Share News

రూ.40 కోట్లతో పంచాయతీల అభివృద్ధి

ABN , Publish Date - Feb 08 , 2025 | 01:02 AM

గ్రామ పంచాయతీల్లో నిధులు ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలన్న కేంద్రం ఆదేశాలను తూచా తప్పకుండా అమలుచేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.

రూ.40 కోట్లతో పంచాయతీల అభివృద్ధి

  • ప్రణాళికలు రూపొందించిన అధికారులు

  • కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా నిధుల వ్యయం

విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

గ్రామ పంచాయతీల్లో నిధులు ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలన్న కేంద్రం ఆదేశాలను తూచా తప్పకుండా అమలుచేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అభివృద్ధి, ప్రధానంగా ప్రజల అవసరాల మేరకు పనులు చేపట్టాలన్నదే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాలోని 79 గ్రామ పంచాయతీలకు కలిపి సుమారు రూ.40 కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. పంచాయతీలకు వచ్చే ఆదాయం, కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చే నిధులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రణాళికలు ఖరారు చేశారు. అయితే పంచాయతీలకు వచ్చే ఆదాయం కంటే 25 శాతం అదనపు మొత్తంతో ప్రణాళికలు రూపొందించుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లాలో గంభీరం, వెల్లంకి, వేములవలస, బీపీ కళ్లాలు, ఎల్‌బీ పాలెం, పెద్దిపాలెం, పద్మనాభం తదితర పంచాయతీలకు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకూ ఆదాయం వస్తోంది. వెల్లంకి గ్రామ పంచాయతీకి సుమారు రూ.1.9 కోట్లు, గండిగుండం పంచాయతీకి రూ.2.93 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. పంచాయతీలకు సాధారణ నిధులు, తలసరి గ్రాంటు, రిజిస్ట్రేషన్‌ ఆదాయం, కేంద్రం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తుంటాయి. జీవీఎంసీకి ఆనుకుని ఉన్న గ్రామ పంచాయతీలు, జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న పంచాయతీలకు ఎక్కువ ఆదాయం వస్తుంటుంది. శివారులో ఉన్న పంచాయతీలకు అన్నిరకాల ఆదాయం కలిపి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 79 పంచాయతీల అభివృద్ధికి కలిపి సుమారు రూ.40 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ప్రణాళికల్లో పేర్కొన్న పనులు చేపడితేనే బిల్లులు మంజూరవుతాయి. వాటిల్లో లేని పనులు చేస్తే బిల్లులు ఇవ్వరాదని కేంద్రం ఆదేశించిందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీలు ప్రతిపాదించిన పనుల వివరాలు పీఆర్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు. సాధారణంగా పారిశుధ్యం, తాగునీరు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు, డ్రైన్లు, తదితర పనులకు నిధులు కేటాయిస్తుంటారు.

--------------------------------------------------------------------------------------

మహా కుంభమేళా ప్రత్యేక రైలు పొడిగింపు

విశాఖపట్నం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం-గోరఖ్‌పూర్‌ మధ్య ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లను కుంభమేళా ప్రయాణికుల డిమాండ్‌ మేరకు మరికొద్ది ట్రిప్పులు కొనసాగిస్తున్నట్టు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. 08588 నంబర్‌ గల ప్రత్యేక రైలు ఈ నెల 10, 22 తేదీల్లో రాత్రి 10.20 గంటలకు విశాఖలో బయలుదేరి 13, 25 తేదీల్లో రాత్రి 7.30 గంటలకు గోరఖ్‌పూర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08587 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 13, 25 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు గోరఖ్‌పూర్‌లో బయలుదేరి 15, 27 తేదీల్లో మధ్యాహ్నం 3.55 గంటలకు విశాఖ చేరుతుంది.

Updated Date - Feb 08 , 2025 | 01:02 AM