ఏజెన్సీలో చలి పులి
ABN , Publish Date - Jan 04 , 2025 | 10:26 PM
జిల్లా వాసులను మంచు వణికిస్తోంది. రోజురోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. శనివారం అరకులోయలో 4.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

దట్టంగా కురుస్తున్న మంచు
చలిమంటలు వేసుకుంటున్న గిరిజనులు
సింగిల్ డిజిట్‌కు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
పాడేరు/అరకులోయ/కొయ్యూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా వాసులను మంచు వణికిస్తోంది. రోజురోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. శనివారం అరకులోయలో 4.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కురవడం, సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి ప్రారంభం అవుతోంది. శనివారం ఉదయం దట్టంగా పొగమంచు కమ్మేయడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. చలిని తట్టుకోవడానికి మంటలు వేసుకున్నారు. తాజా వాతావరణానికి స్థానికులు వణుకుతుండగా, పర్యాటకులు చలిని ఆస్వాదిస్తున్నారు.
అరకులోయలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండడంతో చలికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. రాత్రంతా చల్లదనం, మంచు చిన్నపాటి వర్షంలా కురుస్తోంది. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు మంచు తీవ్ర అంతరాయంగా ఉంటుంది. సొంత వాహనాలపై వచ్చే సందర్శకులు దట్టమైన మంచులో నడపలేక రహదారుల పక్కనే నిలిపివేస్తున్నారు. శనివారం అరకులో 4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
కొయ్యూరు మండలంలో గడిచిన రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటటల వరకు మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో వాహన చోదకులు లైట్లు వేసుకొని రాకపోకలు సాగించాల్సి వస్తోంది. చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు పొగ మంచు కమ్ముకుంటోంది. జీడి మామిడి పూతపై మంచు ప్రభావం పడుతుందని రైతాంగం ఆందోళన చెందుతోంది.
అరకులోయలో 4.1 డిగ్రీలు
ఏజెన్సీలో ఐదు రోజులుగా సింగిల్ డిజిట్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం అరకులోయలో 4.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. జి.మాడుగులలో 4.5, డుంబ్రిగుడలో 5.7, జీకేవీధిలో 5.8, పాడేరులో 5.9, హుకుంపేటలో 6.0, పెదబయలులో 7.0, చింతపల్లిలో 7.2, అనంతగిరిలో 7.9, ముంచంగిపుట్టులో 9.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదదయ్యాయి.