Share News

25 వేల అంకుడు మొక్కల పెంపకం

ABN , Publish Date - Feb 22 , 2025 | 12:21 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు ఎలమంచిలి క్లస్టర్‌ పరిధిలో 25 వేల అంకుడు మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామని ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆర్‌.పూర్ణిమాదేవి చెప్పారు.

25 వేల అంకుడు మొక్కల పెంపకం
పూర్ణిమాదేవి, ఉపాధి పథకం పీడీ

ఏటికొప్పాక హస్త కళాకారుల కోసం ప్రభుత్వ నిర్ణయం

ఉపాధి హామీ పథకం పీడీ పూర్ణిమాదేవి

నక్కపల్లి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి):

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు ఎలమంచిలి క్లస్టర్‌ పరిధిలో 25 వేల అంకుడు మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామని ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆర్‌.పూర్ణిమాదేవి చెప్పారు. శుక్రవారం ఆమె ఎలమంచిలి క్లస్టర్‌పరిఽధిలోని పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, ఎలమంచిలి, రాంబిల్లి, అచుత్యాపురం మండలాలకు చెందిన ఉపాధి పథకం సిబ్బందితో ప్రగతి, ప్రణాళికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఏటికొప్పాక లక్కబొమ్మలతో రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏటికొప్పాక హస్తకళాకారులు లక్కబొమ్మలు తయారు చేయడానికి అవసరమైన ముడి సరకు అంకుడు కర్ర లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. హస్త కళాకారులకు అంకుడు కర్ర కొరత లేకుండా చూడాలన్న డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఎలమంచిలి క్లస్టర్‌ పరిధిలో ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా అంకుడు మొక్కలు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకు అటవీ, రెవెన్యూ శాఖల సహకారం తీసుకుంటామని ఆమె తెలిపారు.

కాగా ఉపాధి హామీ పథకం కింద 2024-25లో జిల్లాలో కోటి 20 లక్షల పనిదినాలకుగాను ఇంతవరకు కోటి 9 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. ఇందుకుగాను కూలీలకు రూ.315 కోట్లు చెల్లించినట్టు చెప్పారు. ఇంకా రూ.160 కోట్లతో 1,544 సీసీ రోడ్లు, 26 తారు రోడ్లు నిర్మించామన్నారు. 2025-26లో కోటి 28 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆమె చెప్పారు.

Updated Date - Feb 22 , 2025 | 12:21 AM