గిన్నెలకోట పంచాయతీలో చిన్నారులకు వింత వ్యాధి
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:03 PM
మండలంలోని మారుమూల గిన్నెలకోట పంచాయతీ పరిఽధిలోని మూడు గ్రామాలలో చిన్నారులకు వింత వ్యాధి సోకడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది.

ప్రబలిన జ్వరం, దద్దుర్లు, కండ్లకలకలు
95 మంది పిల్లలకు వ్యాధి లక్షణాలు
చిన్న అమ్మోరంటున్న గిరిజనులు
అప్రమత్తమైన రూడకోట పీహెచ్‌సీ వైద్యులు
పెదబయలు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల గిన్నెలకోట పంచాయతీ పరిఽధిలోని మూడు గ్రామాలలో చిన్నారులకు వింత వ్యాధి సోకడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే రూడకోట పీహెచ్‌సీ వైద్యుడు సత్యారావు, సిబ్బంది శనివారం లండులు, బొంగజంగి, మెట్టగూడ గ్రామాలలో మెడికల్ క్యాంప్‌లు నిర్వహించారు. పదేళ్లలోపు చిన్నారులు జ్వరం, దద్దుర్లు, నీరసం, కండ్లకలకలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు తొలుత జ్వరం వచ్చిందని, రెండో రోజు దద్దుర్లు, కండ్లకలకలు వచ్చాయని స్థానికులు వైద్యుడికి తెలిపారు. మూడు గ్రామాలలో 95 మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. ఈ వ్యాధి గాలి ద్వారా ప్రబలి ఉండవచ్చని ఆయన తెలిపారు. అయితే ఆయా గ్రామస్థులు మాత్రం చిన్న అమ్మోరు సోకిందని వారం, పది రోజులు అవుతున్న చిన్నారులకు స్నానాలు చేయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యుడు తెలిపారు. చిన్నారులకు వ్యాఽధిని బట్టి మందులు ఇచ్చామని, రెండు రోజుల్లో మరోసారి మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. ఆదివారం ఆయా గ్రామాలకు ఎల్‌టీని పంపి రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పిల్లలకు వింత వ్యాధి సోకడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఆయ పంచాయతీలలో మెడికల్ క్యాంప్‌లతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపడితే మంచిదని స్థానికులు కోరుతున్నారు.