Share News

ఖండాంతరాలకు ఏటికొప్పాక ఖ్యాతి

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:19 AM

అంకుడు కర్రతో సహజసిద్ధ రంగుల మేళవింపుతో తయారు చేసే ఏటికొప్పాక హస్తకళాఖండాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. స్థానిక కళాకారులు ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు, పురస్కారాలు, ప్రభుత్వాల ప్రశంసలు అందుకున్నారు. గత ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ తరపున ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ప్రకటించిన ఉత్తమ శకటం జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఏటికొప్పాక హస్త కళలు ఒక్కసారిగా యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాయి.

ఖండాంతరాలకు ఏటికొప్పాక ఖ్యాతి
బొమ్మల తయారీలో నిమగ్నమైన ఏటికొప్పాక కళాకారులు

హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు

ఒకరికి రాష్ట్రపతి అవార్డు, మరొకరికి పద్మశ్రీ పురస్కారం

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మలతో ఏపీ శకటం ప్రదర్శన

తాజాగా మూడో ఉత్తమ శకటం బహుమతికి ఎంపిక

కళా నిలయంలో ఆనందోత్సాహాలు

ఎలమంచిలి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అంకుడు కర్రతో సహజసిద్ధ రంగుల మేళవింపుతో తయారు చేసే ఏటికొప్పాక హస్తకళాఖండాలు ఖండాంతర ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. స్థానిక కళాకారులు ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు, పురస్కారాలు, ప్రభుత్వాల ప్రశంసలు అందుకున్నారు. గత ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ తరపున ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ప్రకటించిన ఉత్తమ శకటం జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. దీంతో ఏటికొప్పాక హస్త కళలు ఒక్కసారిగా యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించాయి.

ఏటికొప్పాక హస్తకళలకు సుమారు 150 సంవత్సరాల చరిత్ర వుంది. సమీపంలోని అడువుల్లో లభించే అంకుడు చెట్టు కర్రలతో చెవిపోగులు, చొక్కా గుండీలు, చిన్నారుల ఆట వస్తువులు తయారు చేసే వారు. కాలక్రమేణా బొమ్మలకు లక్కను దిద్ది అందంగా తయారు చేయడం మొదలుపెట్టారు. దీంతో లక్క బొమ్మలకు ఆదరణ పెరగడంతో గ్రామంలో మరికొంతమంది ఈ రంగంలోకి దిగారు. ప్రస్తుతం సుమారు 200 కుటుంబాలు బొమ్మల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి. మారుతున్న కాలానికి, ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త కళాఖండాలను తయారు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఏటికొప్పాక బొమ్మలకు మరింత ప్రాచుర్యం, తద్వారా ఆదరణ పెరిగాయి. ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికే పరిమితమైన ఏటికొప్పాక బొమ్మలు.. అనంతరం రాష్ట్రాన్ని, దేశాన్ని దాటి విదేశాలకు కూడా చేరుతున్నాయి. ఈ క్రమంంలో ఇక్కడి కళాకారులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గుర్తించాయి. ఏటికొప్పాకకు చెందిన పెదపాటి శరత్‌ రాష్ట్రస్థాయి అవార్డు పొందారు. శ్రీశైలపు చిన్నయాచారి 2005లో కోడిగుడ్డును పొలిన ఆకారంలో ఒక కోడిగుడ్డులో 50 కోడిగుడ్లు అమర్చేలా తీర్చిదిద్దిన కళాఖండం ఎంతో ప్రాచుర్యం పొందింది. దీంతో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. అనంతరం పలు సూక్ష్మకళాఖండాలను తీర్చిదిద్ది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఏటికొప్పాకలో సుమారు 30 ఏళ్ల క్రితం హస్తకళానిలయం ఏర్పాటు చేసి హస్త కళలకు అందిస్తున్న సేవలు, బొమ్మల తయారీలో సహజసిద్ధమైన రంగుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నందుకు చింతలపాటి వెంకటపతిరాజును కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తాజాగా ఏటికొప్పాకకు చెందిన గొర్సా సంతోశ్‌, ఏపీ ఐఅండ్‌పీఆర్‌ అధికారుల సూచనలతో తయారు చేసిన హస్తకళాఖండాలతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏపీ తరపున శకటాన్ని ప్రదర్శించారు. అంతకుముందు ఏటికొప్పాక బొమ్మల విశిష్టత గురించి ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఏటికొప్పాక కళాఖండాల గొప్పతనం ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా చేరింది. దీంతో ఏటికొప్పాక హస్త కళాకారులు పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ల ప్రోత్సాహమే ఇందుకు కారణమని అంటున్నారు.

Updated Date - Jan 30 , 2025 | 01:19 AM