అయ్యో... జింక!
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:49 AM
నగరానికి ఆనుకుని కంబాలకొండ అభయారణ్యంలో హాయిగా విహరించే జింకలకు రక్షణ కరువైంది.

కంబాలకొండలో వణ్యప్రాణులకు రక్షణ కరవు
ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి వాహన ప్రమాదాలు, కుక్కల దాడిలో మృతి
అభయారణ్యం చుట్టూ ధ్వంసమైన ఫెన్సింగ్
రక్షణ చర్యలు చేపట్టని అటవీ అధికారులు
జింకలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రతిపాదన
విశాఖపట్నం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):
నగరానికి ఆనుకుని కంబాలకొండ అభయారణ్యంలో హాయిగా విహరించే జింకలకు రక్షణ కరువైంది. వాటికి సరిపడా ఆహారం, నీరు లభించకపోవడం, దీనికితోడు జాతీయ రహదారికి ఆనుకుని కంబాలకొండ చుట్టూ వేసిన ఫెన్సింగ్ పాడైపోవడంతో జింకలు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. జాతీయ రహదారిపైకి చేరడంతో కొన్ని వాహన ప్రమాదాల్లో మృత్యువాతపడుతుండగా, మరికొన్ని కుక్కల దాడిలో బలవుతున్నాయి.
కంబాలకొండకు దక్షిణం వైపు ఆదర్శనగర్, ఆరిలోవ, పడమర వైపున దబ్బంబ, తూర్పున పీఎంపాలెం, కొమ్మాది వైపు రక్షణగోడులు లేకపోవడంతో జింకలు రాత్రి సమయాల్లో జనావాసాలవైపు వస్తున్నాయి. ఈ క్రమంలో గడచిన వారం రోజుల్లోనే రెండు జింకలు మృత్యువాత పడ్డాయి. సుమారు 1,400 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న కంబాలకొండ అభయారణ్యంలో వందల సంఖ్యలో జింకలున్నాయి. ఏటేటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ ఉన్న జింకలకు అదనంగా బయటిప్రాంతాల నుంచి కొన్ని జింకలు తీసుకువచ్చారు. అప్పటినుంచి ఏటేటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది.
మూడు వేలకు పైగా...
అటవీశాఖ అధికారుల అంచనా మేరకు కంబాలకొండ అభయారణ్యంలో మూడు వేలకుపైగా జింకలున్నాయి. వీటికి వర్షాకాలం, శీతాకాలంలో పుష్కలంగా ఆహారం లభిస్తుంది. వేసవి ప్రారంభం తరువాత గడ్డి పొదలు తగ్గుతూ వస్తుంటాయి. దీనికితోడు అభయారణ్యంలో చాలాచోట్ల వాగులు ఎండిపోతాయి. ఈ క్రమంలో ఆహారం, తాగునీటికి జింకలు జనారణ్యంలోకి వస్తుంటాయి. జనావాసాలులేని చోట్ల, వాహనాలు సంచరించని చోట్లకు వెళ్లినా ప్రమాదం ఉండదు. కానీ అటు ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల, ఇటు కంబాలకొండ మధ్యనుంచి వెళుతున్న జాతీయ రహదారి, మధురవాడ, పీఎంపాలెం, కొమ్మాది, ఆదర్శనగర్‌వైపు వచ్చే జింకలు ప్రమాదంలో చిక్కుకుంటున్నాయి. జాతీయ రహదారిని దాటి ఎండాడ, విశాఖ వ్యాలీ స్కూలు రోడ్డులో వెళ్లినపుడు వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నాయి. కంబాలకొండ అభయారణ్యానికి ఫెన్సింగ్‌లేని ప్రాంతాల నుంచి జింకలు జాతీయ రహదారిపైకి వస్తున్నాయి. ఆ సమయంలో వాహనాలపై వెళ్లేవారు కొందరు వాటిని చూసి, తిరిగి కంబాలకొండవైపు పంపుతుంటారు. భారీ వాహనాలు వేగంగా వెళ్లేటప్పుడు రోడ్డు దాటే క్రమంలో జింకలు ప్రమాదానికి గురవుతుంటాయి.
రక్షణ చర్యలు చేపట్టాలి
ప్రస్తుతం కంబాలకొండలో జింకల రక్షణపై అటవీశాఖ అప్రమత్తంకావాలని ప్రజలు కోరుతున్నారు. కంబాలకొండ చుట్టూ ఫెన్సింగ్ వేయడం, కొన్నిచోట్ల రక్షణ గోడలు నిర్మించాలని సూచిస్తున్నారు. అయితే కంబాలకొండలో భారీగా ఉన్న జింకల్లో కొన్నింటిని ఇతర అభయారణ్యాలకు తరలించాలని అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని తెలిసింది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అప్పటివరకు కంబాలకొండ అభయారణ్యంలో జింకలకు రక్షణ కల్పించడంతోపాటు వేసవిలో తాగునీరు, ఆహారం కోసం గడ్డిని పెంచాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.