టీడీఆర్ హబ్ ప్రవేశాలపై గందరగోళం
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:19 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ (టీడీఆర్) హబ్‌లో ప్రవేశాలపై గందరగోళం నెలకొంది.

పరిశోధకులకు ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు, వైవా నిలిపివేయాలంటూ గత నెలలో ఉత్తర్వులు
తాజాగా ప్రక్రియను పునః ప్రారంభించాలంటూ మౌఖిక ఆదేశాలు
అక్రమాలపై విచారణ అటకెక్కినట్టేనా?
విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ (టీడీఆర్) హబ్‌లో ప్రవేశాలపై గందరగోళం నెలకొంది. హబ్‌లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు డిపార్టుమెంట్‌ల వారీగా ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు, వైవా నిర్వహించాల్సిందిగా గతంలో అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే, ఆ ప్రవేశాలపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విచారణ చేపట్టాలంటూ కొందరు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో... పరీక్షలు, వైవా నిలిపివేయాల్సిందిగా గత నెలాఖరులో ఉన్నత విద్యా శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. టీడీఆర్ హబ్ వివరాలను సమర్పించాల్సిందిగా కోరడం జరిగింది. దీంతో ప్రవేశాల ప్రక్రియలో లోటుపాట్లన్నీ బయటకు వస్తాయని అంతా భావించారు. అయితే, నిలిపివేసిన ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలంటూ నాలుగు రోజుల కిందట ఏయూ అధికారులకు ఉన్నత విద్యా శాఖ అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. నాలుగు వారాల వ్యవధిలోనే భిన్నమైన ఆదేశాలు ఇవ్వడానికి కారణాలేమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. టీడీఆర్ హబ్ ప్రవేశాలపై వచ్చినన్ని ఆరోపణలు వర్సిటీలో మరో విభాగంపై రాలేదు. వర్సిటీలోని విభాగాలతో సంబంధం లేకుండా వందలాది మందికి హబ్‌లో అడ్డగోలుగా పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించారంటూ అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఇందులో అప్పటి ఉన్నతాధికారికి సన్నిహితుడొకరు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన ఉన్నత విద్యా శాఖ నివేదిక వచ్చిన తరువాతే తదుపరి నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ అందుకు విరుద్ధంగా ఆదేశాలు ఇవ్వడంపై ప్రొఫెసర్లు ఆశ్చర్యపోతున్నారు. భిన్నమైన ఆదేశాలతో వర్సిటీ అధికారులతోపాటు ప్రవేశాలు పొందిన అభ్యర్థులు, ఆయా విభాగాధిపతులు అయోమయానికి గురవుతున్నారు.
విభాగాలకు కేటాయించే అవకాశం
ఉన్నత విద్యా శాఖ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఏపీఆర్‌సెట్ ద్వారా ప్రవేశాలు పొందిన 685 మందికి తదుపరి దశను ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వీరందరినీ ఆయా విభాగాలకు కేటాయించనున్నారు. వీరికి కేటాయించిన గైడ్ల అర్హతను పరిశీలించి అర్హులైతే కొనసాగించనున్నారు. అనర్హులు ఉంటే వారిని తొలగించి విభాగాధిపతి ఆధ్వర్యంలో కొత్త గైడ్లను కేటాయిస్తారు. అనంతరం ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు, వైవా నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రక్రియను ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్‌సెట్ ద్వారా ప్రవేశాలు పొందని వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది. కొత్త వీసీ బాధ్యతలు స్వీకరించిన తరువాతే ఉన్నత విద్యా శాఖ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టనున్నట్టు రిజిస్ర్టార్ ప్రొఫెసర్ ధనుంజయరావు వెల్లడించారు.