Share News

కీచక కాంట్రాక్టు పీఈటీ విధుల నుంచి తొలగింపు

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:51 PM

గొలుగొండ మండలం చోద్యంలోని జడ్పీ ఉన్నత పాఠశాల బాలికల పట్ల కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై శనివారం డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు.

కీచక కాంట్రాక్టు పీఈటీ విధుల నుంచి తొలగింపు
చోద్యం హైస్కూల్‌లో హెచ్‌ఎం శ్రీనివాసరావును విచారిస్తున్న డీఈవో అప్పారావునాయుడు

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై డీఈవో విచారణ

వాస్తవమని తేలడంతో చర్యలు

చోద్యం హైస్కూల్‌ హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

కలెక్టర్‌కు నివేదిక

కృష్ణాదేవిపేట, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం చోద్యంలోని జడ్పీ ఉన్నత పాఠశాల బాలికల పట్ల కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై శనివారం డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు. వాస్తవమని తేలడంతో అతనిని విధుల నుంచి తొలగించారు. సుమారు రెండు వారాల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి శుక్రవారం ఉదయం సోషల్‌ మీడియాలో రావడంతో కలెక్టర్‌ స్పందించి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో శనివారం గొలుగొండ మండలం చోద్యం హైస్కూల్‌కు గొలుగొండ ఎంఈవోలు సత్యనారాయణ, మూర్తితో వచ్చిన డీఈవో తొలుత హెచ్‌ఎం శ్రీనివాసరావుకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. అనంతరం ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. పలువురు మహిళా ఉపాధ్యాయులను, తరువాత విద్యార్థినులు, తల్లిదండ్రులను వేర్వేరుగా విచారణ జరిపారు. కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయుడు కుందూరు నూకరాజు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు విచారణలో తేలింది. దీంతో అతనిని విధుల నుంచి తొలగించారు. ఇతర రాష్ట్రాలకు విద్యార్థినులను ఆటల పోటీలకు పంపితే తోడుగా ఉపాధ్యాయినిని కూడా పంపాల్సి ఉంది. దీనిని పట్టించుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన హెచ్‌ఎం శ్రీనివాసరావుపై కలెక్టర్‌కు నివేదిస్తామని డీఈవో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణాదేవిపేట పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:51 PM