పంట కాలువ దర్జాగా కబ్జా
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:11 AM
సాగునీటి కాలువను ఓ వ్యక్తి దర్జాగా ఆక్రమించి, దానిపై షెడ్డు నిర్మించాడు. దీనిపై రైతులు పలుమార్లు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులు చేశారు. కబ్జాదారునికి అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కాలువపై నిర్మించిన షెడ్డును తొలగించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

సిమెంట్ తూము వేసి, రేకుల షెడ్డు నిర్మాణం
ఇరిగేషన్ అధికారులకు రైతులు ఫిర్యాదు
నోటీసు ఇచ్చినా పట్టించుకోని ఆక్రమణదారుడు
రెవెన్యూ, పోలీసు శాఖల సహకారం కోరుతూ ఇరిగేషన్ ఏఈ లేఖ
స్పందించకపోవడంతో మిన్నకుండిన ఏఈ
మళ్లీ పలుమార్లు ఫిర్యాదు చేసిన రైతులు
చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు
పాయకరావుపేట రూరల్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): సాగునీటి కాలువను ఓ వ్యక్తి దర్జాగా ఆక్రమించి, దానిపై షెడ్డు నిర్మించాడు. దీనిపై రైతులు పలుమార్లు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులు చేశారు. కబ్జాదారునికి అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కాలువపై నిర్మించిన షెడ్డును తొలగించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
మండలంలోని పెదరాంభద్రపురం రెవెన్యూ పరిధిలోని సత్యవరం- శ్రీరాంపురం రోడ్డు పక్కన పంట కాలువ వుంది. దీనికి ఆనుకుని రైతుల భూములు వున్నాయి. పెదరాంభద్రపురం గ్రామానికి చెందిన ఒక రైతు గత ఏడాది జూన్‌లో కాలువపై భారీ సిమెంట్ తూము వేసి పైన మట్టి కప్పాడు. ఇందుకోసం ఇరిగేషన్ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదు. తరువాత కాలువ మీద నుంచి రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టాడు. పనులు జరుగుతున్న సమయంలోనే స్థానిక రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మాణ పనులు నిలుపుదల చేయించి, ఇప్పటి వరకు నిర్మించిన కట్టడాన్ని తొలగించాలని కోరారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. పంట కాలువను ఆక్రమించి షెడ్డు నిర్మిస్తున్న వైనంపై అప్పట్లోనే ‘ఆంఽధ్రజ్యోతి’లో కధనం ప్రచురితమైంది. అప్పుడు ఇరిగేషన్ ఏఈ జి.శ్రీరామ్మూర్తి అక్కడకు వెళ్లి, షెడ్డును తొలగించాలని ఆక్రమణదారునికి నోటీసులు ఇచ్చారు. పంట కాలువను ఆక్రమించి నిర్మించిన షెడ్డును తొలగించకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. కానీ సదరు ఆక్రమణదారుడు షెడ్డును తొలగించకపోగా, షెడ్డు నిర్మాణంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కొంతమంది రైతులతో సంతకాలు చేయించి ఏఈకి లేఖ ఇచ్చారు. ఇందుకు అధికారులు అంగీకరించకుండా, పంట కాలువపై ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల షెడ్డును తొలించాలని మరోసారి నోటీసు ఇచ్చారు. అనంతరం ఈ విషయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పంట కాలువపై అక్రమంగా నిర్మించిన షెడ్డును తొలగించడానికి సహకరించాలని ఇరిగేషన్ ఏఈ లిఖితపూర్వకంగా కోరారు. కానీ ఆ రెండు శాఖల అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో షెడ్డు తొలగించాలని రైతులు శనివారం మరోసారి ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ శాఖకు జ్యుడీషియల్ అధికారాలు లేవని, అందువల్లనే ఇన్నాళ్లూ ఆగాల్సి వచ్చిందని, ఫిర్యాదు చేసిన రైతులు తోడుగా వస్తే.. తాము షెడ్డును తొలగిస్తామని ఏఈ శ్రీరామ్మూర్తి చెప్పారు.