జీవీఎంసీ బడ్జెట్ సమావేశానికి కోడ్ అడ్డంకి
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:39 AM
జీవీఎంసీ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది.

మార్చి నెల ఎనిమిదో తేదీ వరకూ అమలు
ఏం చేయాలో అర్థంకాక అధికారుల మల్లగుల్లాలు
సవరణ బడ్జెట్‌కు బ్రేకులు
నగరంలో అభివృద్ధి పనులపై ప్రభావం పడే అవకాశం
విశాఖపట్నం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4,554.27 కోట్ల బడ్జెట్ ముసాయిదాను జీవీఎంసీ అధికారులు రూపొందించారు. దీనిని స్టాండింగ్ కమిటీ స్వల్ప సవరణలతో గత నెల 20న ఆమోదించింది. జనవరి మొదటి వారంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేసి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని మేయర్ గొలగాని హరివెంకటకుమారి భావించారు. అయితే ఈనెల ఎనిమిదిన ప్రధాని నరేంద్రమోదీ నగరానికి రావడంతో సమావేశం నిర్వహణ సాధ్యపడలేదు. తర్వాత సంక్రాంతి హడావుడి మొదలవడంతో పండుగ తర్వాత బడ్జెట్ సమావేశం ఏర్పాటుచేయాలనుకున్నారు. 29న బడ్జెట్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ అధికారులకు మేయర్ సూచించారు. ఈలోగా కమిషనర్ పి.సంపత్‌కుమార్‌ను బదిలీ చేస్తూ ఈనెల 21న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్‌ను జీవీఎంసీ అధికారులు కలిసి బడ్జెట్ సమావేశం ఏర్పాటు అంశం ప్రస్తావించగా, కొత్త కమిషనర్ నియామకం ఈనెల 31లోగా జరిగే అవకాశం ఉన్నందున కొద్దిరోజులు ఆగాలని సూచించారు. అప్పటికీ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించకపోతే ఒక తేదీ నిర్ణయించే అంశంపై చర్చిద్దామని వివరించారు. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రభుత్వం బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మార్చి ఎనిమిదో తేదీ వరకు అమలులో ఉంటుంది. కోడ్ ఉండగా బడ్జెట్ సమావేశం నిర్వహణకు అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఏటా జనవరిలోనే ముగిసే బడ్జెట్ సమావేశం ఈసారి ఆర్థిక సంవత్సరం చివరిలో నిర్వహించుకోవలసి వస్తుందని అధికారులు చెబుతున్నారు. కొత్త బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదించకపోతే 2024-25 సవరణ బడ్జెట్‌ను అమలు చేయడానికి కూడా అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని విభాగాలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఖర్చయిపోయినందున, కొత్త పనులు చేపట్టేందుకు వీలుండదని, దీని ప్రభావం నగర అభివృద్ధి, ఇతర కార్యక్రమాల నిర్వహణపై పడుతుందని పేర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి కోసం లేఖ రాస్తే ఏమైనా వెసులుబాటు లభిస్తుందేమోనని అధికారులు ఆలోచిస్తున్నారు.