బెట్టింగ్, లోన్‌యాప్‌లపై సీపీ దృష్టి
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:48 AM
ఎంతోమంది జీవితాలను అతలాకుతలం చేస్తున్న బెట్టింగ్, లోన్‌యాప్‌లకు నగరంలో అడ్డుకట్టవేయాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి భావిస్తున్నారు.

డౌన్‌లోడ్ చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా
ఐపీ ఆధారంగా గుర్తించాలని నిర్ణయం
సాధ్యాసాధ్యాలపై సాంకేతిక నిపుణులతో చర్చ
ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్‌కు ముకుతాడు వేయాలని సీపీ యోచన
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
ఎంతోమంది జీవితాలను అతలాకుతలం చేస్తున్న బెట్టింగ్, లోన్‌యాప్‌లకు నగరంలో అడ్డుకట్టవేయాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి భావిస్తున్నారు. ఆయా యాప్‌లను డౌన్‌లోడ్‌చేసే వారిని గుర్తించగలిగితే పూర్తిస్థాయిలో అరికట్టగలమని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పరిధిలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్‌చేసే వారిని గుర్తించేందుకు గల సాధ్యాసాధ్యాలపై సాంకేతిక నిపుణులతో ప్రాథమికంగా చర్చించాలని నిర్ణయించారు.
నగరంలో బెట్టింగ్ ముఠాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక మ్యాచ్‌పై ఆన్‌లైన్‌లో బెట్టింగ్ జరుగుతోంది. ఇది లాభసాటిగా మారడంతో చాలామంది బుకీల అవతారం ఎత్తి మొబైల్‌యాప్‌ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలామంది బెట్టింగ్‌కు బానిసలుగా మారుతున్నారు. ఒకసారి పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలాగైనా గెలుచుకోవాలనే కసితో అప్పులుచేసి మరీ బెట్టింగ్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేసిన అప్పులు తీర్చే దారిలేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మరికొందరైతే కుటుంబసభ్యుల ఆభరణాలు, ఆస్తులను విక్రయించి కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు.
గత నెలలో బయటపడిన ముఠా
గతనెల 17న పెదవాల్తేరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీని టాస్క్‌ఫోర్స్, సైబర్‌క్రైమ్ పోలీసులు కలిసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అతని వద్ద లభించిన ఆధారాలను బట్టి శివాజీపాలెం, పెదవాల్తేరు, ఇసుకతోటకు చెందిన కొంతమంది బుకీలుగా మారి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు రూ.400 కోట్లు విలువైన బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్టు తేల్చారు. ఈ కేసులో ఇంతవరకు 12 మందిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం నగరంలో బెట్టింగ్ ఏస్థాయిలో జరుగుతుందనేదాన్ని బయటపెట్టింది.
క్రికెట్ టోర్నీల నేపథ్యంలో...
ఇలాంటి బెట్టింగ్ ముఠాలకు నగరంలో చోటులేకుండా చేయాలని సీపీ శంఖబ్రతబాగ్చి కంకణం కట్టుకున్నారు. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలు, నిఘా పెట్టాల్సిన వ్యక్తులపై టాస్క్‌ఫోర్స్, సైబర్‌క్రైమ్ అధికారులకు సూచనలు జారీ చేశారు. చాంపియన్స్ ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెట్టింగ్ జోరు పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమైతే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ బెట్టింగ్‌కు దిగడం పరిపాటనే భావన ఉంది. ఐపీఎల్ పూర్తయ్యేసరికి ఎంతోమంది బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతుంటారే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌ను కట్టడిచేసేలా పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని సీపీ అధికారులను ఆదేశించారు.
సాంకేతికత సాయంతో...
బెట్టింగ్ అంతా మొబైల్‌యాప్‌ల ద్వారానే జరుగుతుండడంతో ఆయా యాప్‌లను గుర్తించి, వాటిని నగరంలో డౌన్‌లోడ్ చేసుకుంటున్న వారిని పట్టుకోగలిగితే లక్ష్యం చేరవచ్చని సీపీ భావిస్తున్నారు. ఇందుకోసం నగర పరిధిలోని ఇంటర్నెట్ వినియోగించే సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్, లాప్‌టాప్‌ల ఐపీ నంబర్లు ఆధారంగా గూగుల్‌ప్లేస్టోర్‌లో బెట్టింగ్‌యాప్‌లను బ్రౌజింగ్‌చేసే వారిని గుర్తించడంపై దృష్టిపెట్టారు. అలా గుర్తించేందుకు అవకాశం ఉందా? లేదా? అనేదానిపై కొంతమంది సాంకేతిక నిపుణులు, వెబ్‌సైట్ల డిజైనర్లతో సీపీ ప్రాథమికంగా చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ఇన్‌స్టెంట్ లోన్ పేరుతో భారీస్థాయిలో మోసాలు జరుగుతుండడంతో వాటిపైనా సీపీ దృష్టిపెట్టారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇన్‌స్టెంట్ లోన్ తీసుకోవాలంటే మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్‌చేసుకోవాల్సిందే. కాబట్టి అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్‌చేసేవారిని గుర్తించాలని సీపీ సాంకేతిక నిపుణుల వద్ద అభిప్రాయపడినట్టు పేర్కొంటున్నారు. ఒకవేళ బెట్టింగ్, లోన్‌యాప్‌ల డౌన్‌లోడ్‌లను ఐపీ నంబర్ల ఆధారంగా గుర్తించే అవకాశం ఉంటే నగరంలో బెట్టింగ్, లోన్‌యాప్‌ల ఆగడాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్టపడడం ఖాయమని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు.