Share News

జడ్‌.జోగుంపేట ఎంపీపీ స్కూల్‌ టీచర్లకు డీఈవో షోకాజ్‌ నోటీసులు

ABN , Publish Date - Feb 13 , 2025 | 01:19 AM

విద్యా బోధనలో అలసత్వం ప్రదర్శిస్తున్న ఉపాధ్యాయులపై జిల్లా విద్యా శాఖాధికారి కొరడా ఝుళిపించారు. మూడు, నాలుగు తరగతుల విద్యార్థులు తెలుగు పాఠ్యాంశంపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవడంతో ఆయన హెచ్‌ఎంతోపాటు ఇద్దరు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

జడ్‌.జోగుంపేట ఎంపీపీ స్కూల్‌ టీచర్లకు డీఈవో షోకాజ్‌ నోటీసులు
జడ్‌.జోగుంపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నోట్‌ పుస్తకాలు పరిశీలిస్తున్న డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు

విద్యా బోధనలో అలసత్వం వహిస్తున్నందుకు చర్యలు

ఉపాధ్యాయులు పాఠశాలకు సరిగా రావడంలేదని గ్రామస్థులు ఫిర్యాదు

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో

తెలుగు సబ్జెక్టుపై వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో విద్యార్థులు

హెచ్‌ఎంతోసహా ఇద్దరు ఉపాధ్యాయినులకు నోటీసులు

రావికమతం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): విద్యా బోధనలో అలసత్వం ప్రదర్శిస్తున్న ఉపాధ్యాయులపై జిల్లా విద్యా శాఖాధికారి కొరడా ఝుళిపించారు. మూడు, నాలుగు తరగతుల విద్యార్థులు తెలుగు పాఠ్యాంశంపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవడంతో ఆయన హెచ్‌ఎంతోపాటు ఇద్దరు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ శివారు జడ్‌.జోగుంపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని ఇటీవల విద్యా శాఖ అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా విద్యా శాఖ అధికారి గిడ్డి అప్పరావునాయుడు బుధవారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయిని ఎం.పార్వతి సెలవులో వుండగా, మిగిలిన ఇద్దరు టీచర్లు పి.పద్మవల్లి, కేవీవీ లక్ష్మి పాఠశాలలో ఉన్నారు. డీఈవో తొలుత పాఠశాల రికార్డులను పరిశీలించారు. అనంతరం వివిధ సబ్జెక్టులపై విద్యార్థులకు ప్రశ్నలు వేశారు. మూడు, నాలుగు తరగతుల విద్యార్థులు కనీసం తెలుగు సబ్జెక్టుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలుఉ చెప్పలేకపోయారు. పాఠాల బోధనలో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్టు గుర్తించిన ఆయన హెచ్‌ఎంతోపాటు మిగిలిన ఇద్దరు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అంతకుముందు రావికమతం, జడ్‌.కొత్తపట్నం ఉన్నత పాఠశాలలను డీఈవో తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు పాఠాలకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో వెనుకబడ్డారో తెలుసుకుని పూర్తిగా అర్థమయ్యేలా బోధించాలని హెచ్‌ఎంకు సూచించారు.

Updated Date - Feb 13 , 2025 | 01:19 AM