ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యం
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:03 PM
ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ అన్నారు.

జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే. అభిషేక్‌గౌడ
‘స్వచ్ఛ దివస్’లో పాల్గొన్న జీసీసీ చైర్మన్ కిడారి, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, తదితరులు
ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించిన జేసీ
పాడేరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ అన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర పేరిట ఆదివారం ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా గ్రామాల్లోని ప్రజలు ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ, చెత్త నుంచి సంపద సృష్ణి, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి నెలా మూడో శనివారం విధిగా స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అలాగే జిల్లాను ప్లాస్టిక్ రహితం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు కొనసాగించాలన్నారు. అలాగే ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను సేకరించి, వర్మీ కంపోస్ట్‌కు వినియోగించాలన్నారు. బహిరంగ మల విసర్జనకు తావులేకుండా ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు సమకూర్చాలన్నారు.
స్వచ్ఛత జీవనంలో భాగం కావాలి: కిడారి
స్వచ్ఛత అనేది ప్రజల జీవనంలో భాగం కావాలని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సమాజంలో అందరూ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. అంతకు ముందు అంబేడ్కర్ సెంటర్‌లో జాతిపిత మహాత్మగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్‌గౌడ అందరితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ శార్యమన్‌పటేల్, మాజీ మంత్రి మణికుమారి, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొర్రా విజయరాణి, సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి, టీడీపీ డివిజన్ నేత పాండురంగస్వామి, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.