Share News

కలెక్టర్‌ విస్తృత పర్యటన

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:15 PM

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాలపై పట్టు సాధించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ సూచించారు.

కలెక్టర్‌ విస్తృత పర్యటన
జర్రెల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థితో తెలుగు చదివిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌, పక్కన ఎస్పీ అమిత్‌ బర్దార్‌

జర్రెల ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వార్డెన్‌ సస్పెన్షన్‌

ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు

తాజంగి మ్యూజియం పనుల పరిశీలన

నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశం

గూడెంకొత్తవీధి/చింతపల్లి ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కనీస సామర్థ్యాలపై పట్టు సాధించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ సూచించారు. బుధవారం గూడెంకొత్తవీధి మండలం జర్రెల గ్రామ పంచాయతీలో జిల్లా ఎస్పీ అమిత్‌ బర్ద్దార్‌, చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాతో కలిసి కలెక్టర్‌ పర్యటించారు. తొలుత స్థానిక గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలుగు, గణితం, ఆంగ్లంలో విద్యార్థుల విద్యా ప్రగతిని పరిశీలించి కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యలో వెనుకబడి వుండడంతో వివిధ పాఠ్యాంశాల ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. మఽద్యాహ్నం విద్యార్థులతో కలిసి కలెక్టర్‌, ఎస్పీ, ఏఎస్పీ భోజనాలు చేశారు. విద్యార్థులతో కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠశాల వార్డెన్‌ రాత్రి వేళ వసతి గృహంలో ఉంటున్నారా?, అనారోగ్యం వస్తే విద్యార్థులను ఆస్పత్రికి ఎవరు తీసుకుని వెళుతున్నారని పశ్నించారు. వార్డెన్‌ రాత్రి వేళ వసతి గృహంలో ఉండడం లేదని, అనారోగ్యానికి గురైన వారిని పదవ తరగతి విద్యార్థులు ఆస్పత్రికి తీసుకు వెళుతున్నారని సమాధానం ఇచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కలెక్టర్‌.. వార్డెన్‌ శెట్టి చంద్రశేఖర్‌ను సస్పెండ్‌ చేశారు. అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో తెలుగు పాఠాలను చదివించారు. విద్యార్థులు సరిగా చదవలేకపోవడంతో టీచర్లు(టీఏఆర్‌ఎల్‌) కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని, ప్రతి విద్యార్థి తెలుగు, ఆంగ్లం, గణితంలో మంచి ప్రతిభ కనబర్చేవిధంగా తీర్చిదిద్దాలన్నారు. రెండు నెలల తరువాత పాఠశాలను తనిఖీ చేస్తానని, విద్యార్థుల్లో మార్పు రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక గిరిజనులు జర్రెల బ్రిడ్జి వద్ద వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నామని, బ్రిడ్జి పైనుంచి నీటి ప్రవాహం జరుగుతుందని, రోగులు, గర్భణులను సైతం ఆస్పత్రికి తీసుకొచ్చే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

మ్యూజియం నిర్మాణాలు వేగవంతం చేయాలి

తాజంగిలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాలను వేగవంతం చేయాలని టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తాజంగి పంచాయతీలో పర్యటించిన కలెక్టర్‌ మ్యూజియం నిర్మాణాలను పరిశీలించి, తాజా పరిస్థితిపై ఏఈఈ యాదకిశోర్‌ను అడిగి తెలుసుకున్నారు. మ్యూజియం నిర్మాణాలకు సంబంధించి పాత టెండర్‌ రద్దుకావడంతో కొత్త టెండర్లు పిలిచామని, ఎవరూ బిడ్‌ వేయకపోవడంతో రెండో విడత టెండర్లు పిలిచామన్నారు. దీంతో కలెక్టర్‌ టెండర్లు ప్రక్రియ పూర్తిచేసి పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. అక్కడ నుంచి తాజంగి జలాశయానికి వెళ్లిన కలెక్టర్‌ కుడి, ఎడమ కాలువలను పరిశీలించారు. కాలువల మరమ్మతులకు రూ.30 లక్షల నిధులు మంజూరు చేశామని, పనులు వేగవంతం చేయాలన్నారు. సప్పిడిమెట్ట గిరిజనులు తమ గ్రామానికి రహదారి సదుపాయం కల్పించాలని కోరారు. రహదారి నిర్మాణానికి మధ్యలో ప్రైవేటు భూమి ఉందని అధికారులు కలెక్టర్‌కి వివరించారు. దీంతో ప్రైవేటు భూమికి నగదు చెల్లిస్తామని, సాధ్యమైనంత వేగంగా రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని గిరిజనులకు ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీడీవో యూఎస్‌వీ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ రవికుమార్‌ వున్నారు.

Updated Date - Feb 12 , 2025 | 11:15 PM