Share News

స్వచ్ఛ సర్వేక్షణ్‌... మహా టెన్షన్‌

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:18 AM

కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో ఈసారి జీవీఎంసీ ప్రదర్శనపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్వచ్ఛ సర్వేక్షణ్‌... మహా టెన్షన్‌

  • వచ్చే నెల మొదటి వారంలో నగరానికి కేంద్ర బృందం

  • ఇక్కడ చూస్తే పరిస్థితులు అధ్వానం

  • గత నెల 17 నుంచి జీవీఎంసీ కమిషనర్‌ పోస్టు ఖాళీ

  • నిలిచిపోయిన క్షేత్రస్థాయి పర్యటనలు

  • అధికారులు, సిబ్బందిలో నిర్లిప్తత

  • దిగజారిన పారిశుధ్యం

  • ఇదే పరిస్థితి కొనసాగితే గత ఏడాది సాధించిన ర్యాంకును నిలబెట్టుకోవడం కష్టం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో ఈసారి జీవీఎంసీ ప్రదర్శనపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది పరిశుభ్రత నగరాల్లో నాలుగో ర్యాంకు దక్కించుకున్న జీవీఎంసీ...ఈ ఏడాది ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం నగరానికి రానున్నది. అందుకు అనుగుణంగా నగరంలో సన్నద్ధత కనిపించకపోవడంతో ర్యాంకుపై సందేహాలు నెలకొంటున్నాయి.

రాష్ట్రంలో అతిపెద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌గా జీవీఎంసీకి గుర్తింపు ఉంది. అలాంటి కార్పొ రేషన్‌లో గత నెల 17 నుంచి కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉంంది. కమిషనర్‌గా పనిచేసిన సంపత్‌కుమార్‌ను మునిసిపల్‌ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిరప్రసాద్‌కు ఇన్‌చార్జి కమిషనర్‌ బాధ్యతలు అప్పగించింది. కలెక్టర్‌ తన బాధ్యతలతో నిత్యం బిజీగా ఉంటుండడంతో జీవీఎంసీ కార్యకలాపాలపై లోతుగా దృష్టిసారించేందుకు సమయం ఉండడం లేదు. కేవలం ముఖ్యమైన ఫైళ్లు మాత్రమే ఆయన చూస్తున్నారు.

పూర్తిస్థాయి కమిషనర్‌ ఉన్నప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లేవారు. అక్కడ పారిశుధ్య నిర్వహణ తీరు, డ్రైనేజీలు, రోడ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించ డంతోపాటు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకునేవారు. అలాగే పచ్చదనం, నగర సుందరీకరణ, గ్రీన్‌ బెల్ట్‌, పార్కుల నిర్వహణ, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం అమలు వంటి విషయాల్లో అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీచేయడం, సూచనలు ఇవ్వడం చేసేవారు. అధికారులు మరుసటిరోజు ఆయా అంశాల్లో సాధించిన పురోగతిని కమిషనర్‌కు తిరిగి వివరించేవారు. దీనివల్ల నగరంలో సమస్యలు పరిష్కారం కావడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి కనిపించేది. కానీ గత 45 రోజులుగా పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ గాడితప్పింది. అధికారుల తనిఖీలు లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బందిలో నిర్లక్ష్యం చోటుచేసుకుంది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం అమలు పూర్తిగా మరుగునపడిపోయింది. గతంలో దుకాణాలు, హోటళ్లు వంటి కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ల వద్ద చెత్త కనిపిస్తే బాధ్యులైన వ్యాపారులకు జరిమానాలు, విధించడం, కేసులు నమోదుచేయడం చేసేవారు. ఇప్పుడు అటువంటి చర్యలు లేకపోవడంతో దుకాణాల పక్కన మళ్లీ చెత్త దర్శనమిస్తోంది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుపై ప్రభావం

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2024 సర్వే గత ఏడాది జరగాల్సి ఉంది. అయితే సాధారణ ఎన్నికల కారణంగా జరగలేదు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కేంద్ర బృందాలు వివిధ నగరాల్లో పర్యటించి సర్వే చేస్తున్నాయి. అందులో భాగంగా విశాఖకు మార్చి మొదటి వారంలో కేంద్ర బృందాలు వచ్చే అవకాశం ఉందని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీఎంసీ 2015లో 237, 2016లో ఐదు, 2017లో మూడు, 2018లో ఏడు, 2019లో 23, 2020, 2021లో తొమ్మిది, 2022, 2023 పోటీల్లో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. ఈ ఏడాది ర్యాంకు మరింత మెరుగుపడుతుందని భావించినప్పటికీ గత 45 రోజులుగా పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడంతో నగరంలో పారిశుధ్యం దిగజారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్లాస్టిక్‌ నియంత్రణ, గెడ్డల సుందరీకరణ వంటి అంశాల్లో కూడా వెనుకబాటుతనం కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో కేంద్ర బృందాలు నగరానికి వస్తే ఆయా అంశాలను పరిశీలించి తక్కువ మార్కులు వేసే అవకాశం ఉందని జీవీఎంసీ అధికారులే అంటున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 01:18 AM