‌సీ ఉచిత కోచింగ్ ప్రారంభించి ఉంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి శిక్షణ పూర్తయి అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడేది. అయితే అప్పటి ఐటీడీఏ పీవో వి.అభిషేక్ ఉచిత శిక్షణపై దరఖాస్తుల స్వీకరణ చేపట్టి, తరువాత ప్రక్రియపై కనీసం దృష్టి సారించలేదు. దీంతో డీఎస్‌సీ ఉచిత కోచింగ్ కోసం ఎదురు చూసిన గిరిజన అభ్యర్థులకు మొండిచేయి చూపినట్టయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజన అభ్యర్థులకు డీఎస్‌సీ ఉచిత శిక్షణ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.