రాళ్ల టిప్పర్లతో దడ!
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:10 AM
అనకాపల్లి మండలం కుంచంగి, వేటజంగాలపాలెం గ్రామాల పరిధిలో నుంచి భారీ వాహనాల్లో పరిమితికి మించి బండరాళ్లను రవాణా చేస్తున్నారు. టిప్పర్ బాడీ ఎత్తుకు మించి రాళ్లను నింపి, తూతూమంత్రంగా షేడ్ నెట్‌లను కప్పి తరలిస్తున్నారు. పటిష్ఠమైన భద్రతా చర్యలుచేపట్టకపోవడంతో రోడ్డు మలుపులు, గోతులు వున్నచోట టిప్పర్ లారీలు కుదుపులకు లోనై, రాళ్లు కిందపడుతున్నాయి.

భారీ వాహనాల్లో పరిమితికి మించి నల్లరాయి తరలింపు
రవాణా శాఖ నిబంధనలు బేఖాతరు
రోడ్డు మలుపులు, గోతుల వద్ద కింద పడుతున్న బండరాళ్లు
మితిమీరిన వేగంతో టిప్పర్ల రాకపోకలు
బెంబేలెత్తిపోతున్న వాహనదారులు, పలు గ్రామాల ప్రజలు
మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్న రవాణా, పోలీసు శాఖల అధికారులు
కొత్తూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం కుంచంగి, వేటజంగాలపాలెం గ్రామాల పరిధిలో నుంచి భారీ వాహనాల్లో పరిమితికి మించి బండరాళ్లను రవాణా చేస్తున్నారు. టిప్పర్ బాడీ ఎత్తుకు మించి రాళ్లను నింపి, తూతూమంత్రంగా షేడ్ నెట్‌లను కప్పి తరలిస్తున్నారు. పటిష్ఠమైన భద్రతా చర్యలుచేపట్టకపోవడంతో రోడ్డు మలుపులు, గోతులు వున్నచోట టిప్పర్ లారీలు కుదుపులకు లోనై, రాళ్లు కిందపడుతున్నాయి. ఈ సమయంలో లారీలకు సమీపంగా వెళుతున్న ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పరిమితికి మించి బండరాళ్లను రవాణా చేయవద్దని రవాణా, పోలీసు శాఖల అధికారుల హెచ్చరికలను లారీల డ్రైవర్లు బేఖాతరు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే కశింకోట- బంగారుమెట్ట (కేబీ రోడ్డు)లో రేయింబవళ్లు పరిమితికి మించి బండరాళ్లను టిప్పర్లలో రవాణా చేస్తున్నారు. ఆదివారం ఉదయం కొత్తూరు బ్రిడ్జిపై టిప్పర్ లారీ నుంచి పెద్ద బండరాయి ఒకటి రోడ్డుపై పడిపోయింది. ఈ సమయంలో టిప్పర్ పక్క నుంచి ఎవరూ వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనకాపల్లి, మాడుగుల, రోలుగుంట, రావికమతం, తదితర మండలాల్లో రాయి క్వారీల నుంచి పెద్ద పెద్ద బండరాళ్లను రాంబిల్లి మండలంలో నిర్మాణంలో వున్న ఎన్‌ఏవోబీకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాళ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లు.. రవాణా చట్టం నిబంధనలను పాటించడంలేదు. రాయి క్వారీలు నిర్వహిస్తున్న మండలాలతోపాటు ఎన్‌ఏవోబీ వరకు మధ్యలో వున్న మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లిలో మండలాల్లో కూడా టిప్పర్ల నుంచి తరచూ బండరాళ్లు కిందపడుతున్నాయి. పరిమితికి మించి రాయిని రవాణా చేయడమే కాకుండా మితిమీరిన వేగంతో టిప్పర్ లారీలు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం వుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా, పోలీసు శాఖల అధికారులు స్పందించి, ఆయా మార్గాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, పరిమితికి మించి బండరాళ్లను రవాణా చేసే వాహనాలపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.