క్రషింగ్ జాప్యం.. రైతులకు శాపం
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:47 AM
చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అధికారులు, చెరకు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఫ్యాక్టరీలో తరచూ క్రషింగ్‌కు అంతరాయం ఏర్పడుతున్నది. సత్వరమే మరమ్మతు పనులు పూర్తి చేయడం లేదు. దీంతో ఫ్యాక్టరీ యార్డుతోపాటు పలు కాటాల (చెరకు సేకరణ కేంద్రాలు) వద్ద పెద్ద సంఖ్యలో చెరకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు నిలిచిపోతున్నాయి.

గోవాడ షుగర్స్‌లో అస్తవ్యస్తంగా పరిస్థితి
చెరకు రైతులకు చుక్కలు చూపిస్తున్న యాజమాన్యం
కాటాల వద్దకు చెరకు వచ్చిన వారం రోజుల తరువాతే ఫ్యాక్టరీకి రవాణా
ఎండకు ఎండిపోయి బరువు తగ్గడంతోపాటు రసనాణ్యతపై ప్రభావం
ఇటు రైతులకు, అటు ఫ్యాక్టరీకి నష్టం
యాజమాన్యం తీరుపై రైతులు ఆగ్రహం
మాడుగుల రూరల్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అధికారులు, చెరకు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఫ్యాక్టరీలో తరచూ క్రషింగ్‌కు అంతరాయం ఏర్పడుతున్నది. సత్వరమే మరమ్మతు పనులు పూర్తి చేయడం లేదు. దీంతో ఫ్యాక్టరీ యార్డుతోపాటు పలు కాటాల (చెరకు సేకరణ కేంద్రాలు) వద్ద పెద్ద సంఖ్యలో చెరకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు నిలిచిపోతున్నాయి. సాంకేతిక కారణాలు, బగాస్ (చెరకు పిప్పి) పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఎప్పుడు పడితే అప్పుడు క్రషింగ్ నిలిచిపోతున్నది. మరమ్మతులు చేపట్టి, క్రషింగ్‌ను పునరుద్ధరించడానికి కనీసం ఒక రోజు పడుతున్నది. మళ్లీ కొద్ది గంటల్లోనే ఎక్కడో ఒక చోట సమస్య తలెత్తి క్రషింగ్ నిలిచిపోతున్నది. కాటాల వద్ద రోజుల తరబడి చెరకు ఉండిపోవడంతో ఎండిపోయి బరువు, రసనాణ్యత తగ్గిపోతున్నాయి. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా, పంచదార రికవరీ శాతం తగ్గిపోయి ఫ్యాక్టరీకి పరోక్షంగా నష్టం వాటిల్లుతున్నది.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో మాడుగుల మండలంలో ఎం.కెవల్లాపురం (ఘాట్‌రోడ్డు జంక్షన్), ఒమ్మలి, కేజేపురం గ్రామాల్లో చెరకు కాటాలు ఉన్నాయి. ఫ్యాక్టరీ ఫీల్డ్ సిబ్బంది ఇచ్చిన షెడ్యూల్ (కట్టింగ్ ఆర్డర్లు) ప్రకారం ఆయా రైతులు తమ పొలాల్లో చెరకు నరికించి, సమీపంలోని కాటా వద్దకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా తీసుకువస్తుంటారు. ఇక్కడ వుండే సిబ్బంది తూకం వేసి, ఫ్యాక్టరీ యాజమాన్యం పంపిన లారీల్లోకి లోడింగ్ చేయించి ఫ్యాక్టరీకి తరలిస్తుంటారు. పొలంలో చెరకు నరికిన తరువాత 24 గంటల్లో ఫ్యాక్టరీకి తరలించి క్రషింగ్ జరిపితే పంచదార రికవరీ శాతం బాగుంటుంది. అంతకన్నా ఎక్కువ సమయం పడితే పంచదార దిగుబడి తగ్గిపోతుంది. ఇది ఫ్యాక్టరీ ఆదాయంపై ప్రభావం చూపుతుంది. ఇక కాటాల వద్దకు వచ్చిన చెరకును వెంటనే తూకం వేయకుండా జాప్యం చేస్తే బరువు తగ్గిపోయి రైతులకు నష్టం వాటిల్లుతుంది. ఈ కారణాల వల్ల ఏ కాటా పరిధిలో, ఏయే రైతులు ఎప్పుడు చెరకు నరికి ఫ్యాక్టరీకి తరలించాలో సిబ్బంది ముందుగానే షెడ్యూల్ రూపొందించి, రైతులకు కట్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తుంటారు. కానీ ఈ ఏడాది చెరకు క్రషింగ్ సీజన్ నెల రోజులకుపైబడి ఆలస్యంగా ప్రారంభం కావడం, క్రషింగ్ మొదలైన తరువాత పలుమారు అంతరాయం ఏర్పడడంతో ఆ ప్రభావం చెరకు సరఫరాపై పడుతున్నది. ఫ్యాక్టరీ నుంచి లారీలు రాకపోవడంతో కాటాల చెరకు బండ్లు రోజుల తరబడి వుండిపోతున్నాయి. కొద్ది రోజుల నుంచి ఎండ తీవ్రత పెరగడంతో కాటాల వద్దనే చెరకు ఎండిపోతున్నది. ఈ నెల ఒకటో తేదీన కాటాల వద్దకు రైతులు తీసుకువచ్చిన చెరకు ఏడో తేదీన కూడా ఇక్కడే వుండిపోయిందంటే ఫ్యాక్టరీ యాజమాన్య తీరు ఎంత అధ్వానంగా వుందో అర్థం చేసుకోచ్చు.
ఎంకే వల్లాపురం చెరకు కాటాకు గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల ఏడో తేదీ వరకు 220 టన్నులకుపైగా చెరకును రైతులు తీసుకువచ్చారు. ఇంతవరకు సుమారు 60 టన్నులు మాత్రమే ఫాక్టరీకి.. అది కూడా రోజుల తరబడి ఆలస్యంగా తరలించారు. గత నెల 31వ తేదీ వరకు వచ్చిన చెరకును శుక్రవారం ఫ్యాక్టరీకి పంపారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చిన చెరకు మొత్తం (54 బండ్లు) కాటా వద్దనే వుంది. ఇది సుమారు 170 టన్నులు వుంటుందని అంచనా. క్రషింగ్ మొదలైన తరువాత ఎంకే వల్లాపురం కాటా నుంచి 203 టన్నుల చెరకు మాత్రమే ఫ్యాక్టరీకి తోలారు. కేజేపురం కాటా వద్ద ప్రస్తుతం 45 బండ్లపై సుమారు 150 టన్నుల చెరకు ఉండిపోయింది. ఒమ్మలి కాట వద్ద 27 బండ్లలో 100 టన్నుల చెరకు ఉండిపోయింది. ఈ చెరకును ఎప్పటిలోగా ఫ్యాక్టరీకి చేరుస్తారో సిబ్బంది చెప్పలేకపోతున్నారు. ఫలితంగా చెరకు ఎండిపోయి రసనాణ్యతతోపాటు బరువు తగ్గి నష్టం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.