ఆదివాసీ విద్యార్థులకు కార్పొరేటు విద్య
ABN , Publish Date - Jan 17 , 2025 | 10:03 PM
ఆదివాసీ విద్యార్థులకు కార్పొరేటు స్థాయి విద్యను అందిస్తున్న ఏకలవ్య ఆదర్శ నివాసానుబంధ పాఠశాలలు(ఈఎంఆర్) ఆరో తరగతిలో ప్రవేశాలకు గురుకులం అధికారులు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఆరో తరగతిలో ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్
12వ తరగతి వరకు ఉచిత విద్య, సీబీఎస్‌ఈ సిలబస్
జిల్లాలో 17 పాఠశాలలు, ఒక్కొక్క పాఠశాలలో 60 సీట్లు
ఫిబ్రవరి 19 దరఖాస్తుకు గడువు
ఫిబ్రవరి 25 తేదీన ప్రవేశ పరీక్ష
చింతపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ విద్యార్థులకు కార్పొరేటు స్థాయి విద్యను అందిస్తున్న ఏకలవ్య ఆదర్శ నివాసానుబంధ పాఠశాలలు(ఈఎంఆర్) ఆరో తరగతిలో ప్రవేశాలకు గురుకులం అధికారులు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. నవోదయ పాఠశాలకు దీటుగా కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో ఈఎంఆర్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. పాఠశాలల నిర్వహణ బాధ్యతలను గిరిజన సంక్షేమ శాఖ గురుకులం అధికారులకు అప్పగించింది. రాష్ట్రంలో 28 ఈఎంఆర్ పాఠశాలలు ఉండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 17 పాఠశాలలు ఉన్నాయి. పాడేరు ఐటీడీఏ పరిధి 11 మండలాలు కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకువేలి, డుంబ్రిగుడ, అనంతగిరి, రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం, రాజవోమ్మంగి, అడ్డతీగల, చింతూరు ఐటీడీఏ పరిధిలో చింతూరు మండలాల్లో ఈఎంఆర్ పాఠశాలలు ఉన్నాయి. ఈఎంఆర్ పాఠశాలల్లో కో-ఎడ్యుకేషన్, ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యాబోధన జరుగుతున్నది. ఆరో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థినీ, విద్యార్థికి 12వ తరగతి వరకు ఉచిత విద్యను అందుతుంది.
ఒక్కొ తరగతిలో 60 సీట్లు
ఏకలవ్య పాఠశాలల్లో ఒక్కొక్క తరగతిలో 60 సీట్లు ఉన్నాయి. 30 సీట్లు బాలికలు, మరో 30 సీట్లు బాలురకు కేటాయించారు. వీటిలో 48 సీట్లు గిరిజన బాలబాలికలకు కేటాయించారు. పీవీటీజీలకు 3, దివ్యాంగులు, సంచార కుటుంబాల పిల్లలకు 3, తీవ్రవాద దాడులు, కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిలల్లకు 6సీట్లు కేటాయించారు. ఈ ఆరు సీట్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ కులాల విద్యార్థులకు కేటాయించారు.
ఫిబ్రవరి 19 దరఖాస్తుకు తుదిగడువు
ఏకలవ్య పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 15వ తేదీ తుదిగడువు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ఈనెల 22న ప్రారంభంకానున్నది. ప్రస్తుతం ఐదో తరగతిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యాభ్యాసం చేస్తూ మార్చి 31కి 10 నుంచి 13ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి వార్షిక ఆదాయం రూ.లక్ష మించని కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రవేశాలకు అర్హులు. ఆరో తరగతిలో ప్రవేశాలు పొందేందుకు ఫిబ్రవరి 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో చింతపల్లి బాలుర గురుకుల కళాశాల, పాడేరు బాలికల గురుకుల కళాశాల, అరకులోయ బాలికల గురుకుల కళాశాల, రంపచోడవరం బాలికల గురుకుల కళాశాల, చింతూరు పీవీటీజీ బాలిక పాఠశాల, రాజవొమ్మంగి బాలికల గురుకుల కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. విద్యార్థి దరఖాస్తు చేసుకున్న సమయంలోనూ ఈ పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది.
ప్రవేశ పరీక్ష సిలబస్..
ప్రవేశ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఐదో తరగతి సిలబస్‌పై పరీక్ష నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీ(మానసిక సామర్థ్యం) 50మార్కులు, అర్థమేటిక్ (అంక గణితం) 25మార్కులు, తెలుగు బాషపై 25మార్కులకు ప్రశ్నలు వస్తాయి.