Share News

మళ్లీ పెరిగిన కాఫీ ధరలు

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:49 PM

కాఫీ గింజలకు మళ్లీ ధరలు పెరిగాయని పాడేరు కేంద్ర కాఫీ బోర్డు సీనియర్‌ లైజనింగ్‌ అధికారి ఎస్‌.రమేశ్‌ తెలిపారు.

మళ్లీ పెరిగిన కాఫీ ధరలు
ఎస్‌ఎల్‌వో రమేశ్‌

కిలో పార్చిమెంట్‌ రూ.452, చెర్రీ రూ.260

కేంద్ర కాఫీ బోర్డు ఎస్‌ఎల్‌వో రమేశ్‌

చింతపల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాఫీ గింజలకు మళ్లీ ధరలు పెరిగాయని పాడేరు కేంద్ర కాఫీ బోర్డు సీనియర్‌ లైజనింగ్‌ అధికారి ఎస్‌.రమేశ్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది కాఫీ ఉత్పత్తి దిగ్గజాలైన బ్రెజిల్‌, వియత్నం దేశాల్లో దిగుబడులు భారీగా పతనం కావడంతో దేశ మార్కెట్‌లో కాఫీకి డిమాండ్‌ పెరిగిందన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయన్నారు. వారం రోజుల క్రితం కర్ణాటక ఇండియన్‌ కాఫీ ట్రేడింగ్‌ అసోసియేషన్‌(ఐసీటీఏ)లో అరబికా పార్చిమెంట్‌ కిలో రూ.440, చెర్రీ(గుళ్ల) రూ.240 ధర ఉండగా, సోమవారం నాటికి అరబికా పార్చిమెంట్‌ కిలో రూ.452-460, చెర్రీ కిలో రూ.260-264 ధర లభించిందన్నారు. అలాగే రొబస్ట్రా పార్చిమెంట్‌ కిలో రూ.376-388, చెర్రీ రూ.218-220 ధర లభిస్తుందన్నారు. కాఫీ ధరలు భారీగా పెరగడంతో గిరిజన రైతులు కాఫీ గింజలను తక్కువ ధరకు విక్రయించుకుని నష్టపోరాదన్నారు. తాజా కాఫీ ధరల కోసం కాఫీ కృషి తరంగా ఉచిత కాల్‌ సెంటర్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - Jan 06 , 2025 | 11:49 PM