Share News

ప్రమాదాల నియంత్రణపై సీపీ ఫోకస్‌

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:55 AM

నగరంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి కార్యాచరణ రూపొందించారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేయడంతోపాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తిస్తున్నారు. ఆయా చోట్ల నిరంతరం సిబ్బంది పర్యవేక్షణలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వరుసగా రెండు నెలలపాటు బ్లాక్‌స్పాట్‌ల వద్ద ఈ చర్యలతో నగరంలో ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలని యోచిస్తున్నారు.

ప్రమాదాల నియంత్రణపై సీపీ ఫోకస్‌

యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసిన కమిషనర్‌

నగరంలో 68 బ్లాక్‌స్పాట్‌ల గుర్తింపు

ఆయా చోట్ల సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ

జీవీఎంసీ సహకారంతో జంక్షన్‌ల అభివృద్ధికి చర్యలు

ఏఐ టెక్నాలజీతో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అనుసంధానం

నిరంతరాయంగా నో హెల్మెట్‌, డ్రంకన్‌డ్రైవ్‌ తనిఖీలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

నగరంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి కార్యాచరణ రూపొందించారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేయడంతోపాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తిస్తున్నారు. ఆయా చోట్ల నిరంతరం సిబ్బంది పర్యవేక్షణలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వరుసగా రెండు నెలలపాటు బ్లాక్‌స్పాట్‌ల వద్ద ఈ చర్యలతో నగరంలో ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలని యోచిస్తున్నారు.

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏటా సగటున 1200 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా ప్రమాదాల్లో సగటున 300 మంది ప్రాణాలు కోల్పోతుండగా మరో 1,500 మంది క్షతగాత్రులవుతున్నారు. నగరం శరవేగంగా విస్తరిస్తుండడంతో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగడం లేదు. దీనివల్ల వాహనాల రద్దీ పెరిగి, ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. కొమ్మాది, మధురవాడ, కార్‌షెడ్‌ జంక్షన్‌, హనుమంతవాక వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిగ్నల్‌పడితే కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరిపోతున్నాయి. గాజువాక, కాన్వెంట్‌ జంక్షన్‌ తదితర ప్రాంతాల మీదుగా పోర్టుకు భారీ వాహనాలు వస్తున్నాయి. దీంతో త్వరగా గమ్యం చేరుకోవాలనే ఆత్రుతలో ద్విచక్ర వాహన చోదకులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ జంపింగ్‌, ఇతర మార్గాల నుంచి వచ్చే భారీవాహనాల రాకను గుర్తించలేకపోవడం, రోడ్లపై ట్యాంకర్ల నుంచి ఆయిల్‌లీకవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా ఆశించినస్థాయిలో ఫలితం కనిపించడం లేదు. పైగా ప్రమాదాల్లో ఏటా వందలాది మంది మృత్యువాత పడడుతుండడంతో వారిపైన ఆధారపడే కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇది ఆర్థిక, సామాజిక సమస్యలకు దారితీస్తోంది.

సీపీ ప్రత్యేక దృష్టి

ఈ నేపథ్యంలో ప్రమాదాల అడ్డుకట్టకు సీపీ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు. తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి బ్లాక్‌స్పాట్‌లుగా మార్కింగ్‌ చేయాలని ట్రాఫిక్‌ విభాగం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో 68 చోట్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించడంతో వాటిని బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలను గుర్తించి, సమస్యను పరిష్కరించాలని సీపీ ఆదేశించారు. బ్లాక్‌స్పాట్‌గా గుర్తించిన చోట ట్రాకోల్ట్‌, రోడ్‌సేఫ్టీ, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్‌ చేయడంతోపాటు, ప్రమాదకరంగా వాహనాలను నడిపేవారిని గుర్తించి కేసులు నమోదుచేయాలని ఆదేశించారు. బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించిన చోట రోడ్ల డిజైన్‌ సరిగా లేకపోయినా, జంక్షన్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటే జీవీఎంసీ అధికారుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. షీలానగర్‌ జంక్షన్‌ నుంచి గాజువాక వరకు ఏడు చోట్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వాహనాలను భద్రంగా నడిపేలా డ్రైవర్లకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే బ్లాక్‌స్పాట్‌ల వద్ద రబ్బరు స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటుచేయడం, రాత్రిపూట డ్రైవర్లకు రోడ్డు మార్జిన్‌ స్పష్టంగా కనిపించేలా రేడియం రిఫ్లెక్టెడ్‌ స్టడ్స్‌ ఏర్పాటుచేయడం, డ్రైవర్లను అప్రమత్తంచేయడంతోపాటు అవగాహన కల్పించేలా బోర్డులను ఏర్పాటుచేయాలని సీపీ ఆదేశించారు. బ్లాక్‌స్పాట్‌లవద్ద లైటింగ్‌ సదుపాయం, చెట్లు, పొదలు అడ్డంగా ఉంటే వాటిని జీవీఎంసీ సహకారంతో ట్రిమ్మింగ్‌ చేస్తున్నారు.

ట్రాపిక్‌సిగ్నల్స్‌కు ఏఐతో అనుసంధానం

నగరంలో చాలామంది వాహనచోదకులు తరచూ ట్రాఫిక్‌ సిగ్నల్‌ జంపింగ్‌కు పాల్పడుతూ ప్రమాదాలకు గురవడం, లేదా ప్రమాద కారకులుగా మారుతున్నారు. దీంతో ట్రాఫిక్‌సిగ్నల్స్‌కు ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేయాలని సీపీ నిర్ణయించారు. ముందుగా నగరంలోని 110 కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను ఏఐతో అనుసంధానించేందుకు జీవీఎంసీ టెండర్లు పిలిచింది. ఇది పూర్తయితే హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినా, ట్రిపుల్‌రైడింగ్‌ చేసినా, సిగ్నల్‌ జంపింగ్‌ చేసినా, అపరిమితవేగంతో వాహనం నడిపినా ఆటోమెటిక్‌గా జరిమానా చాలానా జారీ అయిపోతుంది. దీనివల్ల ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ జంపింగ్‌లకు శతశాతం అడ్డుకట్టపడి, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సీపీ భావిస్తున్నారు. దీంతోపాటు రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబందనలపై విద్యార్థులు, ఆటోడ్రైవర్లు, భారీవాహనాల డ్రైవర్లకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ నిర్ణయించారు. ఇవన్నీ చేస్తూ వాహనాల వేగాన్ని నియంత్రించేలా నగరశివారు ప్రాంతాల్లో లేజర్‌స్పీడ్‌ గన్‌ వాహనాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, డ్రంకన్‌డ్రైవ్‌ పరీక్షలు, నో హెల్మెట్‌ డ్రైవ్‌ను నిరంతరం కొనసాగించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సీపీ భావిస్తున్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:55 AM