అక్రమ మైనింగ్‌పై కొరడా
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:46 AM
జిల్లాలో మైనింగ్ అక్రమాలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ అక్రమాలతో కోట్లాది రూపాయలు గడించిన నేతలే లక్ష్యంగా అనధికార రాయి క్వారీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గనుల శాఖ విజిలెన్స్ విభాగం ఏడీ అశోక్‌కుమార్ నేతృత్వంలో మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఏర్పాడిన బృందం నల్లరాయి క్వారీలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 185కిపైగా క్వారీలు వుండగా, అనకాపల్లి మండలంలో పెద్ద సంఖ్యలో ఉన్న రాయి క్వారీల్లో అక్రమాలపై విజిలెన్స్ బందం దృష్టి సారించింది. క్వారీలు నిర్వహిస్తున్న వారు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు పొందారా? ఏ సర్వే నంబర్లలో మైనింగ్ చేసేందుకు అనుమతి పొందారు? లీజు గడువు ఎంతవరకు ఉంది?అన్న వివరాలను పరిశీలిస్తున్నారు.
రాయి క్వారీల్లో విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం
వివిధ అంశాలపై క్షుణ్ణంగా ఆరా
అనుమతులు లేని క్వారీలు సీజ్
ఉల్లంఘనలకు పాల్పడినట్టు నిర్ధారణ అయితే జరిమానా
అక్రమ క్వారీల్లో వైసీపీ నేతలవే అధికం
అధికార పార్టీ నేతలు వీరితో కుమ్మక్కైనట్టు ఆరోపణలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మైనింగ్ అక్రమాలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ అక్రమాలతో కోట్లాది రూపాయలు గడించిన నేతలే లక్ష్యంగా అనధికార రాయి క్వారీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గనుల శాఖ విజిలెన్స్ విభాగం ఏడీ అశోక్‌కుమార్ నేతృత్వంలో మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఏర్పాడిన బృందం నల్లరాయి క్వారీలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 185కిపైగా క్వారీలు వుండగా, అనకాపల్లి మండలంలో పెద్ద సంఖ్యలో ఉన్న రాయి క్వారీల్లో అక్రమాలపై విజిలెన్స్ బందం దృష్టి సారించింది. క్వారీలు నిర్వహిస్తున్న వారు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు పొందారా? ఏ సర్వే నంబర్లలో మైనింగ్ చేసేందుకు అనుమతి పొందారు? లీజు గడువు ఎంతవరకు ఉంది?అన్న వివరాలను పరిశీలిస్తున్నారు. ఇంకా మైనింగ్ వల్ల చుట్టు పక్కల ఉన్న చెరువులకు నష్టం ఏమైనా వాటిల్లుతున్నదా? సమీప గ్రామాల్లో నివాసం వుంటున్న వారు ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా? అన్న వాటి గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడుసార్టు నిర్వహించిన తనిఖీల్లో విస్తుగొలిపే అక్రమాలు వెలుగు చూశాయి. కుంచంగి, కూండ్రం, వేటజంగాలపాలెం పరిసరాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఎనిమిది రాయి క్వారీలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. వే బిల్లులు లేకుండా బండరాళ్లు, రోడ్డు మెటల్ రవాణా చేస్తున్న 11 లారీలను పట్టుకొని జరిమానా విధించారు. ఇంకా వేటజంగాలపాలెం, కుంచంగి, మార్టూరు గ్రామాల్లో అనుమతి పొందిన క్వారీల్లో నిర్దేశించిన హద్దులకు మించి మైనింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఆయా క్వారీల నిర్వాహకులకు భారీగా అపరాధ రుసము విధించి ప్రభుత్వానికి నివేదించారు.
వైసీపీ నేతల ఆధ్వర్యంలో క్వారీలు
అనకాపల్లి మండలం మార్టూరు, కుంచంగి, కూండ్రం, వేటజంగాలపాలెం, మామిడిపాలెం, బవులువాడ, హెచ్‌ఎన్ అగ్రహారం, మాకవరం గ్రామాల పరిధిలో సుమారు 120 రాయి క్వారీలు వున్నాయి. వీటిలో సగానికిపైగా క్వారీలు స్థానిక వైసీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా క్వారీలు నిర్వహిస్తున్నప్పటికీ గత ప్రభుత్వంలో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నేతలు వైసీపీ నేతలతో అంటకాగుతూ రాయి క్వారీలను సబ్ లీజుకు తీసుకొని నడుపుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మంత్రి అనుచరుడు ఒకరు గాజువాక కేంద్రంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని మైనింగ్‌లో చక్రం తిప్పారు. పలు గ్రామాల్లో అనుమతి లేకుండా క్వారీలను ఏర్పాటు చేసి జేబులు నింపుకున్నారు. క్వారీల్లో వైసీపీ నేతల అక్రమాలపై అప్పట్లో టీడీపీ, జనసేన నాయకులు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని భావించారు. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించడంలేదు. వైసీపీకి చెందిన క్వారీల నిర్వాహకులతో కొందరు కూటమి నేతలు అంటకాగుతున్నారు. అనుమతి లేని క్వారీల నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసేందుకు లోపాకారి ఒప్పందాలు కుదుర్చుకొని మైనింగ్ అక్రమాలను కొనసాగిస్తున్నారు.
గతంలో సీజ్ చేసిన క్వారీల సంగతేంటి?
జిల్లాలో ఐదేళ్ల క్రితం 2020లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు జరిపి 28 క్వారీలను సీజ్ చేశారు. ఆయా క్వారీల నిర్వాహకులు హద్దులు దాటి మైనింగ్ చేసినట్టు అప్పట్లో విజిలెన్స్ బృందాలు నిర్ధారించి రూ.120 కోట్లకుపైగా జరిమానా విధించారు. అయితే కొన్ని క్వారీల నిర్వాహకులు జరిమానా చెల్లించకుండా కోర్టును ఆశ్రయించారు. ఇదే అదనుగా భావించి కోర్టుకు వెళ్లని క్వారీల నిర్వాహకులు యథావిధిగా మైనింగ్‌ను కొనసాగించారు.
క్వారీలపై ఫిర్యాదుల మేరకు విచారణ
జిల్లాలోని రాయి క్వారీలపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న తనిఖీలపై గనుల శాఖ విజిలెన్స్ ఏడీ అశోక్‌కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి వివరణ కోరగా.. అనకాపల్లి జిల్లాలో రాయి క్వారీలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయని, గనుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో క్వారీల్లో తనిఖీలు జరుపుతున్నామన్నారు. ఇంకా పత్రికల్లో వచ్చే కథనాలను సుమోటోగా తీసుకొని తనిఖీలు చేస్తున్నట్టు చెప్పారు. అనుమతి లేని క్వారీలను సీజ్ చేసి, అదనంగా తవ్వకాలు జరిపిన క్వారీల నిర్వాహకులకు జరిమానాలు విధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామన్నారు.