మత్స్యగుండంలో భక్తజన సందడి
ABN , Publish Date - Feb 27 , 2025 | 11:03 PM
హుకుంపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం మత్స్యగుండంలో మూడు రోజులుగా జరుగుతున్న శివరాత్రి వేడుకలు గురువారంతో ముగిశాయి.
ఘనంగా ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
పాడేరు/హుకుంపేట, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): హుకుంపేట మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం మత్స్యగుండంలో మూడు రోజులుగా జరుగుతున్న శివరాత్రి వేడుకలు గురువారంతో ముగిశాయి. శివరాత్రిని పురస్కరించుకుని బుధవారం రాత్రి జాగరణలో భాగంగా మత్స్యలింగేశ్వర స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించగా, కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, అరకులోయ ఎంపీ తనుజారాణి, తదితరులు పాల్గొన్నారు. అలాగే గురువారం సైతం అధిక సంఖ్యలో భక్తులు మత్స్యగుండానికి తరలివచ్చి మత్స్యలింగేశ్వరుడిని, దేవతలుగా కొలిచే మత్స్యాలను దర్శించుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించి అన్నసమారాధన నిర్వహించారు. మత్స్సగుండంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్ పర్యవేక్షించారు. పాడేరు డీఎస్‌పీ షేక్ సహబాజ్ అహ్మద్ పర్యవేక్షణలో హుకుంపేట సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్ధం పాడేరు నుంచి మత్స్యగుండానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యగుండం శివరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మినుముల గోపాలపాత్రుడు, ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్యకొండబాబు, మఠం సర్పంచ్ ఎం.శాంతకుమారి, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.